చదువుకోవడం ఎట్లా? 31.జ్ఞాపకాల రకాలు !
చదువు కోవడం లో, మన జ్ఞాపక శక్తి కీలక మైన పాత్ర పోషిస్తుంది ! జ్ఞాపక శక్తి లోపిస్తే , ఒక పెద్ద పీపాలో , అడుగున పెద్ద రంధ్రం ఉన్నా కూడా ,నీటితో పీపాను నింపడానికి చేసే ప్రయత్నం లాంటిది , మెదడులో విజ్ఞాన విషయాలు నింపుదామని ప్రయత్నించడం ! మునుపటి టపాలో సూచించినట్టు , జ్ఞాపక శక్తి కి అవసరమైన ఒక బిలియన్ నాడీ కణాలు అందరి మెదడు ల లోనూ ఉంటాయి ! ఇక చేయవలసిందల్లా , ఆ నాడీ కణాలలో , జ్ఞాపకాల గుర్తులను ఒక క్రమ పధ్ధతి లో అమర్చుకోవడమే ! అంతే కాకుండా , ఒక గ్రామఫోను రికార్డు లోశబ్ద తరంగాలు నిక్షిప్తం అయి ఉంటే , ఆ రికార్డు లను, ఒక నిర్ణీత సమయం లో , ఎట్లా ప్రత్యేక మైన రసాయన పదార్ధాలతో శుభ్రం చేయడం అతి ముఖ్యమైన చర్యో , అదే రకం గా , మెదడు లో ఏర్పడిన జ్ఞాపకాలను కూడా , ఒక క్రమ పధ్ధతి లో అమర్చుకోవడమే కాకుండా , నిర్ణీత సమయాలలో , ఆ జ్ఞాపకాలను మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడం , అట్లా గుర్తుకు తెచ్చుకునే పరిస్థితి లో జ్ఞాపకాలను పదిల పరచుకోవడం కూడా ఒక కీలకమైన చర్య ! ఆ పని ఎట్లా చేసుకోవాలో తెలుసుకునే ముందు , జ్ఞాపక శక్తి గురించి కొంత తెలుసుకోవడం ముఖ్యం !
మన మెదడు లో జ్ఞాపకాలు, ప్రధానం గా రెండు రకాలు గా నిక్షిప్తం చేయబడి ఉంటాయి ! ఒకటి తాత్కాలిక జ్ఞాపకాలు, రెండు శాశ్వత జ్ఞాపకాలు !
1. తాత్కాలిక జ్ఞాపకాలు, దీనినే వర్కింగ్ మెమరీ లేదా, షార్ట్ టర్మ్ మెమరీ అని కూడా అంటారు , కొన్ని స్వల్పమైన తేడాలతో ! ఈ తాత్కాలిక లేదా వర్కింగ్ మెమరీ , మనం నేర్చుకునే ప్రతి విషయం లోనూ అతి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ! ఈ వర్కింగ్ మెమరీకి ,మనకు ఉన్న అన్ని ఇంద్రియాలూ తోడ్పడతాయి ! అంటే మన కళ్ళూ , చెవులూ ,స్పర్శా , ఇంకా మన నాసికాలూ ( అంటే ఆఘ్రాణించే శక్తి – అది కూడా ఒక ఇంద్రియమే కదా ! ) ఈ ఇంద్రియాలు మనం నేర్చుకునే సమయం లో, ఆ నేర్చుకునే విషయాలను అతి జాగ్రత్తగా , మెదడు లోని ‘ అరలలో ‘ పదిల పరచడానికి పనికి వస్తాయి ! ఉదాహరణకు , మీరు మీ స్నేహితుల టెలిఫోన్ నంబర్ అడిగితే , వారు చెబుతున్నప్పుడు , మీరు జ్ఞాపకం ఉంచుకునేదే వర్కింగ్ మెమరీ ! ఆ నంబర్ కనుక యదాలాపం గా , అంటే ఎక్కువ శ్రద్ధ పెట్టకుండా , కనుక నేర్చుకుంటే , కొద్ది క్షణాలలోనే మర్చిపోవడం జరుగుతుంది ! అదే, కొంత మంది , పని కట్టుకుని , ఆ ! ఆ ! ఏమన్నారూ? , 89735614 89 తరువాత 73 అన్నారా ? 83 73 తరువాత ఏమిటి 5614 కదా ? ఓహో ! నేను ఇప్పుడు నంబర్ పూర్తి గా చెబుతాను సరిచేయండి ! 89735614 ! అదేనా? ! అని, అనేక సార్లు, ఆ నంబర్ ను తరచి తరచి అడుగుతూ , నోట్ చేసుకుంటే , ఆ జ్ఞాపకం బలం గా మెదడు లో నిక్షిప్తం అవుతుంది ! దానిని నోట్ కూడా చేసుకుని , మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే , ఆ జ్ఞాపకం , శాశ్వత జ్ఞాపకం అవుతుంది !
2. శాశ్వత జ్ఞాపకం లేదా పర్మనెంట్ మెమరీ లేదా లాంగ్ టర్మ్ మెమరీ: ఈ రకమైన జ్ఞాపకాలు శాశ్వతం గా మెదడులో నిక్షిప్తం అయిపోతాయి ! నిజానికి ఈ శాశ్వత మెమరీ , లేదా పర్మనెంట్ మెమరీ లో జ్ఞాపకాలు , మొదట తాత్కాలికం గా మెదడు లో నిక్షిప్తం చేయబడినవే ! వాటినే తరచుగా మననం చేసుకుంటూ ఉంటే , అవి శాశ్వత ప్రాతిపదికన మెదడు లో నిక్షిప్తం అవుతాయి !
చదువుకోవడం లో, నేర్చుకోవడం లో ఏ జ్ఞాపకాలు ముఖ్యం ?: చదువుకోవడం , జ్ఞానం సంపాదించడం అనే విషయాలు అనంతమైనవే కాకుండా , అవినాభావ సంబంధాలు కలిగి ఉంటాయి ! అంటే ప్రతి సబ్జెక్ట్ లోనూ , ( నేర్చుకునే ) ప్రతి విషయమూ కూడా ఇతర విషయాలతో ముడి పడి ఉంటుంది ! ఈ విషయం మనసులో ఉంచుకుని , నేర్చుకునే వారికి , జ్ఞాన సముపార్జన సులభం అవుతుంది ! నేర్చుకోవడం లో ఈ రెండు రకాల జ్ఞాపకాలూ అతి ముఖ్యమైన పాత్ర వహిస్తాయి ! పరీక్షల కోసం చదివే చదువులు, కేవలం తాత్కాలికం గానే మెదడు లో నిక్షిప్తం అయి , విద్యార్ధి కి సమస్యలు సృష్టిస్తాయి ! అందుకే , ఏ సబ్జెక్ట్ లో ఏ పాఠం చదువుతున్నా , ఏ విషయం నేర్చుకుంటున్నా , మూల సూత్రాలు నేర్చుకోవాలి , అని ప్రతి ఉపాధ్యాయుడూ చెబుతూ ఉంటారు ! అంటే కాన్సెప్ట్ లు నేర్చుకోవడం ! ఈ మూల సూత్రాలు కనుక నేర్చుకుంటే, అవి శాశ్వతం గా మెదడు లో నిక్షిప్తం అయి ముందు ముందు కూడా పనికి వస్తాయి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !