Our Health

చదువుకోవడం ఎట్లా ?27. విద్యార్ధులూ – వత్తిడీ ( స్ట్రెస్ )

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 13, 2013 at 7:32 సా.

చదువుకోవడం ఎట్లా ?27.   విద్యార్ధులూ – వత్తిడీ ( స్ట్రెస్ ) 

 
చదువుకోవడం వత్తిడి తో కూడుకున్న పని ! ఎందుకంటే , చదువుకోవడం అనే పని లో , మనసు పూర్తి గా లగ్నం చేసి తదేకం గా చదువుతూ , నేర్చుకుంటూ , నేర్చుకున్న విషయాలను మర్చి పోకుండా , మళ్ళీ మళ్ళీ వల్లె వేస్తూ ,  ఇట్లా అనేక రకాలైన పద్ధతులను అనుసరించుతూ, శ్రమించడం , తప్పకుండా వత్తిడి కలిగించే చర్యే ! ఈ నేర్చుకోవడం ఒక రకం గా వత్తిడి అవుతే , పరీక్షలకు సిద్దమవడం ఇంకో రకం గా వత్తిడి కలిగిస్తుంది ! 
వత్తిడి వత్తిడి వత్తిడి ! స్ట్రెస్,  స్ట్రెస్,  స్ట్రెస్, ఇట్లా లేచిన దగ్గర నుంచి పడుకో బోయే ముందు దాకా,  విద్యార్ధులను వదలదు,  ఈ స్ట్రెస్ ! చాలా మంది విద్యార్ధులను నిద్రలో కూడా పట్టుకుంటుంది ఈ స్ట్రెస్ !  మరి ఈ స్ట్రెస్ కధా కమామీషు ఏమిటి ?  విద్యార్ధులు అంత గా భయ పడే స్ట్రెస్, నిజంగానే ,  అంత ప్రమాద కరమైనదా ? ఈ సంగతులు తెలుసుకోవడం , కేవలం విద్యార్థులకే కాక వారి తల్లి దండ్రులు కూడా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం ! 
వత్తిడి, లేదా స్ట్రెస్ కలగడం సంపూర్ణం గా సహజమైన చర్యే !  వత్తిడి ని అనుభవిస్తూ ఉన్న విద్యార్ధులు , వారు వత్తిడి మూలం గా చదవ లేక పోతున్నామని కానీ ,  పాఠాలను సరిగా అర్ధం చేసుకోలేక పోతున్నామనీ అనుకుంటే , అది పూర్తి గా పొరపాటే ! కారణం : స్ట్రెస్ లేదా వత్తిడి, సహజమైన పరిణామం కాబట్టి ! ఈ సహజమైన వత్తిడి లేదా స్ట్రెస్ ను యూ స్ట్రెస్ అంటారు ! ఈ రకమైన స్ట్రెస్ , ఆశావాద జనితమైన వత్తిడి ! ఈ రకమైన వత్తిడి తో , మానవులు తమ కర్తవ్యానికి ఊపు లేదా ఊతం దొరికినట్టు అనుభూతి చెందుతారు ! అంటే వారికి , వారు చేస్తున్న పనులలో ఆసక్తి పుడుతుంది ! పుట్టిన ఆసక్తి ,  పెరుగుతుంది కూడా !  ఇంత లాభ దాయకమైన స్ట్రెస్ కాబట్టే , అందరు మానవులూ , తమ తమ పురోగతి కోసం, ఈ రకమైన వత్తిడి ని అనుభవిస్తూ ఉంటారు ! ఇంత వరకూ బాగుంది ! 
ఇక ఇంకో రకమైన స్ట్రెస్ లేదా వత్తిడి ఉంటుంది !  డి స్ట్రెస్ లేదా నిరాశా జనకమైన స్ట్రెస్ అని ఇంకోటి ! ఈ రకమైన స్ట్రెస్ విద్యార్ధుల ఉత్సాహాన్ని నీరు గార్చి , వారి పర్ఫామెన్స్ ను తగ్గిస్తుంది ! ఈ రకమైన స్ట్రెస్ , అదే డి స్ట్రెస్ , విద్యార్ధుల పురోగతి కి అవరోధం అవుతుంది ! 
మరి సహజమైన స్ట్రెస్ కూ , హాని కరమైన ( డి ) స్ట్రెస్ కూ తేడా ఎట్లా కనుక్కోవాలి ? :
ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న !  విద్యార్ధులూ , వారి తల్లి దండ్రులూ కూడా తప్పని సరిగా తెలుసుకోవలసిన విషయం ! సహజమైన స్ట్రెస్ తాత్కాలికమైనది ! అంటే , అది సందర్భానుసారం గా పెరుగుతూ  ఉంటుంది !  ఆ సందర్భం దాటాక , ఒక్క సారిగా ఒక భారీ వర్షం వచ్చి , ఆగినట్టు అనుభూతి కలుగుతుంది ! ఆ సందర్భాలు అనేక రకాలు గా ఉండ వచ్చు !  పరీక్షలు కావచ్చు , భయానక సంఘటనలు కావచ్చు ! ఇంట్లో , తరచూ తల్లి దండ్రుల మధ్యా , లేదా తమ్ముళ్ళ , అక్క చెల్లెళ్ళ మధ్య జరిగే వాగ్వివాదాలూ , ఘర్షణలూ కూడా కావచ్చు ! ఇట్లా  అనేక రకాల వత్తిడి కి గురైన మనసులో , ఆ సంఘటనలు అదృశ్యమవ గానే , ఒక్క సారిగా వాన వెలిసినట్టు అనుభూతి కలుగుతుంది ! ఆ పరిస్థితి లో మనం , ఏ మాత్రమూ వత్తిడి లేకుండా , సంపూర్ణం గా విశ్రమించ గలం , మిగతా కార్యక్రమాలలో , పరిగెత్తకుండా , అంటే కేవలం దేహం లోనే కాక మనసులో కూడా ఏ రకమైన  ఆతృతా లేకుండా, రిలాక్స్ అవ గలుగు తాము !  ఈ తాత్కాలిక వత్తిడి కలిగించే సంఘటనలలో, మన దేహం లో కలిగే అనేక జీవ రసాయన చర్యలు కూడా , తాత్కాలికమే అవుతాయి ! 
కానీ, హాని కరమైన వత్తిడి లేదా డి స్ట్రెస్ లో , ఈ సంఘటనలు చాలా తరచు గా జరుగుతూ ఉంటాయి ! అంటే ఒక రకంగా , మానవులు , తీవ్ర మైన వత్తిడి తరచూ అనుభవిస్తూ , ఇతర సామాన్య సంఘటనలకు కూడా ,వారు విపరీతమైన వత్తిడి చెందుతూ ఉంటారు !  ఇంకో రకం గా చెప్పుకోవాలంటే ,  మానవుడి మెదడు లో ఉండే వత్తిడి కి స్పందించే అలారం, పెద్ద వత్తిడీ , చిన్న వత్తిడీ అనే భేదం లేకుండా , ఒకే రకం గా పెద్దగా  మోగుతుంది అంటే రియాక్ట్ అవుతుంది !  తదనుగుణం గా దేహం లో, మెదడు లో అనేక జీవ రసాయన చర్యలు కూడా ! పర్యవసానం గా ఆ తాత్కాలిక వత్తిడి కాస్తా దీర్ఘ కాలిక వత్తిడి గా పరిణామం చెందుతుంది !  ఈ వత్తిడి అనుభవించే వారు తరచూ , తలనొప్పుల తోనూ , చిన్న పాటి పనులు చేస్తేనే అలసట చెందుతూ నూ , కడుపులో తిప్పినట్టు గా ఉండడమూ , తిన్నది అరగక పోవడమూ లాంటి లక్షణాలే కాకుండా , పదే పదే పళ్ళు కొరకడమూ , లేదా వారి చేతి వేళ్ళ గోళ్ళు మొదలంటా కొరుకుతూ ఉండడమో  కూడా చేస్తారు ! వారు చేసే పనులలో , ఏకాగ్రత కోల్పోతూ ఉంటారు !  దానితో తరచూ , తిక మక పడుతూ ఉంటారు !  అంతకు ముందు మితం గా తినే వారు ,  ఎడా పెడా కనిపించిందల్లా , అంటే చిరుతిళ్ళూ , అసలు భోజనమూ , ఎక్కువ గా తింటూ ఉంటారు ! అనేక రకాలైన కూల్ డ్రింక్స్ ఎక్కువ గా తాగుతూ ఉంటారు ! తరచూ ఎక్కువ గా వత్తిడి కలుగుతూ ఉంటే , వారి రోగ నిరోధక శక్తి తగ్గి పోయి ,వారికి తరచుగా , జలుబులూ , పడిశాలూ , తుమ్ములూ , దగ్గులూ వచ్చి , ఆందోళనతో , శ్వాస ఎగ పీల్చడమూ ,  కండరాలు టెన్షన్ తో, బిగుతు గా అవడమూ, నొప్పులు కలగడమూ కూడా సంభవిస్తూ ఉంటాయి !  
ఈ రకమైన స్ట్రెస్ ను వదిలించుకోడానికి మార్గం లేదా ? :  తప్పకుండా ఉంది !  ముందుగా తెలుసుకోవలసినది , పైన వివరించిన విధం గా, ఏది ఆరోగ్యకరమైన వత్తి డో , ఏది హాని కరమైన వత్తి డో , గ్రహించడం !  వచ్చే టపాలో , ఈ హాని కరమైన వత్తిడి నివార ణో పాయాలు తెలుసుకుందాం ! 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: