పని సూత్రాలు. 43. మీరు, మీ ఆఫీసు నడిపే వారి కుడి భుజం కావాలి !
సాధారణం గా పని చేసే ప్రతి చోటా , ప్రతి ఉద్యోగీ కూడా , తమకు ‘ లభించిన ‘ ఉద్యోగాన్ని ఒక విధి గా చేసుకుంటూ పోతూ ఉంటారు ! వారికి మిగతా ఉద్యోగులతో కానీ , వారి పై అధికారి తో కానీ ఎక్కువ సంబంధం ఉండదు ! వారితో తమ పనిని కానీ , తమను కానీ లంకె వేసుకోరు ! ఒక కంపెనీ యజమాని ఆ కంపెనీ లోనే పని చేయకుండా , రిమోట్ కంట్రోల్ లా, ఇంకో ఊళ్ళో నో , సిటీ లోనో ఉండి , ఆ కంపెనీ ని పర్యవేక్షణ చేస్తూ ఉంటారు ! అంటే , స్థానికం గా , ఆ కంపెనీ ని కానీ, ఆఫీసు ను కానీ నడిపే వారు వేరే ఉంటారు ! వారే , తమ క్రింద పని చేసే మిగతా ఉద్యోగుల మీద పర్యవేక్షణ చేస్తూ , పెత్తనం చెలాయిస్తూ ఉంటారు ! ఉద్యోగం లో చేరిన ప్రతి ఉద్యోగీ , ముందుగా ఈ పై అధికారి ఎవరో తెలుసుకోవాలి ! సామాన్యం గా, ఈ పై అధికారి కి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి !
1. ఈ పై అధికారి ని, కంపెనీ యజమాని ‘ చెవులు ‘ గా చెప్పుకోవచ్చు ! అంటే , ఆ కంపెనీ లో కానీ , ఆఫీసు లో కానీ , జరిగే ప్రతి విషయాన్నీ యజమానికి చేర వేస్తా డన్న మాట !
2. ఈ పై అధికారి , యజమాని నమ్మకాన్ని పొంది , అతనికి విశ్వాస పాత్రుడి గా మెలుగుతూ ఉంటాడు !
3. ఆ ఆఫీసు లో కానీ , ఆ కంపెనీ లో కానీ కొంత కాలం గా పాతుకుని పోయి ఉంటాడు !
4. తమ క్రింద వారిని , ఎదురు పడి ‘ నోరు పారేసుకో కుండా ‘ గుస గుసలతోనే , తాము చెప్ప వలసినదీ , చేయ వలసినదీ చేస్తారు !
5. వీరు ఎప్పుడూ , అధికారం కోసం పాకు లాడుతూ ఉంటారు !
6. అంతే కాకుండా , తమ స్వార్ధం కోసం , లేదా తమ లక్ష్యాల కోసం , ఎంతకైనా తెగించ గలరు ! అవసరం అయితే , వక్ర మార్గాల ద్వారా కూడా !
7. ఇంకో ముఖ్య విషయం : వీరు తాము చేస్తున్న ఉద్యోగానికి తగిన అర్హత , నిపుణతా , అనుభవమూ లేకపోయినా కానీ , ఆ ఉద్యోగం చేస్తూ ఉంటారు ! కేవలం, తమ కుయుక్తులతోనూ , తెలివి తేటలతోనూ !
ఇట్లాంటి వారు ప్రతి ఆఫీసు లోనూ తప్పకుండా ఉంటారు కదా ! మరి మీరు మీ ఉద్యోగం లో చేరగానే , వీరిని గుర్తు పట్టే ప్రయత్నం చేయాలి ! ఆఫీసులో ప్రతి ఫైలూ వీరి టేబుల్ మీదకు ఆమోదం కోసం వెళుతూ ఉంటే , వీరే ఆ పై అధికారి అయి ఉంటారు ! ఈ పై అధికారితో మంచి సంబంధాలు ఏర్పరుచుకోవడమూ , ఆ సంబంధాలను పటిష్ట పరుచుకోవడమూ కూడా , మీరు చేయవలసిన ముఖ్యమైన పని ! ఈ మీ పై అధికారి ప్రవర్తనా , తీరు తెన్నులూ మీకు ఎంత మాత్రమూ ఇష్టం లేక పోయినా కానీ , మీరు ఆ ఆఫీసులో పని చేస్తున్నంత కాలమూ , అంటే మీకు ఇంకో ప్రత్యామ్నాయం ఏర్పడే వరకూ కూడా , మీ పై అధికారి తో విరోధం తెచ్చుకో కూడదు ! ఎంత మాత్రమూ !
గమనిక : పై లక్షణాలు కలిగిన ‘ పై ‘ అధికారులు దాదాపు గా ప్రతి ఆఫీసులోనూ , ప్రతి కంపెనీ లోనూ ఉంటారు ! మీరు ఇంకో ఉద్యోగ ప్రయత్నం చేసి , అందులో విజయం పొంది , ఆ ఉద్యోగం లో చేరినా , అక్కడ కూడా ప్రత్యక్షం అవుతారు , ఇంకో రూపం లో ! అంటే సారాంశం : ఇట్లాంటి పై అధికారి, స్థానాన్ని గుర్తించి , తదనుగుణం గా మసలు కోవడం అలవాటు చేసుకోవడమే మీ వంతు ! కనీసం మీ స్వంత కంపెనీ పెట్టుకునే దాకా !
వచ్చే టపాలో ఇంకొన్ని పని సూత్రాలు !