విరహ వేదన తైలం గా ఆశాదీపం వెలిగించడం ఎట్లా? 5.
మీ అంతర్మధనాన్ని అర్ధం చేసుకోండి :
ప్రేమ విఫలం అయ్యాక , మీ పునరుద్ధానం లో భాగం గా కొన్ని సలహాలు క్రితం టపాలలో తెలుసుకున్నాం కదా ! ఇప్పుడు, మీ మదిలో చెల రేగే ఆలోచనలూ , భావోద్వేగాలను అర్ధం చేసుకోడానికి ప్రయత్నించండి ! అంటే , మీ ప్రేమ విఫలం అయ్యాక , అనేక రకాలుగా మీరు, అంటే , మీ మనసు స్పందిస్తూ ఉంటుంది , ఆ తదనంతర పరిమాణాలకు ! పరి పరి విధాలు గా, ఆ సంఘర్షణ కు గురి అవుతూ ఉంటుంది . మీరు, ఆ పరిమాణాలను , విశ్లేషించి , తగిన రీతి గా ప్రవర్తించక పొతే , ఆ యా అనుభూతులు మీ మనసు లోనుంచి ఒక పట్టాన మాయమవ్వవు ! ఈ భావోద్వేగాలు మీ మనసు తలుపు తట్టే , పోస్ట్ మెన్ లు ! మీరు తలుపు తీయనంత వరకూ , తలుపు తడుతూనే ఉంటాయి ! మీరు, ఆ పరిస్థితి నుంచి తప్పుకోవాలంటే , మీ మనసు తలుపు పదే , పదే తడుతున్న , ఆ అనుభూతులను ఆహ్వానించి , విశ్లేషించుకుని , మీలో తగిన మార్పులు చేసుకోవడమే ఉత్తమం ! ఇట్లా చేయడం కష్టమైన పనే ! ప్రత్యేకించి , మీ లో కలిగే , క్రోధమూ , ఆందోళనా , అవమానాలను దిగ మింగుతూ , ముందుకు పోవడానికి ప్రయత్నించడం ! కానీ ఆ పని అసాధ్యం కాదు !
మీ మీద మీరు పూర్తి విశ్వాసం , నమ్మకం తో ఉండండి ! :
ప్రేమ విఫలం అవగానే , మీకు ప్రపంచమంతా , శూన్యం గా కనిపిస్తుంది ! చీకటి గా కనిపిస్తుంది ! ఆ పరిస్థితులలో , మీరు ‘ మీ గత ప్రియురాలి నే , లేదా గత ప్రియుడు ఒక్కడినే ప్రేమించ గలరు , ఇక జీవితం లో ఇంకెవ్వరినీ ప్రేమించ లేరు ‘ అనే ‘ మాయ వల ‘ లో పడి విలవిల లాడే ప్రమాదం ఉంది ! మరి ఇట్లా ఎందుకు జరుగుతుంది ? మీరు మీ ప్రేమ విఫలం అయ్యిందనే వాస్తవాన్ని మీ మనసు మూలల్లో ఆమోదించ లేక పోవడం వల్లనా ? , లేదా మీరు ( ప్రేమ విఫలం అవడం వలన) మీలో కలిగిన చెడు ప్రభావాల వలన, మీరు భయ పడడం జరుగుతుందా ? ఆ రకమైన భయాందోళనలు , మీలో ఆ చెడు భావనలను ఎక్కువ కాలం ఉంచి , మీ మనసును ఎక్కువ బరువు గా చేస్తాయి ! వీటికి పరిష్కారం కూడా మీ చేతులలోనే ఉంది ! మీలో ఏర్పడిన ఈ నిరాసక్తత నూ , నిస్సత్తువ నూ , వదిలించు కోవాలంటే ,
1. మీ భవితను ఒక అందమైన ఉద్యానవనం గా ఊహించుకోండి .
2. మీరు అందులో నడుస్తున్నట్టూ , ఆ వనం గేటును , మీరు సునాయాసం గా తెరుస్తూన్నట్టు ఊహించుకోండి !
3. మీరు చక్కగా మీకు ఇష్టమైన దుస్తుల్లో , ఆ వనం లో నడుస్తూ , ఆనందం గా , మీరు కొత్త జీవితం లో ప్రవేశించి , ఒక నూతన అధ్యాయాన్ని , కొత్త ప్రేమికులతో ప్రారంభించ బోతున్నట్టు ఊహించుకోండి ! మీరు ఊహించే ఈ సందర్భాలూ , సమయాలూ , సంఘటనలూ , వీలైనంత స్పష్టం గా మీకు , మీ మనసు చిత్రం లో కనిపించాలి ! అవి మీలో చెరగని ముద్రలు గా ఆవిష్కారం అవ్వాలి ! ఒక్కరితో ప్రేమ విఫలం అయితే , ప్రపంచం లో ఆ ఒక్కరు, కేవలం ఆరు బిలియన్ల మంది లో ఒక్కరే ! అంటే మిగతా అవకాశాలను మీరు విస్మరించ కూడదు ! మీ జీవితం ఎంతో విలువైనది ! మీ జీవితం లో ప్రతి క్షణం విలువైనది ! మీ జీవితం ఒక్కటే ! మీ జీవితం ప్రత్యేకమైనది ! ఆశావాదం తో , కృత నిశ్చయం తో , ముందడుగు వేయండి , విజయాన్ని వరించండి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !