4. గురక లో గ్రేడ్ లు ఉంటాయా?
క్రితం టపాలలో , గురక అంటే ఏమిటి , గురక ఎట్లా వస్తుంది , గురకకు కారణాలు ఏమిటి అన్న విషయాలు తెలుసుకున్నాం కదా !మరి గురక అందరిలోనూ ఒకే లా ఉంటుందా , లేదా గురక తీవ్రత గు గ్రేడ్ లు ఉన్నాయా అంటే , ఉన్నాయనే సమాధానం చెప్పుకోవాలి !
1. గ్రేడ్ వన్ గురక !:
దీనినే సామాన్యమైన గురక అని చెప్పుకోవచ్చు ! ఇట్లా గ్రేడ్ వన్ గురక రాయుళ్ళు ఒక క్రమ పధ్ధతి లో రెగ్యులర్ గా కాకుండా , కేవలం అప్పుడప్పుడూ లేదా ,వారం లో కొన్ని రోజులు ,మాత్రమే గురక పెడుతూ ఉంటారు ! అంతే కాకుండా , ఈ గురక రాయుళ్ళ గురక పెద్ద పెద్ద శబ్దాలు చేయకుండా , కాస్త నెమ్మది గా ఉంటుంది !ఉండీ లేనట్టు !ముఖ్యంగా , గ్రేడ్ వన్ గురక పెట్టే వారిలో, వారి శ్వాస గురక వల్ల ప్రభావితం అవ్వదు ! అంతే కాకుండా , వారి ఆరోగ్యానికి కూడా ఇతర విధాలుగా ఈ గ్రేడ్ వన్ గురక హాని చేయదు ! మహా అవుతే , వారి భార్యలకూ , లేదా స్నేహితురాళ్ళకూ , వారి గురక విసుగు తెప్పించడమే కాకుండా, వారి నిద్ర కూడా పోగొట్టి , సంబంధాలు తెగతెంపులు చేసుకునే పరిస్థితి కల్పించ గలదు ఈ గ్రేడ్ వన్ గురక ! అందువల్ల కాస్త అప్రమత్తత అవసరం !
2. గ్రేడ్ టూ గురక :
ఈ గురక రాయుళ్ళు, కాస్త ముందుకు పోయి , ఒక క్రమ పధ్ధతి లో కనీసం వారం లో మూడు రోజులైనా తప్పని సరిగా గురక పెడుతూ ఉంటారు ! వీరి శ్వాస కూడా కొంత వరకూ , వీరి గురక చేత ఇబ్బంది అవ వచ్చు ! దానితో వీరు నిద్ర సరిగా పోలేక , పగలు చాలా అలసినట్టు పగలు కూడా నిద్ర లేమి తో కనబడుతుంటారు !
3. గ్రేడ్ త్రీ గురక : ఈ గురక పెట్టే వారు, ఇంకాస్త ముందుకు పోయి ,రోజూ , పెద్ద గా గురక పెడుతుండడం చేత , వీరి గురక వారు పడుకున్న గది బయట కు కూడా వినిపిస్తూ ఉంటుంది ! ( ప్రత్యేకించి దొంగలకు ! ) వీరికి గురక తీవ్రత వల్ల OSA అనే పరిస్థితి కూడా వస్తుంది OSA అంటే ఓ ఎస్ ఏ. అంటే అబ్ స్ట్ర క్టివ్ స్లీప్ అప్నియా సిండ్రోం. వీరిలో శ్వాస కూడా ఒక పది సెకన్ ల పాటు ఆగిపోతూ ఉంటుంది ! వీరు గురక పెట్టినపుడల్లా ఈ పరిస్థితి కలిగి, నిద్రలో తరచూ శ్వాస తీసుకోవడం కష్టం పరిణ మించడం వల్ల , సరిగా రాత్రులు నిద్ర పోలేక పోతారు ! వారి సతీ పతుల సంగతి సరే సరి ! దానితో వారు పగలు చాలా అలసిపోయి వారి దైనందిన కార్యక్రమాలు సరిగా చేసుకోలేక పగలు నిద్రతో తూలుతూ ఉంటారు ! వారు డ్రైవింగ్ చేస్తున్నా , లేదా పెద్ద పెద్ద యంత్రాలతో పనిచేస్తున్నా కూడా , వారికి ఈ పగటి నిద్ర తో తూలే పరిస్థితి , ప్రమాద కరం గా పరిణమించ వచ్చు !
మరి మీరు ( ఒక వేళ గురక పెడుతూ ఉంటే ) ఏ గ్రేడ్ కు చెందుతారు ?
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !