పని సూత్రాలు. 47. మాట తీరు తో ముందుకు పోవాలి !
సామాన్యం గా మనం పనిచేసే చోట, మనం నలుగురి తో కలిసి పోవాలనే తపన తో , కాస్త ఎక్కువ గా మాట్లాడుతూ ఉంటాము ! కొన్ని సమయాలలో అనవసరమైన విషయాలు కూడా ! గాసిప్ లు కూడా సర్వ సాధారణమే ! మనం చేయ వలసిన పని కాకుండా ఇతరత్రా చేసే పనులన్నీ కూడా , ఉత్పాదన ను ప్రభావితం చేస్తాయి !ముఖ్యం గా , మన వ్యక్తి గత పురోగతి కి కూడా అవరోధం అవుతాయి ! కొన్ని సమయాలలో మనకు తెలియ కుండానే !
మీరు పని చేసే స్థానం లో, మీ బాసు మాట తీరు గమనించండి ! సామాన్యం గా మీ బాసు అధిక ప్రసంగం చేయడు ! ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతాడు ! అనవసర హస్కు లు వేయడు !’ మనం’ చేయవలసింది చాలా ఉంది ‘ అని అంటాడు !’ నేను’ చేయవలసింది అనడు ! అంటే, తాను మాట్లాడే ప్రతి మాటలోనూ , సమిష్టి గా మిగతా అందరినీ కలుపుకుంటాడు ! అంటే మీ బాసు, మీ కంపెనీ సరిగా నడవాలంటే , మీ కంపెనీ లో పని చేస్తున్న ప్రతి వారి పాత్రా ముఖ్యమైనదని నమ్ముతాడు ! కేవలం వ్యక్తి గతం గా , తన గురించి చెప్పుకోడు , తన వ్యక్తి గత విషయాల గురించి ఎక్కువ గా మాట్లాడడు !
ఇంకా మీరు, మీ బాసు ను పరిశీలిస్తే ఈ విషయాలు కూడా మీకు ప్రస్ఫుట మవుతాయి : మీ బాసు తాను మాట్లాడే ప్రతి మాటకూ వేస్తాడు త్రాసు ! అంటే మాట్లాడే ప్రతి మాటనూ కొలిచి మాట్లాడుతాడు ! మీ బాసు ఎప్పుడూ ఎవరినీ తిట్టడు ! తిట్టే బాసు , ప్రత్యేకించి , ఇతరుల ముందు , ఇంకో ఉద్యోగిని తిట్టే బాసు , బాసు ఉద్యోగానికి అనర్హుడు ! మీరు క్రితం రోజు టీవీ లో వచ్చిన కార్యక్రమాలను మీ ఇతర కొలీగ్స్ తో మాట్లాడు కుంటున్నా కూడా , మీ బాస్ , ఆ విషయాలు తనకు పట్టనట్టు , చేయ వలసిన పని గురించే ఆలోచిస్తాడు ! మీరు చేయవలసిన పని గురించే మాట్లాడుతాడు కూడా ! ఇంకో ముఖ్య విషయం : మీ బాస్ ఎప్పుడూ , ఏ విషయం మాట్లాడ వలసి వచ్చినా కూడా , వెంటనే బడ బడా వాగేయ కుండా , కొంత సమయం తీసుకుని , ఆలోచించి , అప్పుడే , అవసరమైన రెండు మూడు మాటలు మాట్లాడతాడు !
అనవసరం గా నోరు ‘ పారేసుకోడు ‘ !
మీరు ముందుకు పోవాలనుకుంటే , అంటే ఒక బాస్ అవ్వాలని లక్ష్యం ఏర్పరుచుకుంటే , పైన చెప్పిన విషయాలను ఆచరణ లో పెట్టడమే ! మీ సహా ఉద్యోగులను ఒక తండ్రి లాగానో , తల్లి లాగానో , చూడడమే , అంటే , వారి బాధ్యతలను వారికి అప్పగించి , దూరం నుంచి , పర్యవేక్షణ చేయడమే ! అట్లాగని మీ బాధ్యత మీరు మర్చి పోవడం కాదు ! మీరెప్పుడూ , మీ లక్ష్యం గురించిన పధకాల మీద గురి పెట్టి , అప్రమత్తత తో ముందుకు పోతూ ఉండడమే ! ఎక్కువగా మాట్లాడక పోవడం అంటే , మీరు గర్వం గానూ , ఇతర ఉద్యోగులంటే నిర్లక్ష్యం గానూ ప్రవర్తిస్తున్నట్టు కాదు ! గర్వమూ , నిర్లక్ష్య భావనా , మీరు మీ రంగం లో ఎదగడానికి ఎప్పుడూ దోహద పడవు ! మీరు మీ పనిని బాధ్యతా యుతం గా చేస్తూ , ఒక ఆత్మ విశ్వాసం నిండిన వ్యక్తి గా, గంభీరం గా, హుందాగా , మీ లక్ష్య సాధన కై నిశ్శబ్దం గా శ్రమించడమే !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
”నోరా వీపుకి దెబ్బలు తేకే” అని సామెత కదా! మాట మంత్రం. అలా ఉపయోగించుకోవాలి. చెప్పడం నా ధర్మం వినకపోతె నీ ఖ…..
మాటతీరు బాగుంటే మంచి ఫలితమే పొందవచ్చు,
అందుకే సుభాషితం ఎప్పుడూ శుభమే అంటారు.