చదువుకోవడం ఎట్లా ?35. పునశ్చరణం , మిగతా పద్ధతులు !
మునుపటి టపాలో రికాల్, అంటే పునశ్చరణం చేయడం వల్ల కలిగే లాభాలు తెలుసుకున్నాం కదా ! అందులో భాగం గా శ్రద్ధా శ్రవణం అంటే యాక్టివ్ లిజనింగ్ గురించీ తెలుసుకున్నాం కదా ! మిగతా పద్ధతులు తెలుసుకుందాం ఇప్పుడు !
2. నోట్సు చదివే సమయం లో వివిధ పద్ధతులను అనుసరించడం ! : ఒక సారి పాఠం శ్రద్ధగా పాఠం విని రాసుకునే నోట్సు ను మళ్ళీ మళ్ళీ చదువుకుంటే , ఆ పాఠం విషయాలు చాలా వరకూ గ్రహించ గలుగుతారు విద్యార్ధులు ! ఆ చదివే సమయం లో, పైకి , అంటే తమకు వినబడేట్టు చదువుకుంటే మరీ మంచిది ! ఆ రకం గా వారు ఫోనలాజికల్ లూప్ ను వారి జ్ఞాపాకాల లో ప్రవేశ పెట్టి, జ్ఞాపకాలను బలోపేతం చేయ గలుగుతారు ! అదే నోట్సు ను చదివే సమయం లో, మళ్ళీ చిత్తు, అంటే రఫ్ నోట్ బుక్ లో రాసుకోవడం కూడా ఇంకో మంచి పధ్ధతి ! అప్పుడు కేవలం శబ్ద తరంగాల ద్వారానే కాకుండా , దృశ్య జ్ఞాపకాల ( తమ చేతి రాత పూర్వకం గా ) తో కూడా ఆ పాఠాన్ని పదిల పరుచుకోవడం జరుగుతుంది ! ఈ రకం గా అనేక విధాలు గా ఆ పాఠాన్ని పదే , పదే , పునశ్చరణం చేసుకోవడం వల్ల , కేవలం వర్కింగ్ మెమరీ ఏ కాక శాశ్వత జ్ఞాపకాలు అంటే లాంగ్ టర్మ్ మెమరీ లో కూడా ఆ పాఠం నిక్షిప్తమవుతుంది ! ఆ పధ్ధతి అందువల్ల విద్యార్ధులకు అనేక విధాలు గా లాభ దాయకం !
3. ఫ్లాష్ కార్డులు ఉపయోగించడం : ఈ పధ్ధతి ఇంకో రకం గా ఉపయోగకరం . ఈ పధ్ధతి లో విద్యార్ధి ఒక పాఠానికి సంబంధించిన ముఖ్య విషయాలు, ఒక పది పదిహేను చిన్న పేక ముక్కల సైజు లో ఉన్న దళసరి , లేదా మందమైన కార్డుల మీద రాసుకుంటాడు ! రాసుకునే సమయం లో కొన్ని చిత్ర రూపం లోనూ , ముఖ్య మైన పదాల రూపం లోనూ , అంకెల రూపం లోనూ కూడా ఆ పాఠం విషయాలను , తాను గుర్తు ఉంచుకునే రీతిలో రాసుకోవడం , తయారు చేసుకోవడం జరుగుతుంది ! ఇక ఆ కార్డు లకు రెండో వైపున , మొదటి వైపు న రాసుకున్న విషయాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా రాసుకోవడం జరుగుతుంది ! అంటే కార్డు కు ఒక ప్రక్క ప్రశ్నలూ , రెండో ప్రక్క ఆ ప్రశ్న కు సంబంధించిన సమాధానమూ ఉంటాయి ! నేర్చుకునే సమయం లో , కార్డు మీద ఉన్న ప్రశ్న చూసి , ఆ కార్డు ను రెండో ప్రక్కకు తిప్పకుండానే , సమాధానాన్ని పైకి చెప్పడానికి ప్రయత్నించడమో , లేదా సమయం ఉంటే , చిత్తు పుస్తకం లేదా రఫ్ బుక్ లో రాయడానికి ప్రయత్నించాలి ! సమాధానం చూడడానికి ఆతృత పడకుండా ! ఇట్లా ఫ్లాష్ కార్డ్ లను ఉపయోగించి సమాధానాలు నేర్చుకోవడం ఒక మంచి పధ్ధతి ! బాగా సాధన చేస్తూ , ఆ కార్డ్ ల వరుసను తరచూ , పేక ముక్కలను కలిపినట్టు కలిపి , మళ్ళీ ఆ ప్రశ్న లకు జవాబులు ( రెండో వైపు చూడకుండానే ) చెప్పడానికి ప్రయత్నించాలి , ఆ సమాధానం నేర్చుకునే వరకూ !
