4. మైగ్రేన్ కు చికిత్స ఉందా ?
మైగ్రేన్ తలనొప్పి బాధాకరం గానూ , జీవితాలను అస్తవ్యస్తం చేసేది గానూ ఉంటుంది. మైగ్రేన్ కు ఖచ్చితమైన చికిత్స లేదు. ప్రస్తుతం మార్కెట్ లో లభ్యమయేవి అన్నీ కేవలం మైగ్రేన్ లక్షణాలను ఉపశమనం కలిగించే మందులే !
1. పారా సె టమాల్ ( క్రోసీన్ ) టాబ్లెట్స్ : మైగ్రేన్ సమయం లో తలనొప్పిని తగ్గించడానికి సాధారణం గా తీసుకునే టాబ్లెట్. ఈ టాబ్లెట్ ను మైగ్రేన్ మొదటి దశలోనే వేసుకోవడం మంచిది. ఎందుకంటే , హెడేక్ దశ వచ్చే సమయానికి , ముందే వేసుకున్న టాబ్లెట్ లు పని చేయడం మొదలెడతాయి. ( సామాన్యం గా ఏ టాబ్లెట్ అయినా పని చేయాలంటే, మింగిన తరువాత కనీసం రెండు మూడు గంటలు పడుతుంది ). అంతే కాక, రోజుకు ఎనిమిది టాబ్లెట్స్ కన్నా ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు ( అంటే రెండు టాబ్లెట్స్ ఒక్కో సారిగా , అంటే నాలుగు నుంచి ఆరుగంటల వ్యవధి లో రోజుకు నాలుగు సార్ల కన్నా ఎక్కువ గా తీసుకోకూడదు ).
2. ట్రి ప్టాన్ టాబ్లెట్స్ : ఈ మందులు మెదడు లోని రక్తనాళాలను సంకోచ పరిచి మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తాయి ( మైగ్రేన్ లో రక్తనాళాలు వ్యాకోచించడం వల్ల తీవ్రమైన తలనొప్పి కలుగుతుందని భావించ బడుతుంది అందువల్ల )కానీ ఈ ట్రి ప్టాన్ టాబ్లెట్స్ , అందరిలోనూ ఒకే విధం గా పని చేయక పోవచ్చు.
3. ఐబూ ప్రోఫెన్ , డిక్లో ఫెనాక్ లాంటి మందులు : ఈమందులు కూడా కొంత మందిలో చక్క గా పని చేసి తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి కానీ ఆస్థమా ఉన్న వారు ఈ మందులు వేసుకో కూడదు. ఆస్థమా ఉన్న వారు , స్పెషలిస్ట్ డాక్టర్ ను సంప్రదించి తగిన సలహా తీసుకోవడం ఉత్తమం.
4. హార్మోనులు : ఋతుక్రమ మైగ్రేన్ ఉన్న వారు ( అంటే ఋతుక్రమ సమయం లో మైగ్రేన్ తలనొప్పి వస్తుంటే ) హార్మోనులు , ప్రత్యేకించి , ఈస్ట్రో జెన్ పాచెస్ ( అంటే వీటిని దేహం లో ఒక చోట అతికించుకోవాలి ) లేదా కాంట్రా సేప్టివ్ పిల్స్ తీసుకుంటే , కూడా మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. కాక పొతే స్పెషలిస్ట్ పర్యవేక్షణ లోనే ఇది జరగాలి.
మైగ్రేన్ ఎటాక్ వచ్చిన సమయం లో ఏమిచేయాలి ?
చాలా వరకూ , మైగ్రేన్ తలనొప్పి వచ్చిన సమయం లో ఒక ప్రశాంతమైన, చీకటి గది లో కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం , లేదా నిద్ర పోవడం లాంటి చర్యలు తీసుకుంటే , తలనొప్పి తగ్గుముఖం పడుతుంది ! కొంత మంది కి కడుపులో వికారం గా అనిపించి వాంతి చేసుకోవడం జరుగుతుంది. అట్లా వాంతి అయినాక , వారి తలనొప్పి కూడా తగ్గి పోతుంది !
ఇంకో ముఖ్య సూచన : మైగ్రేన్ ఉన్న వారు , తలనొప్పి తగ్గడానికి మందులు వేసుకుంటున్నా , వారు సాత్వికమైన ఆహారం కూడా తింటూ ఉండాలి ఆ సమయం లో !ఎందుకంటే , నొప్పి తగ్గించడానికి వేసుకునే మాత్రలు కడుపులో మంట కూడా కలిగిస్తాయి ! ఆ సమయాల లో మసాలా వంటకాలూ , ఎక్కువ నూనె లో వండిన వంటకాలూ తింటే , కడుపులో మంట అధికం అవడానికి అవకాశాలు ఎక్కువ !
మైగ్రేన్ ను నివారించ వచ్చా ?:
క్రితం టపాలలో వివరించినట్టు గా మైగ్రేన్ ఏ ఏ పరిస్థితులలో వస్తుందో , ఎవరికి వారు అనుభవ పూర్వకం గా తెలుసుకుని , తదనుగుణం గా నివారణ చర్యలు తీసుకోవాలి.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
సాత్వికమైన ఆహారం కూడా తింటూ ఉండాలి ఆ సమయం లో ! వివరించగలరు
మంచి ప్రశ్న.
మైగ్రేన్ లో పథ్యం, రెండు రకాలు గా లాభ దాయకం.
మనం తినే ఆహారం లో ఉండే కొన్ని పదార్ధాలు సహజం గానే మైగ్రేన్ కలిగిస్తాయి, కొంత మందిలో ! మరి ఈ కొందరిలోనే ఎందుకు మైగ్రేన్ వస్తుందో , ఆ కారణాలు ఇతమిద్ధం గా ఇప్పటి వరకూ తెలియలేదు !
కానీ కొన్ని ఆహార పదార్ధాలు సామాన్యం గా మైగ్రేన్ ఉన్న వారికి పడవు. ముఖ్యం గా మాంసా హారులైతే , కొన్ని రకాల చేపలూ , గేదె మాంసమూ , లాంటి వి.
మాంసాహారులలోనూ , శాకాహారులలోనూ కూడా , జున్ను. దానినే చీజ్ అని అంటారు ఆంగ్లం లో ( విదేశాలలో ఏ సూపర్ మార్కెట్ కు వెళ్ళినా కూడా కనీసం ఒక యాభై రకాల జున్ను అమ్ముతూ ఉంటారు, అంత సామాన్యం, జున్ను తినడం, విదేశాలలో ! ) కానీ కొద్దిగా నిలువ ఉన్నా చీజ్ , అదే జున్ను లో ఉండే కొన్ని ప్రోటీనులు , అంటే మాంస కృతులు టైరమిన్ అనే రసాయనం లాగా మారుతాయి. టైరమిన్ మైగ్రేన్ కారకం. అందువల్ల మైగ్రేన్ ఉన్న వారు జున్ను తినక పోవడం మంచిది, అట్లాగే ఎక్కువ గా కాఫీ తాగే వారు కూడా మైగ్రేన్ బారిన పడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ! ఎక్కువ గా పచ్చళ్ళు తినే వారికి కూడా ఈ రిస్కు ఉంటుంది
ఇక రెండో లాభం ఏమిటంటే , సామాన్యం గా ( మైగ్రేన్ ) తలనొప్పి కి వాడే చాలా మందులు సహజం గానే కడుపులో మంట దానినే ఇరిటేషన్ అని అంటారు , కలిగిస్తాయి. అదే సమయం లో ఇరిటేషన్ కలిగించే ఆహారం కూడా , ఆ మందులకు తొడవు తే !!!! ??? అందుకే పథ్యం !
మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు వస్తువులు రేండుగా కనిపిస్తాయా?
వీరన్న గారూ ,
మైగ్రేన్ తల నొప్పి దీనినే పార్శ్వపు నొప్పి అని కూడా అంటారు కదా ! ఎదుటి వస్తువులు , వ్యక్తులూ రెండు గా కనబడడం ఒక సామాన్య లక్షణం ! కొందరికి తల తిరగడం , వికారం గా ఉండడం , కూడా జరుగుతుంది !
మైగ్రేన్ చికిత్స కు మంచి మంచి మందులు వచ్చాయి మార్కెట్లోకి , కాకపొతే , మీరు ఒక మంచి స్పెషలిస్ట్ ను సంప్రదించి , చికిత్స చేయించుకోండి ! తప్పక ఉపశమనం కలుగుతుంది !