Our Health

చదువుకోవడం ఎట్లా? 34. పునశ్చరణం, విద్యార్ధులకు ఎందుకు లాభదాయకం ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 25, 2013 at 3:59 సా.

చదువుకోవడం ఎట్లా? 34.పునశ్చరణం విద్యార్ధులకు ఎందుకు లాభదాయకం ? 

మునుపటి టపాలలో ,  మన మెదడులో జ్ఞాపకాలు ఎన్ని రకాలు గా నిక్షిప్తమవుతాయో , అట్లాగే వర్కింగ్ మెమరీ ఎట్లా పని చేస్తుందో ,  మనం వర్కింగ్ మెమరీ ని ఎట్లా ఉపయోగించుకోవాలో కూడా తెలుసుకున్నాం కదా ! మరి ఈ వర్కింగ్ మెమరీ సరిగా పనిచేయడానికీ , తద్వారా శాశ్వత మెమరీ లేదా లాంగ్ టర్మ్ మెమరీ బాగా ఉండడానికీ అంటే బాగా పనిచేయడానికీ , పునశ్చరణం, అంటే రికాల్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం ఇప్పుడు ! 
1. శ్రద్ధా శ్రవణం ( యాక్టివ్ లిజనింగ్ ) :  ఈ పదం కొత్తగా ఉన్నా , ఎంతో ముఖ్యమైన పదం !  శ్రద్ధా శ్రవణం అంటే, శ్రద్ధ తో వినడం అని ! ఆంగ్లం లో యాక్టివ్ లిజనింగ్ అని అంటారు !  పునశ్చరణం మొదలయ్యేది , చెప్పే పాఠాలు వినడం తోనే ! విద్యార్ధులు , తమకు చెప్పే పాఠం వినే సమయం లో, ఏకాగ్రత,  ప్రధానం గా ఆ పాఠం వినడానికే ఉపయోగించాలి !  క్రితం టపాలలో చూశాము, మన వర్కింగ్ మెమరీ లో ఫోనలాజికల్ లూప్ అని  ఒక దశ ఉంటుందని , అంటే  శబ్ద గ్రాహక వలయం !  ఈ శబ్ద గ్రాహక వలయం మెదడు లో తన పని తాను చేసుకుంటూ పోతుంది ! అంటే, మనం విన్న శబ్దాలనూ , మాటలనూ , గ్రహించి , సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కు సంధానం చేస్తుంది , ఆ వివరాలను !  వినే సమయం లో ఏకాగ్రత లోపించి వింటే , గ్రహించే శబ్దాలు , పదాలు కూడా అసంపూర్ణం గా గ్రహించ బడి , మెదడు లో చెరగని ముద్రలు వేయక , పై పైన మాత్రమే , లీల గా  తమ ముద్రలు వేస్తాయి !  విద్యార్ధులు , పాఠాలు అర్ధం చేసుకోలేక పోవడానికి ఇది ఒక కారణం !  ఏకాగ్రత తో వింటూ , తదనుగుణం గా నోట్సు తీసుకుంటూ ఉంటే , విద్యార్ధులు  తాము గ్రహించిన విషయాలను అక్కడే ‘ జల్లెడ ‘ పట్టి , నోట్సు ను తయారు చేసుకో గలుగుతారు !  ఇట్లా శ్రద్ధగా వినడం , నోట్సు తీసుకోవడం అలవాటు చేసుకున్న వారు ,  విషయాలను గ్రహించి , అర్ధం చేసుకోడానికి ,  ఆ విషయాలను లోతు గా పరిశీలిస్తారు కూడా !   అందుకే , ‘ శ్రద్ధ గా ‘ క్రియాశీలం గా, అంటే యాక్టివ్ గా  వినడం, పునశ్చరణం లో ఎంతో ముఖ్యమైన భాగం ! ఇట్లా నోట్సు రాసుకునే సమయం లో విద్యార్ధుల సునిశితమైన జ్ఞాపక శక్తి ఇంకా వృద్ధి కావాలంటే , ఆ పాఠం వింటున్నప్పుడు , వాతావరణం ఎట్లా ఉందో , ఆ రోజు తాము, ఉదయం ఏమి తిన్నారో , లేదా ఆ పాఠం చెప్పే టీచర్ ఏ డ్రస్ లో ఉందో , లేదా ఉన్నాడో, కూడా నోట్సు లో రాసుకోవచ్చు !  జ్ఞాపక శక్తి వృద్ధి చేసుకోవడం లో వివిధ రకాల ప్రేరణలను అనుసంధానం చేసుకోవడం కూడా ఒక ముఖ్యమైన దశ  ! 
ఉదాహరణ :   రమేష్ కాలేజీ విద్యార్ధి !  చలాకీ గా ఉంటాడు ! తెలివైన వాడు కూడా !  అందుకే , ఈసెట్  మంచి ర్యాంక్ తెచ్చుకుని  ఇంజనీరింగ్ కాలేజీ లో చేరాడు ! మొదటి రెండు సంవత్సరాలూ , చదువు ను అశ్రద్ధ చేశాడు !  పాఠాలు వినే వాడు కాదు !   చేరిన రోజే,  చూపులతో పరిచయం అయిన  రమ  ను  చదవడం లో బిజీ అయ్యాడు ! కాలేజీ ఫ్రెషర్స్ డే నాడు ఆమె  వేసుకున్న జీన్స్ టీషర్ట్ రంగులూ , ఆమె పాద రక్షలూ , ఆమె లిప్ గ్లాస్ సువాసనలూ , పర్ఫ్యూమ్  సువాసనా ,  అదే సమయం లో వింటున్న పాటా ,  బ్రేక్ టైం లో తిన్న స్నాక్సూ , అన్నీ  అనేకమైన ముద్రలు వేశాయి , రమేష్ మనసులో , ఆ ముద్రలు, చెరగని ముద్రలు ! రమ, రమేష్ కు పాఠా లెవీ చెప్పేది కాదు ! కానీ  రమ , రమేష్ మనసులో ఓ దృశ్య కావ్యం !  ఆమె, రమేష్ మనో  నోట్ బుక్ లో, రోజు కో అధ్యాయం !  తెల్లటి సల్వార్ కమీజ్ లో మంచు లా మెరిసి పోతున్నా , అతని మదిలో వెచ్చని భావాలే !  ఆమె  చిలిపి కళ్ళు , తనవైపు చూసినా , తను స్పేస్ లో నడుస్తూ ఉన్నట్టు  అనుభూతి ! ఆమె తనతో మాట్లాడిన మాటలు అన్నీ కూడా కంఠతా వచ్చు రమేష్ కు ! తనకు ఆమె తెలిపిన అభినందనలూ , కృతజ్ఞతలూ అయితే ,  కలలో కూడా వల్లె వేస్తుంటాడు రమేష్ !  ఆమె చిరునవ్వు ఫ్లాష్ ఫోటోలు, ఓక వెయ్యి ఉన్నాయి రమేష్  బ్రెయిన్ బాక్స్ లో ! రమేష్ చదువులో వెనక బడుతున్నాడు !  చదువు నిర్లక్ష్యం చేసి , రమ వెనక బడుతున్నాడు ! చెప్పే పాఠాలు గుర్తు ఉండడం లేదు !  మనసులో అన్నీ రమ గుర్తులే !  రమ గుర్తులు , కేవలం ఆమె ధరించే దుస్తులతోనే కాకుండా , ఆమె వాడే పర్ఫ్యూమ్ , మాట్లాడే మాటల తీరూ , ఇన్ని రకాలు గా వివిధ ప్రేరణలు ,  రమేష్ ప్రేమకు ప్రేరణ అవుతున్నాయి !  అతడి మెదడు లో అందమైన జ్ఞాపకాలకు ప్రేరణ అవుతున్నాయి ! కానీ అతనికి చదువు దూరం అవడానికి కూడా ఆ గుర్తులు కారణ మవుతున్నాయి ! 
విశ్లేషణ : అంటే రమేష్  ప్రాధాన్యతలలో, చదువు రెండో ప్రాధాన్యత అయింది ! రమ, రమేష్ మనసులో చదువును స్థాన భ్రంశం చేసింది !  ఇట్లా చాలా మంది యువకుల్లో , యువతులలో  జరిగే సామాన్యమైన సంఘటనే కదా !  కానీ రమేష్ కు చదువులో వెనక బడడానికి , కారణం , అతనికి చెప్పే పాఠాల మీద ఏకాగ్రత లోపించింది ! అంటే శ్రద్ధగా వినలేక పోవడం జరిగింది ! పర్యవసానం గా పాఠాలు అర్ధం అవడం జటిలమయింది ! గమనించ వలసినది,  తన జీవితం లో కి ఆహ్వానించ బడుతున్న రమ విషయం లో , రమకు సంబంధించిన అన్ని జ్ఞాపకాలూ  , కలలో కూడా గుర్తు కు తెచ్చుకుంటూ , పునశ్చరణం చేసుకుంటున్న రమేష్ కు జ్ఞాపక శక్తి లో ఏమాత్రం లోపం లేదు ! రమ గురించిన అన్ని వివరాలూ నిక్షేపం గా రమేష్ మెదడు లో ఉండడమే కాకుండా , రమేష్ కు ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటే అప్పుడు గుర్తుకు వస్తాయి , ఏ లోపమూ లేకుండా ! కేవలం  ఇది రమేష్ తీసుకున్న నిర్ణయం !  శ్రద్ధా శ్రవణానికి  ప్రాధాన్యత ఇవ్వక పోవడం ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
  1. మానసిక వత్తిడే కాకుండా మానసికోల్లాసం కూడా సరైన పలితాలకు అవరోదం తెస్తుంది, అయితే ఆ ఉల్లాసాన్ని కొంత తగ్గించుకొవటం కూడా మనిషి చేసుకొవాల్సిన నియంత్రణలో ఒకటి అంతే నంటారా సర్.

    • మానసిక ఉల్లాసం, యుక్త వయసులో, ప్రతి విద్యార్ధికీ అవసరమే ! కానీ అది విపరీతం కాకూడదు ! విద్యార్ధి ఉల్లాసం , తన చదువు మీద ఏకాగ్రతను ఎట్టి పరిస్థితులలోనూ కోల్పోనీయ కూడదు ! అప్పుడు నష్ట పోయేది ఆ విద్యార్ధి యే కదా !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: