Our Health

చదువుకోవడం ఎట్లా ? 24. పరీక్ష సమయం లో , ఎక్కువ మార్కుల కోసం, ఏం చేయాలి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 11, 2013 at 5:28 ఉద.

చదువుకోవడం ఎట్లా ? 24. పరీక్ష సమయం లో , ఎక్కువ మార్కుల కోసం,  ఏం చేయాలి ? 

మునుపటి టపాలో,  పరీక్ష సమయం లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం కదా ! ఈ రోజు ఇంకొన్ని కిటుకులు తెలుసుకుందాం ! 
వ్యాస పధ్ధతి లో రాసే జవాబులకు : 
వ్యాస పధ్ధతి లో రాయమని అడిగే ప్రశ్నలను ముందుగా కొద్ది నిమిషాలు వెచ్చించి అయినా సరే , శ్రద్ధతో చదవాలి !  వ్యాసం అడిగాడు కదా,  ఓ ఇరవై లైన్లు  రాసి, ఆన్సర్ పేపర్, ‘వాడి’ మొహాన పారేస్తే సరిపోతుంది ,కనీసం అరవై శాతం మార్కులేయక చస్తాడా ?!   అని, తలా తోకా లేకుండా రాసుకుంటూ పోకూడదు ! నిజం గా, అట్లా ఆలోచించే వారి కెపాసిటీ ఇంకా ఎంతో ఉంటుంది ! కేవలం , అట్లా ఆలోచించడం , ఆచరించడం ద్వారా , వారికి వచ్చే ఎక్కువ మార్కులను చేతులారా పోగొట్టు కుంటారు ! ఇంత కు ముందు టపాలలో రాసినట్టు , రాసే ఆన్సర్ పేపర్ , ఆ  విద్యార్ధి  మెదడు ను  ప్రతిబింబింప చేస్తుంది ! రాత పూర్వకం గా !  విషయం తెలిసి ఉండి కూడా , కేవలం వారి తృప్తి స్థాయిని తగ్గించుకోవడం వలననే , వారు మార్కులు తక్కువ తెచ్చుకుంటున్నారని గమనించాలి !  
వ్యాస పధ్ధతి లో సమాధానం రాయమని అడిగిన ప్రశ్న లకు, మూస పధ్ధతి లో రాసుకుంటూ పోక , ఆ ప్రశ్నలో ప్రత్యేకించి ఏమడుగుతున్నాడో అర్ధం చేసుకోవాలి !   వివరించండి అని ప్రశ్న ఉంటే వివరించాలి ! నిర్వచించండి అని అడిగితే , నిర్వచించాలి ! పోల్చి చూడండి అని అడిగితే , ఆ సమాధానాన్ని వివరం గా పోల్చి ఆ పోలికలను రాయాలి ! సమాధానాన్ని , విభిన్న కోణాలలో , రాయడం , ఇంకా వీలున్న చోటల్లా , ఆ  పాఠం లో వచ్చిన సాంకేతిక పదాలను వాడడమూ మరువ కూడదు !  ఈ సాంకేతిక పదాల గురించి కూడా మనం క్రితం టపాలలో తెలుసుకున్నాం !   ప్రతి సబ్జెక్ట్ కూ  సాంకేతిక పదాలు, ఆ సబ్జెక్ట్ కు చెందిన అక్షరాల లాంటివి !  అంటే , కేవలం భాష  తెలుగైనా , ఇంగ్లీషైనా , సాంకేతిక పదాలు , నేర్చుకునే సబ్జెక్ట్ ను బట్టి , ప్రత్యేకం గా ఉంటాయి ! ఉదాహరణకు :  కంప్యూటర్ ల కు చెందిన సమాధానాలు రాసే చోట ,  దాని మెదడు కెపాసిటీ  1TB అనీ ,  వెబ్ క్యామ్ ను దాని కళ్ళు అనీ రాయడం విచిత్రం గా ఉంటుంది ! ( హార్డ్ డిస్క్ కెపాసిటీ అనీ వెబ్ క్యామ్ అనీ అంటారు కదా వాటిని ) అదే , మానవ మెదడు నూ , కంప్యూటర్ నూ పోల్చి రాయమని  అడిగితే , అప్పుడు ఆ విధం గా పోల్చి వివరించ వచ్చు ! 
మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలూ , నిజం – తప్పు ( ట్రూ ,ఫాల్స్ ) ప్రశ్నల కు సమాధానాలు రాసే సమయం లో కూడా ,  మీరు అనుసరించే పధకం వేరుగా ఉండాలి !  చదవగానే ప్రశ్న కు సమాధానం రాయడానికి ఉబలాట పడకుండా , ప్రశ్నలను తిప్పి ఇస్తున్నాడా , సమాధానాలు సరి యైన వేనా ? అని ఒకటి కి రెండు సార్లు పరిశీలించుకుని , అవసరమైతే ఒక చిత్తు కాగితం మీద  సమాధానం రాసుకుని , తరువాత ఆన్సర్ పేపర్ మీదకు ఎక్కించు కోవచ్చు ! పొర పాట్లను తగ్గించుకునే భాగం గా ! 
పరీక్ష హాలు లో, ఇతర విద్యార్ధులను  పట్టించు కోక పోవడం : ఇది చాలా ముఖ్యమైన పధ్ధతి !  పరీక్ష హాలు లో కాస్త సమయం ఉంటే , ఇతర విద్యార్ధుల ప్రవర్తన పరిశీలించడం  సామాన్యమే , చాలా సమయాలలో అది అప్రయత్నం గానే జరుగుతూ ఉంటుంది !  ఇక  ఒక్కో విద్యార్ధి , ఒక్కో రకం గా ప్రవర్తిస్తూ ఉంటారు, పరీక్షా సమయం లో ! కొందరు , ప్రతి పది నిమిషాలకూ ఒక సారి , ఇన్విజిలేటర్ ను  పిలుస్తూ ఉంటారు !  కొందరు ప్రతి ఇరవై నిమిషాలకూ , అడ్ది షినల్ ఆన్సర్ షీట్ లు అడుగుతూ ఉంటారు ! వారు అట్లా అడుగుతున్నప్పుడల్లా , మిగతా విద్యార్ధులకు  ‘ నేను తక్కువ గా రాస్తున్నానా?  అనే సందేహం కలుగుతూ ఉంటుంది ! ఇంకొందరు విద్యార్ధులు , చాలా ధీమా గా  పరీక్షా సమయం లో సగం సమయం లోనే చప్పున , ఉన్న చోటినుంచి లేచి , ఆన్సర్ పేపర్ , ఇన్విజిలేటర్ కు ఇచ్చి బయటకు వెళుతూ ఉంటారు ! ఇంకొందరు పూర్తి సమయం అయిపోయినాక కూడా , పెన్నులు టేబుల్ మీద పెట్ట మన్నా కూడా , వినిపించు కోకుండా , విపరీతమైన వేగం తో రాస్తూ ఉంటారు ! 
గమనించ వలసినదీ , గుర్తుంచు కోవలసినదీ ఏమిటంటే , ఈ  వివిధ ప్రవర్తనా రీతులు, వారి  మార్కులను నిర్ణయించవు ! మీ మార్కులను కూడా నిర్ణయించ కూడదు ! ఒక వేళ నిర్ణయించ గలుగు తే అది తక్కువ మార్కుల దిశలోనే !  ఎట్టి పరిస్థితులలోనూ , ఆ ప్రవర్తనలు మీ ఏకాగ్రత కు భంగం కలిగించ కూడదు !  అందుకు మీరు చేయవలసిందల్లా , మీ ప్రశ్న పత్రం మీదా , రాసే సమాధానాల మీదా , మీకు అనుమతించిన సమయం , అంటే గడియారం మీదా, మీ  మనసునూ , మేధస్సు నూ కేంద్రీకరించడమే !  ఆ పని మీరు , మీకు ఇచ్చిన సమయమంతా కూడా చేయాలి ! ఎందుకంటే , ప్రతి ఒక్క మార్కూ , విలువైనదే , మీ జీవిత గమనాన్ని మార్చి వేసేదే ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: