10. డయాబెటిస్ లో కళ్ళ కాంప్లికేషన్ లు.
క్రితం టపాలో , కంట్రోలు లేని డయాబెటిస్ కంటి రెటినా పొర ను ఎట్లా ” ముట్టడి ” చేస్తుందో చూశాము కదా ! ఈ రెటినా పొరలో మార్పులు రావడాన్ని రెటినోపతీ అంటారు. ఇప్పుడు కంటిలో, డయాబెటిస్ వల్ల వచ్చే మిగతా మార్పులు లేదా కాంప్లికేషన్ ల గురించి తెలుసుకుందాం !
గ్లకోమా :

కేవలం రెటీనా లో మార్పులే కాకుండా , కంటి లో ఉండే పీడనాన్ని ఎక్కువ కూడా చేస్తుంది డయాబెటిస్. పై చిత్రం లో చూడండి ! కంటి లో పీడనం ఏమిటి ? అని ఆశ్చర్య పోతున్నారా? ఒక ఉదా హరణ: నోటితో ఊదే బూర ఒకటి మీరు చూశే ఉంటారు. ఆ బూరలో , గాలిని ఊదినపుడు కానీ , లేదా నీతితో నింపినపుడు కానీ, ఆ బూర ఉబ్బిపోయి, నిండు గా కనబడుతుంది ! అంటే ఆ బూరలో వత్తిడి, లేదా పీడనం పెరిగుతుంది , గాలిని కానీ, నీటిని కానీ నింపినపుడు. కానీ ఆ గాలిని కానీ , నీటిని కానీ తీసి వేస్తే ,ఆ బూర ముడుచుకు పోయి కనిపిస్తుంది కదా ! అదే విధం గా, మన కనుగుడ్డు లో వివిధ ద్రవాలు నింపబడి , కను గుడ్డు ముడుచుకు పోకుండా, పీడనం నిరంతరం కాపాడుతుంది. ఈ పీడనాన్ని నియంత్రించే ద్రవాలు నిరంతరం మారుతూ , పాత ద్రవాలు పోతూ, కొత్త ద్రవాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. కంట్రోలు లో లేని డయాబెటిస్ తో పాత ద్రవాలు విసర్జింప బడే నాళికలు కుంచించుకు పోవడమూ , లేదా మూసుకు పోవడమూ జరుగుతుంది. దానితో కనుగుడ్డు లో పీడనం లేదా వత్తిడి పెరుగుతుంది. ఆ పీడనం వల్ల రెటినా పొర కూడా ప్రభావితమవుతుంది ! ఈ పరిస్థితిని గ్లకోమా అంటారు ! ఆరోగ్యవంతుల కంటే , డయాబెటిస్ ఉన్న వారికి నలభై శాతం ఎక్కువ గా ఈ గ్లకోమా వస్తుందని పరిశీలనల వల్ల తెలిసింది.
శుక్లాలు ( కాటరాక్ట్ ) :

మీరు మునుపటి టపాలో కంటిలోని భాగాల గురించి చూసి ఉంటారు ! పై చిత్రం లో చూడండి ! కంటిలో ఉండే ఇంకో ముఖ్య భాగం , కంటి కటకం అదే లెన్స్ . మానవులందరి కళ్ళ లోనూ సహజం గా పుట్టుకతోనే , ఒక కటకం కూడా నిర్మితమై ఉంటుంది. ఈ కటకం మనం కన్ను తెరిచినపుడు , బయట ఉన్న వెలుతురు ను రెటినా మీద పడేట్టు చేస్తుంది.అంతే కాక , మనం చదివే అక్షరాలూ మనకు కనబడుతున్నాయంటే , ఈ కంటి కటకం పారదర్శకంగా ఉండడం వలనే ! డయాబెటిస్ లో ఈ కంటి కటకం యొక్క పారదర్శకత తగ్గిపోయి, మసక బారుతుంది. దానితో చూపు మందగిస్తుంది. గమనించవలసినది, ఆరోగ్యవంతుల కళ్ళ లో కూడా కంటి కటకం యొక్క పారదర్శకత తగ్గుతూ ఉంటుంది. కానీ శుక్లాలు అంటే క్యాట రాక్ట్ లు ఏర్పడడం, ఏ ఏడో దశకం లోనో వస్తుంది కానీ డయాబెటిస్ ఉంటే యాభై అరవై ఏళ్లకే శుక్లాలు వస్తాయి !
రేటినోపతీ :

పైన చెప్పుకున్నట్టు గా రెటినా పోర లోని అనేక సూక్ష్మ రక్త నాళాలలో , కొన్ని దశలు గా డయాబెటిస్ వల్ల మార్పులు వస్తాయి ! ఆ మార్పులు రెటినా పొర ను క్రమేణా పని చేయకుండా చేస్తుంది ! పై చిత్రం లో చూడండి ! పైన చెప్పుకున్న పరిస్థితులన్నీ కూడా కంటి చూపును మందగింప చేయడమే కాకుండా , కన్ను నొప్పి కూడా కలిగిస్తాయి ( గ్లకోమా లో )అంతే కాక ఈ పరిస్థితులలో వేటినీ అశ్రద్ధ చేయకూడదు !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !