చదువుకోవడం ఎట్లా ? 33. వర్కింగ్ మెమరీ ని పెంచుకోవడం ఎట్లా ?
మునుపటి టపాలో , జ్ఞాపకాన్ని ఎక్కువ చేసుకోవడం ఎట్లాగో తెలుసుకుంటూ , వర్కింగ్ మెమరీ, మన మెదడులో ఎట్లా పని చేస్తుందో తెలుసుకున్నాం కదా ! మరి ఈ వర్కింగ్ మెమరీ ని ఎక్కువ చేసుకోవడం , దానిని చదువుకోవడం లో ఉపయోగించుకోవడం ఎట్లా ? ఈ వర్కింగ్ మెమరీ మెదడు లో ఉన్నా , ఒక పధ్ధతి లో జ్ఞాపకాలను గ్రహించడం , మెదడులో పదిల పరుచుకోవడం అలవాటు చేసుకుంటే , పది కాలాల పాటు అవి మెదడులో నిక్షిప్తమై ఉంటాయి ! ఈ క్రింది పద్ధతులలో వర్కింగ్ మెమరీని పెంచుకోవచ్చు !
1. చంకింగ్: ఈ చంకింగ్ గురించి వివరం గా మునుపటి టపా లలో తెలియ చేయడం జరిగింది ! ఆసక్తి ఉన్న వారు , చదవ వచ్చు !
2. మెమరీ గేమ్స్ : ఈ మెమరీ గేమ్స్ ఆడడానికి అంతర్జాలాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు ! ఈ ఆటలు ఆడితే , ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ను ఏ రకం గా ప్రాసెస్ చేయవచ్చో తెలుసుకోవచ్చు అంటే మన మెదడు ను అందుకు సిద్ధం చేయవచ్చు ! ఈ రకమైన ఆటలు ఆడి , అవి ఆడుతున్న వారు నిరాశ చెంద కూడదు ! కేవలం ఆ ఆటలు మెదడు ను పదును పెట్టడానికే అని గుర్తు ఉంచుకోవాలి ! ఆ విషయం మర్చి పోకూడదు ! అనేక మైన గేమ్స్ ఉచితం గా అందుబాటు లో ఉన్నాయి అంతర్జాలం లో ! ఈ ఆటలు , పదాలనూ , అంకెలనూ , వ్యాకరణాన్నీ ఆధారం చేసుకుని ఆడేవి కొన్నీ , లేదా స్థలాలనూ , మనుషుల పేర్లనూ ఆధారం చేసుకుని ఆడేవీ కూడా ఉన్నాయి ! ఉదా: www .mindgames .com . ఇట్లాంటి ఆటలు తరచూ ఆడుతూ ఉండడం వల్ల , మెదడు వివిధ రకాల ఇన్ఫర్మేషన్ ను వెంట వెంటనే గ్రహిస్తూ , సరి అయిన నిర్ణయాలు, సరి అయిన సమయం లో తీసుకునే అలవాటు చేసుకుంటుంది ! దానితో స్థబ్దత ఉండదు మెదడు కూ , మెదడు లోని నాడీ కణాలకూ !
3. పలు రకాలైన ప్రేరణ సాధన చేయడం : మెదడు ప్రేరణ చెందేది , అనేక రకాలైన ఇంద్రియ జ్ఞానం వల్ల ! కేవలం మనం ఒక దృశ్యాన్ని చూస్తేనే ప్రేరణ పొందము కదా ! మిగతా ఇంద్రియాలు అనేక విషయాలను గ్రహిస్తూ , ప్రేరణ పొందుతూ ఉంటాయి కదా ! అంటే ఒక మంచి సంగీతం వినపడినప్పుడూ , లేదా ఒక రుచికరమైన వంటకం వాసన చూడడం తో పాటుగా , తింటూ రుచి ని ఆస్వాదిస్తున్నప్పుడు కూడా ! అందుకని , మన మెదడును తరచూ , రక రకాలైన ప్రేరణ లను గ్రహించే విధం గా మలచుకోవాలి ! పది మంది స్నేహితులతోనో , బంధువులతోనో కలిసి , సంభాషణలు జరుపుతూ సమయం గడపడం కూడా ఒక విలువైన ప్రేరణ ! ఈ రకమైన ప్రేరణ లన్నిటి వల్లా , వర్కింగ్ మెమరీ ఎంతో చురుకు గా తయారవుతుంది !
4. వత్తిడి నివారణ చర్యలు పాటించడం : క్రితం టపా లో చూశాము కదా , మన మెదడు లో వర్కింగ్ మెమరీ అనేక దశలు గా ఎట్లా ఉంటుందో ! ఈ వివిధ దశలన్నీ కూడా వత్తిడి కి తట్టుకోలేవు ! అంటే మనసు లో ఉండే వత్తిడి మెదడు లో కూడా ఏర్పడుతుంది ! వత్తిడి అనే పదం మనం చాలా సామాన్యం గా చెప్పు కుంటున్న ప్పటికీ , వత్తిడి అనుభవించే వారి మెదడులో కొన్ని జీవ రసాయన చర్యలు జరుగుతూ , ఆ చర్యలు , వర్కింగ్ మెమరీ లో వివిధ దశలకు అవరోధాలు కలిగిస్తూ ఉంటాయి ! అందుకే , తీవ్రమైన వత్తిడి తో ఉన్న సమయాలలో , అంతకు ముందు తెలుసుకున్న అనేక విషయాలు కూడా వెంటనే స్ఫురణ కు రావు ! దానితో సమయం మించి పోయి , విద్యార్ధులు , పరీక్షా పత్రం లో అడిగిన ప్రశ్నలకు జవాబులు సరిగా రాయలేక పోతారు ! అది విద్యార్ధులలో చాలా సామాన్యం గా జరుగుతూ ఉంటుంది ! అందుకే , నేర్చుకునే సమయం లో హాని కరమైన వత్తిడి అంటే ‘ డి స్ట్రెస్ ‘ లేకుండా స్థిరమైన ఏకాగ్రత తో నేర్చుకుంటే , వర్కింగ్ మెమరీ మాత్రమే కాక , శాశ్వత జ్ఞాపకాలు అంటే లాంగ్ టర్మ్ మెమరీ కూడా బలం గా ఉంటుంది ! ( ఈ వత్తిడి నివారణ చర్యలు కూడా మునుపటి టపాలలో వివరించడం జరిగింది , పరిశీలించవచ్చు , ఆసక్తి ఉన్న వారు ).
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !