ప్రేమ తో ఆరోగ్యం !
సృష్టి లోని అనేక జీవ జాతులకు సంక్రమించిన అనేక ప్రత్యేక లక్షణాలలో , ప్రేమ ఒకటి ! ప్రేమ అనిర్వచనీయం ! ప్రేమ పండితులు అనేక రకాలు గా నిర్వచించారు ప్రేమను ! ఆధునీకరణం చెందుతున్న ప్రపంచం లో, భౌతిక అవసరాలకు అధిక ప్రాముఖ్యత ఇచ్చి , అతి విలువైన , అతి ప్రధానమైన ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నారు మానవులు! ప్రేమ అనేక రకాలైన జీవ రసాయన చర్యల పర్యవసానం ! మనం సామాన్యం గా ప్రేమను, మన చర్యల రూపం లో, అంటే మన చేతల ద్వారా చూపిస్తాం ! కానీ తిరిగి , ఆ చూపిన ప్రేమను , కేవలం మన అనుభూతుల ద్వారానే ఆస్వాదించ గలుగుతాము ! మరి మనం పొందే ప్రేమ , వలన మనకు ప్రయోజనాలేమైనా ఉన్నాయా ? మన మానసిక శాంతి కీ , శారీరిక ఆరోగ్యానికీ , మనం ఇచ్చే ప్రేమా , మనం తిరిగి పొందే ప్రేమా ఏ రకం గా ఆరోగ్య దాయకం ? మనం ఉదయం లేచిన దగ్గరి నుంచీ , పడుకునే వరకూ , కేవలం మనం తినే ఆహారం , దాని పోషక విలువల లెక్కలతోనే మన ఆరోగ్యాన్ని అంచనా వేసుకుంటూ ,జీవితం గడిపేద్దామా ?
ప్రేమ తో రోగ నిరోధక శక్తి : అంటే ఇమ్యునిటీ : ప్రేమ మనలో రోగ నిరోధక శక్తిని శక్తి వంతం చేస్తూ ఉంటుంది ! ప్రేమ జంటలు , తమకు ఎదురైన వ్యక్తి గత సంబంధాల విషయాలలో , వివాదాలు ఏర్పడినప్పుడు , తరచూ ఘర్షణ పడుతూండడం సామాన్యమే ! ఆ సందర్భాలలో , నిరాశా జనకం గా , నెగెటివ్ దృక్పధం తో విసుగు తో , వాదనలతో , ఆ ఘర్షణ వాతావరణాన్ని కలుషితం చేసుకునే ప్రేమ జంటల శారీరిక స్థితి మీద అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు , వారిలో రోగ నిరోధక శక్తి , చెప్పుకో దగినంత గా అంటే సిగ్ని ఫికెంట్ గా తగ్గుతుందని కనుక్కున్నారు ! అట్లాంటి సందర్భాలను , ప్రేమ తో , ఆశావాద దృక్పధం అంటే పాజిటివ్ దృక్పధం తో నవ్వుతూ ఎదుర్కుని , వాటి పరిష్కారాలను వెదికి అన్యోన్యం గా కాపురాలు కొన సాగించే ప్రేమ జంటల రోగ నిరోధక శక్తి , సమపాళ్ళలో, శక్తి వంతం గా ఉంటున్నట్టు విశదమైంది !
ప్రేమ గా వ్యాయామం ! : ప్రేయసీ ప్రియులు ప్రేమ గా కలిసి జిమ్ లో వ్యాయామాలు చేస్తే వ్యాయామం ఉత్సాహం తో చేయడమే కాకుండా , ‘ పది కాలాల పాటు ‘ ఆ వ్యాయామాన్ని కొనసాగిస్తారు కూడా ! ఒక పరిశీలనలో , ఒంటరి గా వ్యాయామం చేసే వారిలో, సగం మంది , ఒక సంవత్సరం కాగానే , వ్యాయామం చేయడం మానేశారు ! అదే సమయం లో, జంటగా ప్రేమ గువ్వలు గా, జిమ్ లో వ్యాయామం చేసే వారు, మూడు వంతుల మంది, ఒక సంవత్సరం దాటినా కూడా , వ్యాయామం కొన సాగించారు ! అంటే , ప్రణయం తో, వ్యాయామం కుంటు పడదన్న మాట !
ప్రేమ తో దీర్ఘాయిషు : ప్రేమ మయమైన జీవితాలు గడిపే జంటలు , ఎక్కువ కాలం జీవిస్తారని అనేక పరిశీలనల వల్ల తెలిసింది ! తమ జీవితాలను ఇంకొకరికి అంకితం ఇచ్చి , ఒక ప్రేమ బంధాన్ని ఏర్పరుచుకుని , సహచర జీవితం గడిపే వారు , నిశ్చింత గా ఏ రకమైన మానసిక వత్తి డీ లేకుండా , ఆనందం గా జీవిస్తున్నారని కూడా స్పష్ట పడింది ! అంతే కాకుండా , వారు ఆ పరిస్థితులలో , దీర్ఘ కాలం , ఆనందం గా జీవించగలగడానికి పురుషులు , ఒంటరి గా ఉన్నప్పుడు తమకు ఉన్న తాగుడు , పొగ తాగడం , మొదలైన వ్యసనాలకు , ఒక ( వివాహ ) బంధం ఏర్పడ్డాక , కళ్ళెం వేసి , ఆ అలవాట్లను బాగా నియంత్రణ లో ఉంచడమూ , చాలా సందర్భాలలో , ఆ అలవాట్లను పూర్తి గా మానేయడం వల్ల కూడా అని విశదమైనది !
వచ్చే టపాలో ప్రేమ తో ఇంకొన్ని లాభాలు తెలుసుకుందాం !
good