7. ప్రీ డయాబెటిస్ కనుక్కోడానికి త్రీ బ్లడ్ టెస్టులు :
ప్రీ డయాబెటిస్ యొక్క ప్రాముఖ్యత, క్రితం టపాలో తెలుసుకున్నాం కదా ! ఈ దశ ను కనుక సరైన సమయం లో గుర్తించి , తగిన జాగ్రత్తలు తీసుకుంటే వందలో అరవై మంది వరకూ , డయాబెటిస్ బారిన పడకుండా తప్పించుకోవచ్చు ! మరి ఈ అరవై శాతం మంది లో అందరూ ఉండాలని అనుకుంటే , ఈ ప్రీ డయాబెటిస్ లక్షణాలను తెలుసుకోవడమే కాకుండా , ( ఈ లక్షణాలను క్రితం టపాలో వివరించడం జరిగింది కదా ! ) , అవసరమైన మూడు రక్త పరీక్షల గురించి కూడా తెలుసుకోవాలి !
1. మొదట గా Hb A 1 C పరీక్ష :
ఈ పరీక్ష రక్త పరీక్ష. దీనివల్ల మన రక్తం లో చెక్కెర ఏమాత్రం ఉందో సూచిస్తుంది ! కేవలం ఏమాత్రం చెక్కెర ఉందో సూచించడమే కాకుండా , ముఖ్యం గా ఆ చెక్కెర శాతం , పరీక్షకు ముందు కనీసం ఆరు వారాల సమయం లో మన రక్తం లో చెక్కెర ఏమాత్రం ఉందో తెలియ చేస్తుంది !
ఉదాహరణ కు :
పైన ఉన చిత్రం లో A 1C మీద ఉన్న చిత్రం చూడండి నార్మల్ అంటే ఆరోగ్య వంతుల రక్తం లో 5. 7 శాతం కన్నా తక్కువగా A 1c ఉంటుంది. అంటే పరీక్షకు ముందు ఆరు వారాల లో ఆ వ్యక్తి రక్తం లో , చెక్కెర శాతం నార్మల్ గానే ఉంది అని చెబుతుంది ఆ పరీక్ష. కానీ ప్రీ డయాబెటిస్ లో ఇదే పరీక్ష ఫలితం వేరుగా ఉండి , ( కాస్త ఎక్కువగా ఉండి ) 5.7 కీ 6. 5కీ మధ్య లో ఉంటుంది . ఇక డయాబెటిస్ పరిస్థితి ఉన్నపుడు ,ఈ చెక్కెర శాతం 6. 5 శాతం కానీ , అంత కన్నా ఎక్కువ గా కానీ ఉంటుంది.
2. రెండో పరీక్ష F P G : అంటే ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష : ఈ పరీక్ష చేయించుకునే వ్యక్తి పరీక్ష క్రితం రాత్రి నుంచి , అంటే పరీక్షకు ముందు కనీసం ఎనిమిది గంటలు , ఏమీ ఆహారం తినకూడదు , అట్లాగే పానీయాలు కూడా తీసుకోకూడదు , కేవలం దాహం అయినప్పుడు , మంచి నీరు తప్ప! ఈ పరీక్ష ఫలితాలు నార్మల్ వ్యక్తి లో వంద మిల్లీ గ్రాములు ఉంటుంది ప్రతి వంద మిల్లీ లీటర్ల ప్లాస్మాకూ , ( వంద మిల్లీ లీటర్లు అంటే ఒక లీటర్ లో పదో వంతు కదా ! ) అదే ప్రీ డయాబెటిస్ పరిస్థితిలో వంద – నూట ఇరవై ఆరు మిల్లీ గ్రాముల మధ్య ఉంటుంది. ఆ నూట ఇరవై ఆరు మిల్లీ గ్రాములు దాటిన పరిస్థితి డయాబెటిస్ అనబడుతుంది.
3. మూడో పరీక్ష : O G T T : సామాన్యం గా ఈ పరీక్షను F P G పరీక్ష తో కలుపుతారు . అంటే పరీక్ష చేయించుకునే వారు క్రితం రాత్రి లంఖణం తో ( అంటే ఏమీ తినకుండా , పానీయాలు తాగకుండా )
ఉదయం F P G పరీక్ష చేయించుకుని , ఆ తరువాత ఒక డెబ్బై అయిదు గ్రాముల చెక్కెర ఉన్న ద్రావణాన్ని తాగిన ముప్పై నిమిషాలు, అరవై నిమిషాల తరువాత రెండు సార్లు రక్త పరీక్ష చేయడం జరుగుతుంది.
ఈ పరీక్షలో ఫలితాలను ఎట్లా విశ్లేషించాలి ?
ఈ O G T T పరీక్షలో నార్మల్ వ్యక్తులకు రక్తం లో చెక్కెర నూట నలభై మిల్లీ గ్రాముల కన్నా తక్కువ ఉంటుంది. నూట నలభై నుంచి రెండు వందల మిల్లీ గ్రాముల మధ్య కనుక ఉంటే , ఆ పరిస్థితిని ప్రీ డయాబెటిస్ అని అంటారు. రెండు వందల మిల్లీ గ్రాముల కన్నా ఎక్కువ గా డయాబెటిస్ ఉన్నప్పుడు ఉంటుంది !
ఫాస్టింగ్ రక్త పరీక్షలో లంఖణం చేయకుండా చిరుతిండి ఏదైనా తిన్నాక పరీక్ష చేయించుకుంటే ఏమవుతుంది ?
ఏమీ కాదు కానీ ఆ పరీక్ష పేరును మార్చాల్సి ఉంటుంది. ఎందుకంటే అది ఫాస్టింగ్ పరీక్ష అనబడదు కదా !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
Informative