పని సూత్రాలు. 46.మీ కట్టు బట్టలతో చేయండి , కనికట్టు !
ప్రపంచం చాలా భౌతికమైనది ! అంటే , భౌతి కం గా కనిపించే వాటికే , విలువలు ఇవ్వడమూ , తీసుకోవడమూ జరుగుతుంది ! ప్రత్యేకించి, కార్పోరేట్ సెక్టర్ లోనూ , మిగతా వ్యాపార దృష్టి ఉన్న ఏ సంస్థ లోనైనా కూడా ! మీరు చేసే ఏ ఉద్యోగం లోనైనా కూడా , చక్కగా వస్త్ర ధారణ చేసుకుని ఉండాలి, ప్రతి రోజూ ! మీ వస్త్ర ధారణ విషయం లో అత్యంత శ్రద్ధ చూపాలి ! ఇప్పటి ‘ భౌతిక వాతావరణం లో , ఎంత బాగా డ్రస్ అయి ఇంటి నుంచి బయలు దేరినా కూడా , పని చేసే చోటికి చేరుకున్నాక , వేసుకున్న బట్టలు , మలిన పడి , ముడతలు కూడా తోడై , ఇంకో రకం గా తయారవుతాయి ! అందుకు తగినట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి,ప్రతి ఉద్యోగీ కూడా ! ఎందుకంటే , జీవితం లో ‘ ముందుకు ‘ పోవాలి కాబట్టి ! ఈ రోజుల్లో, పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాని వారు కూడా, వేసుకునే డ్రస్ విషయానికొస్తే , ఎంతో ‘ డాబు , దర్పం ‘ ప్రదర్శిస్తూ ఉంటారు ! కానీ ఒక స్థానం లో పని చేస్తూ , పదోన్నతి, అంటే ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు , మీ దృష్టి , కేవలం తరువాతి ఉద్యోగం మీదనే కాక , మీరు వేసుకునే దుస్తుల మీద కూడా సారించాలి !
వస్త్ర ధారణ ను అశ్రద్ధ చేస్తున్నట్టు ఇతరులకు కనిపిస్తే, ‘ ఆ వ్యక్తి తన వ్యక్తి గత సంరక్షణ అంటే పర్సనల్ కేర్ లో అశ్రద్ధ చూపిస్తున్నాడు , ఇక ఉద్యోగం ఎట్లా చేస్తాడో ‘ ? అనో , లేదా , ‘ ఎప్పుడూ చాలా తక్కువ రకం బట్టలు , కొద్దిగా మాసిన బట్టలు వేసుకుని వస్తాడు , ఏంటో ఆయన పరిస్థితి అయోమయం గా ఉంది ! మరి వచ్చే జీతం డబ్బులు ఏం చేస్తున్నాడో ? ! అనీ , అనేక విధాలు గా అనుకుంటూ ఉంటారు మిగతా జనాలు !
ఆకర్షణ , అందం అనే విషయాలు పక్కన ఉంచి , విషయం పరిశీలిస్తే , కారణాలు ఏమైనప్పటికీ , వస్త్ర ధారణ లో కన బరిచే శ్రద్ధ , ఒక సదభిప్రాయం కలిగిస్తుంది మనకు, ఇతరుల మీద ! ‘ ఆమె ఎప్పుడూ చక్కగా , నీటు గా ముస్తాబై వస్తుంది ‘ అని కానీ, ‘ ఆయన ఉన్నంత లో నీటు గా తయారయి వస్తాడు ఆఫీసు కు’ అని కానీ అనుకుంటాము ! యదార్ధానికి , ఏ ఉద్యోగం చేసినా కూడా , ఆ చేసే ఉద్యోగం , ఆ ఉద్యోగి ఎంత సమర్ధ వంతం గా చేస్తున్నాడు? అనే విషయం మీదే, మనం అతనిని కానీ , ఆమెను కానీ అంచనా వేయాలి ! కానీ అట్లా నిజ జీవితం లో జరగట్లేదు ! సరిగా ముస్తాబై రాని ఉద్యోగులను , ఇతర ఉద్యోగులు కానీ , ఇతర కస్టమర్ లు కానీ , ఒక ఈసడింపు భావన తో చూస్తారు ! వారికి అట్లాంటి ఉద్యోగులను చూస్తే , ఏదో డిప్రెషన్ కు గురి అయి కృంగి పోయి ఉన్న వారి లా కనబడతారు ! జీవితం మీద ఆశా వాహ దృక్పధం కోల్పోయిన వారిలా కనబడతారు ! వారి యజమానులు కూడా ‘ ఇట్లా అయితే , వీడు మన వస్తువులను ఎట్లా అమ్మ గలడు ? అనే అనుమానం లో పడతారు !
ప్రతి ఉద్యోగాన్నీ మనం ఆ ఉద్యోగం చేసే వారి దుస్తుల ను పరిశీలించే చెప్పగలం కదా ! ఒక బంట్రోతు , ఒక కారు డ్రైవరు , ఒక సిపాయి , ఒక డాక్టరు , ఒక లాయరు ఇట్లా , ప్రతి వృత్తి కీ ఒక నియమితమైన దుస్తుల స్టైల్ ఉంటుంది ! ప్రత్యేకించి , ఆ దుస్తులను ధరించి , ఆ ఉద్యోగం చేస్తుంటే , ఒక రకమైన ఠీవీ , దర్పం కూడా వస్తాయి !దానితో , ఆ ఉద్యోగం చేస్తున్న వారు కూడా ఎంతో గర్వం తో చేయగలుగుతారు !మీ జీవితం లో కూడా ! అందుకే , మనం వేసుకునే బట్టలతో , ఇతరులను , వారి ప్రవర్తననూ ‘కనికట్టు ‘ చేయవచ్చు !
ప్రత్యేకించి , ఇంటర్వ్యూ లకు హాజరు అయే వారు , వారు వేసుకునే దుస్తుల విషయం లో ఎంతో శ్రద్ధ కనబరచాలి ! ఎందుకంటే , వారి దుస్తులు వారికి ఇంటర్వ్యూ కి ముందే అంటే వారు ఇంటర్వ్యూ హాలు లో కనిపించ గానే బోనస్ మార్కులు ఇస్తాయి , ఏ ప్రశ్నా అడగక ముందే ! అట్లాగే సరిగా దుస్తులు వేసుకోకుండా ఉంటే , ఆ వచ్చే మార్కులు ముందే తీసివేయబడతాయి కూడా ! ‘ దుస్తులకు మార్కులు ‘ అని ప్రత్యేకం గా ఎక్కడా చెప్పక పోయినా కూడా !
ఇంటర్వ్యూ లో మీరు వేసుకునే దుస్తులు , మీ మీద మీకు ఎంత శ్రద్ధ ఉందో , మీరు చేసే పనిని కూడా అంతే శ్రద్ధ తో చెయగలరనీ , మీ ఆత్మ విశ్వాసానికి కొలత గానూ , మీ ఆశావహ దృక్పధానికి తార్కాణం గానూ , అంటే, మీరు జీవితం లో పాజిటివ్ గా ఆలోచించ గలరనే నమ్మకాన్నీ , తెలియచేస్తాయి ! మీ పురోగతి కి సహకరిస్తాయి ! మీ దుస్తులూ , మీ చిరునవ్వూ , మీ సమయస్ఫూర్తీ , మీ మెదడూ ( అంటే అంతకు ముందు మీరు నేర్చుకున్నదీ ) ఇవన్నీ కలిసే, మీకు ప్రతి ఇంటర్వ్యూ లోనూ విజయం కలిగిస్తాయి !

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
ఉదరపోషణార్ధం బహుకృతవేషం 🙂