Our Health

పని సూత్రాలు. 42.ముందుకు పోవాలనుకుంటే , కార్పోరేట్ కల్చర్ కు అలవాటు పడాలి !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on జనవరి 18, 2014 at 11:14 ఉద.

పని సూత్రాలు. 42.ముందుకు పోవాలనుకుంటే , కార్పోరేట్ కల్చర్ కు అలవాటు పడాలి ! 

 
ప్రపంచీకరణ పెరుగుతున్న ఈ రోజుల్లో, కేవలం వివిధ దేశాలలో  నడిచే ప్రభుత్వ సంస్థ లే కాకుండా,  అనేక ప్రైవేటు సంస్థలు కూడా అనేక రకాలు గా విస్తరిస్తున్నాయి !  అనేక ఉద్యోగావకాశాలు కూడా లభిస్తున్నాయి !  ప్రతిభ కలవారు, కేవలం తమ ప్రతిభ మాత్రమే కాక , వివిధ సంస్థలలో , తాము  ఇతర ఉద్యోగులతోనూ , వారు పనిచేసే సంస్థ యాజమాన్యం తోనూ అనేక విధాలు గా కలిసి పోవడమే కాకుండా , తదనుగుణం గా వారు  తమ  పని సూత్రాలనూ , అంటే పని చేసే విధానాలనూ , పద్ధతులనూ కూడా మార్చు కోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి !  అప్పుడే , వారి ప్రతిభకు మాత్రమే కాకుండా , వారు ఆ యా సంస్థలలో ఇమిడి పోయి , ఆ సంస్థ పురోగతి కి కారకులయినందుకు కూడా , కేవలం ధన రూపం లోనే కాకుండా , యాజమాన్యానికి కూడా విశ్వాస పాత్రులు గా గుర్తింప బడి , అనేక విధాలు గా లాభం పొంద గలుగుతారు ! 
ఒక అంచనా ప్రకారం , వివిధ సంస్థలలో ఉద్యోగాలు కోల్పోయిన లేదా  ఉద్యోగం నుంచి తీసి వేయబడ్డ ఉద్యోగులలో 70 శాతం మంది, వారికి ఆ ఉద్యోగం చేయడానికి అవసరమైన ప్రతిభ లోపం వల్ల కాక , కేవలం వారు పని చేసే సంస్థలో ‘ ఇమడ ‘ లేక పోవడం చేతనే ! అంటే వారు, వారి ఉద్యోగం సరిగా చేస్తున్నా కూడా , ఆ కంపెనీ లో  బ్లెండ్ అవలేక పోవడం వలననే అని నిర్ధారించ బడింది ! దీనిని బట్టి ,  ఉద్యోగులు , తమకున్న ప్రతిభను మాత్రమే కాక , కార్పోరేట్ కల్చర్ మీద కూడా అవగాహన కలిగి ఉండాలనే సత్యాన్ని మరువ కూడదు అని తేట తెల్లమవుతుంది కదా  !
మరి ఈ కార్పోరేట్ కల్చర్ అంటే ఏమిటి ? 
ప్రతి సంస్థా , లేదా ఇండస్ట్రీ , లేదా ఒక చిన్న ఆఫీసు కూడా , కొన్ని  నిర్దిష్ట మైన , నిబంధనల ప్రకారం , సూత్రాల ప్రకారం పని చేస్తూ ఉంటుంది ! ఆ యా సంస్థల యాజమాన్యాలు, ఆ సూత్రాలనూ , నిబంధనలనూ నిర్ణయిస్తాయి !  అంతే కాకుండా , ఆ యాజమాన్యాలు , వారి ఉద్యోగులను ఆ సూత్రాలనూ , నిబంధనలనూ ఎప్పుడూ పాటిస్తూ ,ఆ సంస్థ అభివృద్ధి కీ పాటు పడాలనీ , వారు కూడా లాభం పొందాలనీ కూడా ఆశిస్తాయి ! 
ఉదాహరణకు : ఒక వస్తువు ను ఉత్పత్తి చేసే  పరిశ్రమ ఉందనుకుంటే , ఆ పరిశ్రమ యాజమాన్యం , తమ ఉద్యోగులు , తాము ఉత్పత్తి చేసే వస్తువు నాణ్యత లో ఏ మాత్రమూ లోపం లేకుండా , అత్యున్నత ప్రమాణాలతో  తయారు చేయాలని ఆశిస్తారు ! అందుకు ఆ  పరిశ్రమ లో వివిధ శాఖల లో పని చేసే అందరు ఉద్యోగులూ కూడా  ఆ వస్తువు నాణ్యత లోపించకుండా , తాము చేసే ఉద్యోగాన్ని శ్రద్ధతో చేయాలి ! ఒక శాఖ లో పనిచేసే వారికి , ఇంకో శాఖ లో పనిచేసే వారితో సమన్వయం లోపిస్తే , దాని ప్రభావం , తాము ‘ కలిసి ‘ ఉత్పత్తి చేసే వస్తువు నాణ్యత మీద పడుతుంది ! 