4. క్రమం గా చదువుకోవడం : ఇది కూడా చాలా ముఖ్యమైన కిటుకు ! అంటే, రోజూ చదువుకోవాలి ! వారం రోజులలో, ఐదు రోజులు రోజుకు రెండు గంటల చొప్పున చదివితే వంట బట్టే విషయాలు ,మెదడులో వాటి జ్ఞాపకాలు , రెండు రోజులు మాత్రమే , రోజుకు ఐదు గంటల చొప్పున చదివితే, మెదడు లో నిక్షిప్తమయే విషయాల క్వాలిటీ కన్నా ఎంతో మెరుగు గా ఉంటుంది ! రెండు రకాలు గా చదవడం లోనూ విద్యార్ధి పది గంటల సమయమూ వెచ్చిస్తూ ఉన్నా కూడా !
5. మెదడు ఆరోగ్యం చూసుకోవాలి : కంప్యూటర్ అయితే , చాలా వేడెక్కితే , అవక తవక గా పనిచేస్తుందో , అదే రకం గా మానవ మెదడు కూడా , సరి అయిన నిద్ర లేకుండా , లేదా సరైన ఆహారం లేకుండా ఉంటే , అది చేసే పని క్వాలిటీ తగ్గి పోతుంది ! ఇంకో గమనిక : మన మెదడు మన శరీరం బరువులో యాభై లేదా అరవయ్యో వంతు ఉన్నా కూడా , తీక్షణం గా ఆలోచిస్తూ , చదువుకుంటూ ఉంటే , మనకు రోజూ అవసరం అయే క్యాలరీలలో నాలుగో వంతు అవసరం ఉంటుంది , మన మెదడుకు ! అందువలన , సమతుల్యాహారం తీసుకుంటూ మెదడుకు అందే ఆక్సిజన్ తో పాటుగా , ఒక క్రమ పధ్ధతి లో క్యాలరీలు కూడా, అంటే గ్లూకోజు తయారవడానికి అవసరమయే ఆహారం కూడా తీసుకుంటూ ఉండాలి ! జంక్ ఫుడ్ తింటూ ఉంటే , ఒక్క సారిగా శరీరం లో గ్లూకోజు ఎక్కువ అవడమూ , ఆ తరువాత ఒక్క సారిగా తగ్గి పోవడమూ కూడా జరుగుతూ ఉంటుంది ! ఒక తాజా వార్త ప్రకారం , మెక్డోనాల్డ్ రెస్టారెంట్ యాజమాన్యం , వారి ఉద్యోగులనే , మెక్డోనాల్డ్స్ లో జంక్ ఫుడ్ తినకండి అని హెచ్చరించింది ! సమ తుల్యమైన ఆహారం అంటే , పిండి పదార్ధాలు , ప్రోటీనులు , నూనె పదార్ధాలన్నీ సమ పాళ్ళ లో తినడమే కాకుండా , మెదడు లో నాడీ కణాలు శక్తి వంతం గా పని చేయడానికి అవసరమయే విటమిన్లూ , ఖనిజాలూ ఉన్న ఆహారాన్ని కూడా తగినంత తింటూ ఉండడం ఉత్తమం ! విటమిన్ లోపం వల్ల ,ఖనిజాల లోపం వల్ల , జ్ఞాపక శక్తి బలహీన మవుతుందని , ఇప్పటికే కొన్ని వందల పరిశోధనలు , ఏ సందేహమూ లేకుండా నిర్ధారించాయి !
వచ్చే టపాలోఇంకొన్ని సంగతులు !