Our Health

పని సూత్రాలు. 36. వినదగు, ఎవ్వరు చెప్పిన !

In మానసికం, Our minds on మార్చి 30, 2013 at 11:52 ఉద.

పని సూత్రాలు. 36. వినదగు ఎవ్వరు చెప్పిన !

మీ ఉద్యోగం లో మీకు ఎవరు ఏమి చెప్పినా ముందు గా మీరు చేయవలసినది వినడం !  మీరు వారు చెప్పే విషయాలను ఓపిక గా వినాలి ! మనం సామాన్యం గా ఇంట్లో  మన పెద్ద వాళ్ళు తరచూ చెబుతూ ఉంటారు , ”  నేను చెప్పేది వింటున్నావా లేక చెవులప్పగించి చూస్తున్నావా ? ! ” అని అంటూ , ” అక్షింతలు ” వేస్తూ ఉండడం సామాన్యమే  కదా !   ! మన తెలుగులో ఈ వినడాన్ని కేవలం ఒక పదం తోనే, అంటే ” వినడం ” గానే  సంభో దిస్తాము కానీ , ఆంగ్లం లో రెండు పదాలు ఉన్నాయి ఈ వినికిడి జ్ఞానానికి ! హియరింగ్ ( hearing ) , అంటే కేవలం చెవులతో వినడం మాత్రమే ! కానీ  లిజనింగ్ ( listening  ) అంటే మాత్రం,  శ్రద్ధ గా ఆలకించడం !  అంటే, మనము చెవులతో వినక పొతే , ఇతరులు చెప్పే విషయాలు శ్రద్ధ గా ఆలకించ లేము !  ఈ విషయం కేవలం మాటలకే కాకుండా , మనం వినే శబ్దాలకు కూడా వర్తిస్తుంది ! అంటే వివిధ శబ్దాలు కూడా , మొదట గా మనం వినక పొతే , వాటిని శ్రద్ధ గా ఆలకించ  లేము ! కానీ మనం  చెవులతో విన్నా కూడా , చాలా సమయాలలో శ్రద్ధ గా ఆలకించం ! ప్రత్యేకించి ఇంటి ఇల్లాలు చెప్పే విషయాలు ! కానీ ఉద్యోగం లో అట్లా చేస్తే , ఉద్యోగం పోయే ప్రమాదం ఉంది కదా ! కేవలం ఉద్యోగానికి ఎసరే  కాకుండా, ఇతరులు చెప్పేది విని , ఆలకించడం   జీవితం లో ” పైకి ” పోదామనుకుని ఉత్సాహ పడే ప్రతి వారికీ ఉండవలసిన ముఖ్య లక్షణం !  
మరి ఆఫీసులో ఈ వినడం ఎట్లా చేయాలి ?: 
1. మీరు వింటున్నప్పుడు  ఓహో ! ఆహా, ఊహూ అంటూ మధ్య మధ్య  చెప్పే వారికి తెలియ చేస్తూ ఉండాలి , కేవలం కళ్ళూ , చెవులూ అప్పగించడమే కాకుండా ! 
2. మీ దేహ భాష కూడా అంటే బాడీ లాంగ్వేజ్ కూడా సరిగా ఉండాలి ! అంటే ఇతరులు చెప్పే మాటలు వింటున్నప్పుడు, తరచూ గోడ గడియారం ముళ్ళ వైపో , మీ వాచీ వైపో చూసుకుంటూ ఉండడం , ఇంకా  ఆవులించడం , లేదా  మీ బట్టలు సవరించు కుంటూ ఉండడం లాంటి పనుల లో ” నిమగ్నమవ ” కూడదు ! 
3. కొన్ని సమయాలలో ఇతరులు చెప్పే మాటల్లో ముఖ్యమైన పాయింట్స్ మీరు మళ్ళీ వారిని అడిగి నిశ్చయం చేసుకోవడం కూడా చేస్తూ ఉండాలి. ఉదా:  అంటే ఫలానా తారీఖున అనో , ఫలానా చోట అనో మీరు అడగడం చేస్తే , మీరు ఆ విషయం గుర్తుంచుకోడానికి కూడా ఉపయోగ పడుతుంది ! 
4. కొన్ని సార్లు , మీరు చెప్పే వారిని , వారు చెప్పిన మాటను మళ్ళీ చెప్పమని కూడా అడగవచ్చు ! మీకు ఆ విషయం స్పష్ట పడని సందర్భాలలో !
5. కొన్ని సార్లు , మీకు అర్ధం కాని విషయాలను  చెప్పే వారికి ప్రశ్నలు వేసి కూడా తెలుసుకోవచ్చు ! 
6. ఇంకో మంచి అలవాటు, మీరు ఒక నోట్ బుక్ లో సంగ్రహం గా చెప్పే వారి మాటలు మీకు గుర్తు ఉండే రీతి లో రాసుకోవచ్చు కూడా ! ఎందుకంటే , మీరు చాలా బిజీ అయే సమయాలలో కూడా , తరువాత  ఆ సంభాషణ వివరాలు మీకు అందుబాటు లో ఉంటాయి !
( ఆఫీసులలోనే కాకుండా , సరిగా విని ఆలకించడం విద్యార్ధులకు కూడా చాలా ఉపయోగ కరం !  చాలా మంది విద్యార్ధులు కేవలం వారి టీచర్లూ, లెక్చరర్ లూ చెప్పే పాఠాలు శ్రద్ధ గా విని  వారి భవిష్యత్తు లోనూ , వారి జీవితాలలో నూ  ఎంతో  ముందుకు పోయిన వారూ, పోతున్న వారూ అసంఖ్యాకం ! ) 
 
మీరు పైన చెప్పినవి ఎందుకు ఆచరించాలి ?:
మీరు సరిగా ఇతరులు చెప్పేది వినడం , ప్రత్యేకించి మీ ఉద్యోగం లో , మీకు అనేక విధాలు గా లాభ దాయకం.
1. మీకు ఆ చెప్పే విషయం మీద మంచి అవగాహనా , పట్టూ ఏర్పడతాయి !
2. తద్వారా, మీ కర్తవ్యం , అంటే మీరు చేయవలసినది మీకు స్పష్టమవుతుంది !
3. మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలు మీకు తెలుస్తాయి !
4. మీరు, ఇతరులు చెప్పేది , సహనం , సానుభూతి తో ఆలకిస్తారనే అభిప్రాయం , మీ కొలీగ్స్ కు ఏర్పడుతుంది !
5. మీరు  చురుకైన,  స్పురద్రూపి గా మీ సహచరులలో పేరు పొందుతారు ,  ఒక సోంబేరి గా , డల్ హెడ్ లా కాక !
6. మీరు చేసే పని , లేదా ఉద్యోగం లో మీరు చాలా శ్రద్ధ వహించి, ఇతరులు చెప్పేది కూడా సీరియస్ గా తీసుకుంటారని మిగతా వారు గమనిస్తారు !
 
వినడం ఒక నేర్పు. సాధనతోనే అది వస్తుంది. ఇతరులు చెప్పేది వినడం అలవాటు చేసుకోవడానికి , ఇంకో సులభమైన పధ్ధతి  మీరు  ఇతరులకు ఏదైనా చెబుతున్నపుడు , ఆ ఇతరులనుంచి ఏ రకమైన ప్రవర్తన  ఆశిస్తారో, అది ముందే ఊహించుకోవడం ! అప్పుడు సరిగా వినడం యొక్క ప్రాముఖ్యత తెలుసుకోగలం !  అందుకే , వినదగు ఎవ్వరు చెప్పిన ……. ( మరి ఇప్పుడు వీరిలో ,  ఇల్లాలిని తప్పకుండా చేర్చు కోవాలి మరి !! )
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: