19. డయాబెటిస్ చికిత్సా సూత్రాలు !

ఎన్నడూ మానకు , పథ్యం ,యోగం , వ్యాయామం,
రెండో దశలో కలుపు, మెట్ ఫార్మిన్ !
మూడో దశలో అవసరమేమో, ఇన్సులిన్ !
ఏకాదశి నాడే కలగాలి, చెక్కెర పై వ్యామోహం !
ద్వాదశి నుండి కొనసాగించు, చికిత్సా దీక్ష , శివోహం !
సదా వైద్య సలహా తో మేలవును, మధుమేహం !
క్రితం టపాలో చూశాము కదా డయాబెటిస్ యొక్క చికిత్స మీద ఉన్న అపోహలూ అపార్ధాలూ ! మరి పైన ఉన్న ‘ పద్యం ” మళ్ళీ మళ్ళీ చదివితే , చికిత్స అంటే ఏమిటో గుర్తు ఉంచుకోడానికి వీలుగా ఉంటుంది ! మొదటి దశ లో అంటే డయాబెటిస్ ను కొత్తగా నిర్ధారించిన వెంటనే , చేయవలసినది , పథ్యం , యోగం , వ్యాయామం !
పథ్యం : ఈ పదం చాలా చిన్న గా ఉన్నా ఎంతో అర్ధవంతమైనదీ , అమూల్యమైనదీ కూడానూ ! ఏ రకమైన ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకునే ఆహారమైనా పథ్యం అనబడుతుంది ! అంటే ఏది పడితే అది, ఎంత పడితే అంత తినకుండా , ప్రత్యేకమైన కూరగాయలు కానీ , ధాన్యాలు , చిరుధాన్యాలు కానీ , లేదా వివిధ పానీయాలు కానీ, చాలా ప్రత్యేకం గా , అంటే ఏరి కోరి , తీసుకుని , వాటిని వండడం లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని , వండడమే కాక , పరిమాణం కూడా నియమితం గా తీసుకుంటే దానిని పథ్యం అంటారు !
మరి డయాబెటిస్ లో పథ్యం ఎట్లా ఉండాలి ?: ముందుగా డయాబెటిస్ ఉన్న వారు, వారి రోజువారీ క్యాలరీలు ఎన్ని వ్యయం చేస్తున్నారో లెక్క కట్టుకోవాలి ! వారికి ఆ విషయం తెలియక పొతే , తెలిసిన వారి సహాయం తీసుకోవాలి ! ఆ తరువాత , రోజులో వ్యయం అయ్యే క్యాలరీలను షుమారుగా మూడో ,నాలుగో భాగాలు గా , అంటే మూడు నాలుగు సార్లు మనం రోజూ ఆహారం తీసుకుంటాం కాబట్టి , విభజించుకుని , ఒక్కో భాగం లో ఎన్ని క్యాలరీలు ఉంటాయో , ఆ క్యాలరీల కు సరిపడే ఆహారాన్నే తీసుకోవడానికి మానసికం గా సిద్ధ పడాలి ! గమనించ వలసినది , వ్యయం కాని క్యాలరీలు, కొవ్వు రూపం లోనో , లేదా షుగరు రూపం లోనో శరీరం లో అదనం గా ఏర్పడుతూ , డయాబెటిస్ కంట్రోలు కు అవరోధం అవుతాయి !
యోగం : అంటే యోగా చేయడం : ఇది చికిత్స మధ్య లోకి ఎందుకు వచ్చింది , పానకం లో పుడక లాగా ? అని అనుకుంటారేమో ! యోగా చేయడం వల్ల ,మానసిక వత్తిడి తగ్గుతుంది ! మానసిక వత్తిడి తగ్గితే , వత్తిడి అయినప్పుడు మన శరీరం లో ఏర్పడే హానికరమైన , ప్రత్యేకించి రక్తం లో గ్లూకోజు ను పెంచే ఎడ్రినలిన్ లాంటి హార్మోనులు తగ్గుముఖం పడతాయి ! దానితో రక్తం లో చెక్కెర కూడా కొంత వరకు తగ్గుతుంది !
ఇక వ్యాయామం : దీని ప్రాముఖ్యత ప్రత్యేకం గా చెప్పుకోనవసరం లేదు కదా ! వ్యాయామం కొవ్వును కరిగిస్తుంది, క్యాలరీలను కరిగిస్తుంది ! రక్తం లో ఉన్న గ్లుకోజును కండరాలలోకి ప్రవేశ పెట్టి , తద్వారా , రక్తం లో గ్లూకోజు ను తగ్గిస్తుంది ! ముఖ్యం గా గమనించ వలసినది ఏమిటంటే , ఈ పథ్యం , యోగం , వ్యాయామం , డయాబెటిస్ నిర్ధారణ అయినప్పటి నుంచీ , జీవితాంతం కొనసాగిస్తూ ఉండాలి ! మందులు , లేదా ఇన్సులిన్ తీసుకోవాల్సి వచ్చినా కూడా ! ఎందుకంటే పై మూడు పద్ధతులు కూడా , సహజం గానే గ్లూకోజును తగ్గించే పద్ధతులే కదా !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
మంచి సూచన. వీటిని అమలుచేస్తే మందులు వాడే అవసరం బాగా తగ్గిపోతుంది. సుగర్ కంట్రోల్ లో ఉండి ఇతరమయిన ఇబ్బందులురావు. సాధారణంగా అందరూ మందులేసుకుంటున్నాంగా అని వీటిని పాటించకపోతే ఇబ్బందులే. నేను ఎక్కువగా పాటించేది వీటినే అందుకే నా సుగర్ లెవెల్ కంట్రొల్ లో ఉంటుంది 🙂 నిజానికి ఈ వీషయాలు డాక్టర్లూ చెప్పరు, రోగులూ తెలుసుకోడానికి ఉత్సాహం చూపరు.
నిజమే శర్మ గారూ , రక్త పీడనమే ( బీ పీ ) తీసుకోండి ! బీపీ మందులు వేసుకోడం తోనే ( బీపీ కంట్రోలు లో ) తమ బాధ్యత తీరిపోతుందన్నట్టు, ఉప్పు వేసిన వంటకాలు , చక్కగానూ , ఎక్కువ గానూ, తింటూ ఉంటారు, చాలామంది , తరువాత బీ పీ కంట్రోలు లో ఉండట్లేదని వాపోతూ ఉంటారు !