ఇంకో ఉదాహరణ : వినియోగ దారులకు అంటే కస్టమర్ కు సేవ లు అందించే ఇంకో సంస్థ ఉందనుకుంటే, ఆ  సంస్థ యాజమాన్యం , వారి ఉద్యోగులు , ఆ సంస్థ సూత్రాలు పాటిస్తూ , వినియోగ దారుడి  కి అత్యంత ప్రాధాన్యత నిస్తూ , వారి అవసరాలు వంద శాతమూ తీర్చడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి  అని ఆశిస్తుంది ! ఆ సూత్రాలకు విరుద్ధం గా అందులో పని చేసే ఉద్యోగులలో కొందరు , వారి కస్టమర్ తో సరిగా ప్రవర్తించక పోవడమో లేదా , వారిని, వారి అవసరాలనూ నిర్లక్ష్యం చేయడమో  జరిగితే ,  వినియోగ దారులకు అందిస్తున్న సేవలలో నాణ్యత లోపించి , దాని ప్రభావం , ఆ సంస్థ  మీద పడుతుంది ! అంటే ఆ సంస్థ ఆర్ధికం గా నష్ట పోతుంది !  దానితో పాటు యాజమాన్య సూత్రాలకు విరుద్ధం గా పనిచేసిన ఆ  ఉద్యోగుల ఉద్యోగాలు కూడా పోతాయి !  అందువల్లనే ప్రతి సంస్థా కూడా , అది పని చేసే విధానాల మీద నిర్దిష్టమైన పని సూత్రాలను రూపొందించి , ఆ సూత్రాలను , అందులో పనిచేసే ఉద్యోగులంతా పాటించాలని  నిబంధన చేస్తుంది ! 
సాధారణం గా ప్రతి ఉద్యోగీ కూడా తమదైన ప్రత్యేక వ్యక్తిత్వం ఏర్పరుచుకుని ఉంటారు ! తమకై ఒక పర్సనాలిటీ ఎర్పరుచుకుంటారు ! అంటే అది కేవలం భౌతికమైన లక్షణాలకు సంబంధించినదే కాదు !  వారు తాము పనిచేసే తీరు లోనూ , ఇతరులతో ప్రవర్తించే తీరు లోనూ , తమకై తాము చూపించే ప్రత్యేకత !  మనం అందరమూ , ఒకే పనిని చేస్తున్నా , మనం వ్యక్తి గతం గా చేసే ఆ పనిలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి కదా ! అట్లాంటిదే వ్యక్తిత్వం కూడా ! ఎవరి స్టైల్ వారిది !  అది మంచిదే ! కానీ  ఈ స్టైల్ బాసులు , వారు పని చేసే సంస్థలలో కూడా , తమ స్టైల్ తమదే అని భీష్మించుకుని , యాజమాన్యం తో అనేక రకాలు గా ఘర్షణ పడుతూ , తమ ఉద్యోగాలకు అనవసరం గా ఎసరు పెట్టుకుంటూ ఉంటారు !  ఇక్కడ అట్లాంటి వారు గమనించ వలసినది ఒక్కటే ! మీ వ్యక్తిత్వాలు ఎప్పుడూ మీవే ! కానీ మీరు పనిచేసే సంస్థ లో ఉన్నంత సేపూ , కేవలం ఆ సంస్థ సూత్రాలు పాటించండి ! మీకు నచ్చక పోయినా కూడా ! ఎందుకంటే అది మీ ఉద్యోగం కాబట్టి !  మిగతా విషయాలు మీకు అనవసరమూ , అప్రస్తుతమూ కూడా ! అంటే మీరు మీ ఉద్యోగ జీవితం లో ఎట్లాంటి ఒడు దుడుకులూ లేకుండా , ముందుకు సాఫీ గా సాగి పోవాలని నిర్ణయించుకుంటే , కేవలం మీరు పని చేస్తున్న సంస్థ సూత్రాలను పాటిస్తూ , ఆ సంస్థ లో కలిసి పొండి !  మీ సంస్థ యాజమాన్యం గోల్ఫ్ ఆడుతూ ఉంటే , మీరు కూడా ఆ గోల్ఫ్ ఆట ఆడండి ! మీకు ఆ ఆట ఇష్టం లేక పోయినా కూడా ! ఎందుకంటే , మీరు పనిచేసే సంస్థకు, మీ ఇష్టా ఇష్టాలతో పని లేదు ! ఆ సంస్థ నిబంధనలనూ, సూత్రాలనూ ప్రతి ఉద్యోగీ పాటిస్తున్నాడా ? లేదా ? అనే విషయమే వారికి ముఖ్యం !  మీ వ్యక్తిత్వం మీదే ! మీకు గోల్ఫ్ ఇష్టం లేదనే అభిప్రాయం మార్చుకో నవసరం లేదు ! కానీ, మీరు యాజమాన్యం తో గోల్ఫ్ ఆడండి ! లేకపోతే , యాజమాన్యమే మీ ( జీవితాలతో )  తో గోల్ఫ్ ఆడుతుంది ! అదే కార్పోరేట్ కల్చర్  ను అలవాటు చేసుకోవడం అంటే ! 
ఇట్లా మీరు ఎప్పుడూ చేస్తూ ఉంటే , విజయం మీదే ! ఇట్లా కనీసం మీ స్వంత కంపెనీ కానీ పరిశ్రమ కానీ పెట్టే వరకూ చేస్తూనే ఉండాలి ! మరి అదే కార్పోరేట్ కల్చర్ అంటే ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: