మరి ప్రేమించడం ఎట్లా ? 1.
క్రితం టపాలలో, మానవులకు సంక్రమించిన అమూల్యమైన లక్షణాలలో ఒకటైన ప్రేమ వల్ల, అంటే ప్రేమించడం వల్ల కలిగే శారీరిక , మానసిక లాభాలు తెలుసుకున్నాం కదా ! మరి ఎట్లా ప్రేమిద్దాం ? ! అంటే ప్రేమించడం ఎట్లా ? ఈ విషయం చాలా మంది ని, వారి వారి జీవిత గమనం లో , అనేక దశలలో సందిగ్ధం లో పడ వేస్తుంది ! వివిధ సందర్భాలలో అనేక రకాలు గా మధన పడుతూ కూడా ఉంటాం , మన అనుభూతులు మనం వ్యక్తం చేస్తున్నప్పుడు , మనలో జనించేది ప్రేమా కాదా అనే విషయం కూడా తెలియక తిక మక పడుతూ ఉంటాం ! మరి అది తెలుసుకునే ముందు , ఏది ప్రేమ అవుతుందో ఏది ప్రేమ కాదో తెలుసుకోవడం ముఖ్యమే కదా !
ప్రేమ అంటే ప్రణయం మాత్రమే కాదు !
ప్రేమను కేవలం ప్రణయం తోనే ముడి వేస్తే , ప్రేమ సింధువు లో కేవలం ఒక బిందువును మాత్రమే ఆస్వాదించడం తో పోల్చ వచ్చు ! ప్రేమ ఒక సుందరమైన అనుభూతి ! ఆ అనుభూతిని మనం సామాన్యం గా ఇతర వ్యక్తుల తో పరస్పరం స్పందన, ప్రతి స్పందన ల లో పొందుతాము ! వివిధ పరిస్థితులలో , వివిధ సందర్భాలలో కూడా, వివిధ మానవ సంబంధాలలో కూడా మనం ఈ ప్రేమానుభూతిని చెందవచ్చు !
ప్రేమ వివిధ వ్యక్తుల మధ్య పంచుకోబడుతుంది: ప్రియులు , సోదరులు సోదరీ మణులు , బంధువులు , స్నేహితులు , సన్నిహితులు , ఆప్తులు , ఇట్లా అన్ని తరహాల వ్యక్తుల మధ్యా ప్రేమ పంచుకోవచ్చు !
ప్రేమ మనం చేసే వివిధ పనుల లో కూడా మనం పొందుతాము: మనం చేసే పని లో పూర్తి గా నిమగ్నమై చేసినా , లేదా మనకు చాలా ఇష్టమైన ( దానినే ‘ప్రియమైన’ అని కూడా అంటారు కదా ! ) హాబీ లేదా వ్యాపకం , అది చిత్ర లేఖనం కావచ్చు , నృత్యం , సంగీతమైనా కావచ్చు , ఆ యా వ్యాపకాలను పూర్తి గా నిమగ్నమై సృజనాత్మకత తో , కొనసాగిస్తున్నప్పుడు కూడా ఆ వ్యాపకాలను ప్రేమిస్తూ , ఫలితాన్ని పొంది ఆనంద పడతాము ! దీనినే మానసిక శాస్త్ర రీత్యా ‘ flow ‘ లేదా ఫ్లో అని అంటారు. ఈ ఫ్లో గురించి వివరం గా క్రితం టపాల లో తెలియ చేయడం జరిగింది ( ఉత్సాహం ఉన్న వారు, బాగు ఆర్కైవ్ లలో వెదికితే దొరుకుతాయి ).
సృష్టి రహస్యాలు తెలుసు కుంటున్నప్పుడు , ఈ విశ్వం ఎంత విశాలమైనదో , ఎంత సంక్లిష్టమైనదో , ఎంత జటిలమైనదో , వివిధ అనుభవాల ద్వారా తెలుసు కుంటున్నప్పుడు కూడా మనం, జీవితాన్నీ , మన జీవితాన్నీ ప్రేమించడం అలవాటు చేసుకుంటాం ! జీవితం విలువ గ్రహిస్తూ !
ప్రేమ ను పొందడం , ప్రకృతి ని ఆరాధిస్తూ , ఆస్వాదిస్తూ , ఈ ప్రకృతి లో ఉన్న వివిధ జీవ జంతు జాలాల జీవన శైలి గమనిస్తూ , భూత దయ చూపిస్తూ ఉన్నప్పుడు కూడా జరగ వచ్చు !
ప్రేమను, కేవలం ఇవ్వడం ద్వారా కూడా పొంద వచ్చు : ఏమీ ఇతరులనుంచి కానీ , ఇతర వస్తువులనుంచి కానీ తీసుకోక పోయినా , ఆశించక పోయినా కూడా ! అంటే ప్రేమ స్వభావం ఎప్పుడూ భౌతిక లాభం కోసమే కాదు ! ఈ రకం గా ప్రేమ ఎప్పుడూ ఒక్క గుణమే కలిగి ఉండదు ! మన హృదయం స్పందింప చేసే ఏ సంఘటన , ఏ వ్యక్తులు , అయినా కూడా , మనలో ప్రేమ ను పొంగిస్తాయి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
Wonderful post and beautiful pic
Thanks.
డాక్టర్ గారూ!
ఒక సందేహం. ఇది స్త్రీ – పురుషులమధ్య ప్రేమకు సంబంధించినది కాదు. మనుషులను ప్రేమించటంపై. ఎప్పుడూ ఎదుటి వ్యక్తి వలన మనకేమిటి ప్రయోజనం, నష్టం అని బేరీజు వేసుకోవటం, వాళ్ళు మనతో ప్రవర్తించేదానినిబట్టి(స్నేహంగా ఉంటే స్నేహంగా ఉండటం, కోపం తెప్పిస్తే వాళ్ళను వ్యతిరేకులుగా చూడటంలేదా avoid చేయటం) ప్రతిస్పందించటమే చిన్నప్పటినుంచీ అలవాటైపోయింది. By default, అంటే పెంపకంవలనగానీ, పెరిగిన పరిస్థితులవలనగానీ నా నేచర్ అలా ఉండిపోయింది. మనుషులను ప్రేమించటం, వాళ్ళు ఒకవేళ తప్పుచేసినా దానిని మరిచిపోవటం నాకు అలవాటులేదు. దాంతో బయట సమాజంలో long term relationships లేపు. కానీ, లోలోపల నాకు – చుట్టూ మనుషులు ఉండాలని, అందరూ నన్ను ప్రేమించాలని, నేనూ అందరితో సఖ్యంగా ఉండాలని ఉంటుంది.
నేను ఇప్పుడు నాలో అలా మనుషులను ప్రేమించే గుణాన్ని పెంపొందించుకోగలనా. ఆ మార్పు సాధ్యమేనా. నా వయసు 45 సంవత్సరాలు.
ఇది చాలా మంచి ప్రశ్న.
మీ ప్రస్తుత ప్రవర్తన కు, మీరు ఉదహరించినట్టు గా , బలమైన కారణాలు ఉండి ఉంటాయి. అవి సాధారణం గా మీ మెదడు ఎదుగుతూ ఉన్న సమయం లో అంటే మీ బాల్యం , యవ్వనాలలో , మీ చుట్టూ ఉన్న వ్యక్తులు , మీతో ప్రవర్తించిన తీరు, మీలో వివిధ భావోద్వేగాలను కలిగించి ఉండ వచ్చు !
సమాజం యాంత్రికం అవుతూ ఉంది ! వివిధ వ్యక్తుల మధ్య సంబంధాలు, కేవలం యాంత్రికం గా తయారవుతున్నాయి ! అందువల్ల, మీ అనుభవాలు కూడా, యాంత్రికం గా అనుకోవడం మీ పొరపాటు కాదు ! కాకపొతే ,మన సమాజం లో జరుగుతున్న సంఘటనలకు , మనం కూడా కేవలం, యాంత్రికం గానే ప్రతిస్పందిద్దామా అనుకుటున్నప్పుడే , మనలో అంతర్మధనం మొదలయ్యేది ! అందుకు కారణాలు రెండు. మనకు వివిధ సందర్భాలలో జరిగిన అన్యాయాలూ , మోసాలూ , గుర్తుంచుకుని భవిష్యత్తు లో జాగ్రత్త గా ఉండడం ఒక పధ్ధతి ! లేదా, మనకు జరిగిన మోసాలకు ప్రతీకారం గా ,మనం కూడా మోస పూరిత , ద్వేష పూరిత స్వభావాన్ని అలవరచుకుని , మనకు ఎదురయే వ్యక్తులతో అట్లాగే ప్రవర్తించు దామనుకోవడం ఇంకో పధ్ధతి ! ఈ రెండో పధ్ధతి మీరు ఎంచు కునేట్టయితే , గమనించ వలసినది , మీరు, మీ వ్యక్తిత్వాన్నే మార్చుకుంటున్నారు ! అంటే, స్వతహా గా మీరు మంచి వారే !కానీ మీ ప్రవర్తన ప్రతీకార వాంఛ తో , మోస పూరితం అవుతుంది ! సమాజం లో మీకెదురైన అనుభవాలకు మీ వ్యక్తిత్వాన్ని పణం గా పెట్టడం ఎంత వరకు సమంజసమో మీరే నిర్ణయించుకోవాలి !
మీ చుట్టూ మనుషులు ఉండాలనీ , వారి ప్రేమను మీరు పొందాలనీ , వారందరితో మీరూ సఖ్యం గా ఉండాలనీ మీ కోరికలు తెలియచేశారు ! మీలో మంచి స్వీయ విశ్లేషణా గుణం ఉంది ! అది చక్కగా మీకు , మీ భవిష్యత్తు కూ ఉపయోగ పడుతుంది !
మీరు గుర్తుంచుకోవలసినది ‘ రెండు వేల ఏళ్ల క్రితమే ఏసు ( జీసస్ ) చెప్పిన వాక్యం ‘ నీవు ఇతరులతో ఎట్లా ప్రేమించ బడాలని అనుకుంటున్నావో, అట్లా ముందుగా నీవే ప్రవర్తించు ‘ దానినే కాస్త మార్చి గాంధీ గారు అన్న వాక్యం ‘ నీవు సమాజం లో ఏమార్పు కోరుతున్నావో , ఆ మార్పు కు ప్రారంభం నీతోనే చేయి ! ‘ అని !
మీ వయసు 45 ఏళ్ళు అని తెలిపారు. ప్రస్తుత కాలం లో ( మీరు కనీసం 90 ఏళ్ళు బ్రతుకుతారనుకున్నా ) ఇంకా మీది చిన్న వయసే కదా ! మీలో మలిన పడి, ముడి పడ్డ ఆలోచనలను క్రమేణా మార్చుకుని ( మీకై మీరైనా , లేదా మానసిక శాస్త్రజ్ఞుడి సహాయం తోనైనా అంటే సైకాలజిస్ట్ ) మీరు ‘ నాణానికి రెండో వైపు ‘ కూడా చూడడం మొదలెడితే , మీ జీవితం లో విజయం మీదే ! మీరూ చక్కగా మీ ప్రేమను పంచ గలరు ! ఎంతో ప్రేమ ను పొంద గలరు కూడా !