పని సూత్రాలు. 30. ఉద్యోగం లో ఊక దంపుడు సంభాషణ !
మనం ఇంతవరకూ చాలా పని సూత్రాల గురించి తెలుసుకున్నాం కదా వివరం గా ! వీటన్నిటినీ , ప్రత్యేకం గా చదువు ముగించుకుని , ఉద్యోగాన్వేషణ మొదలు పెడుతున్న , లేదా కొత్తగా ఏ ఉద్యోగం లోనైనా చేరిన , నవ యువతీ యువకుల కోసం ఉద్దేశించి రాయడం జరుగుతూ ఉంది ! అంతే కాకుండా , ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న అనేక లక్షల మంది ఉద్యోగస్తుల కు కూడా వారి వారి పని నిపుణత ను , పని తీరునూ , ఇంకా ఇతర ఉద్యోగులతో , లేదా వారి పై అధికారులతో వారి సంబంధాలను పెంపొందించుకోవడం లో కూడా ఈ టపాలు ఉపయోగ పడతాయి ! వరుసగా వీటిని టపాలలో పోస్టు చేయడం ఎందుకంటే , ఉద్యోగం లో పాటించవలసిన సూత్రాలు అన్నీ కూడా ఒకే చోట లభ్యమవుతాయి కావాలనుకునే ( తెలుగు ) వారికి !
ఇప్పుడు మీరు చేసే ఉద్యోగాలలో ఊక దంపుడు సంభాషణల గురించి తెలుసుకుందాం !
ప్రతి మానవుడికీ , ఇతర మానవులతో సంబంధాలు , ప్రత్యేకించి కనీసం సంభాషణా పరమైన సంబంధాలు పెట్టుకుందాం అనుకోవడం సహజమే ! మానవ సంబంధాలకు సంభాషణ అతి ముఖ్యమైన వారధి ! మీరు చేసే ఉద్యోగం లో కూడా ఇతర ఉద్యోగులతోనూ , పై అధికారులతోనూ , మీరు నిరంతరం కనెక్ట్ అయి ఉండడం మీ ఉద్యోగాన్ని మీరు శ్రద్ధ గా చేస్తున్నట్టు తెలియచేయడమే కాకుండా , టీమ్ స్పిరిట్ కూడా ఉన్నతం గా ఉండడానికి తోడ్పడుతుంది ! కానీ మీరు మీ ఉద్యోగం లో, అనవసర ప్రసంగాలు , అంటే ఇతరులతో ఓక దంపుడు సంభాషణలు చేయకూడదు !
ఉదాహరణ : మీరు మీ ఆఫీసులో మీ కొలీగ్స్ అందరితోనూ స్నేహ పూర్వకం గా ఉంటున్నారు. మీ పురుష కొలీగ్ మీతో ” నీకు తెలుసా ? మాధవి కీ మన బాస్ కూ ఎంత చనువో ? నేను మన T A బిల్స్ సైన్ చేయించుకోడానికి బాస్ ఆఫీసు లోకి వెళ్లాను అప్పుడు మాధవి చీర కొంగు సవరిస్తున్నాడు మన బాస్ ! నేను లిఫ్ట్ లో కూడా గమనించాను, ఏమాత్రం సంకోచం లేకుండా మాధవి చేతి లో చేయి వేసి గుస గుస లాడుతున్నాడు బాస్ ! మాధవి జాతకం మారిపోయింది ! టైపిస్టు గా చేరిన మాధవి పర్సనల్ సెక్రెటరీ అయి కూర్చుంది ఆరు నెలలలోనే , ఇక మన నెత్తి మీద కూడా కూర్చుంటుంది !” అని చెబుతున్నాడు ! మీరు వింటున్నారు, అంత వరకూ పరవాలేదు ! ఎందుకంటే , మీ కొలీగ్ మీరు ” తన అంతరంగిక మిత్రులు , లేదా కొలీగ్ ” అనుకుని మీకు ఆ విషయాలు చెబుతున్నాడు ! మీకు ఆ విషయాలతో ఏమాత్రమూ సంబంధం లేదు ! అంతే కాక , మాధవి తో మీకు ఏవిధమైన సంబంధమూ లేదు ! మీ బాస్ తో మీకు అంతకన్నా సంబంధం లేదు , కేవలం మీ బాస్ గా తప్ప ! ఇట్లా ఇతర కొలీగ్స్గురించిన ఊకదంపుడు సంభాషణ మీరు చేసే ఉద్యోగానికి ఏ విధం గానూ ఉపయోగ పడదు ! పైగా మీరు నోరు జారి ఏ వ్యాఖ్యానమైనా చేయడానికైనా ,మీరు అక్కడ లేరుకదా ! మీరు ఆ సమయం లో చేయవలసినది నిశ్శబ్దం గా మీ కొలీగ్ చెప్పినది వినడం మాత్రమే ! ఎందుకంటే , మీ కొలీగ్ దృష్టిలో మీరు , ” ఇతరులకు ఏమీ చేర వేయరు ” అంటే మీతో అన్న విషయాలను ఇతరులకు చెప్పరు ” అతనికి మీపైన ఉన్న ఈ అభిప్రాయాన్ని మీరు వమ్ము చేయకూడదు ! అంటే మీకు అతనితో ఉన్న స్నేహానికి ఏమాత్రమూ భంగం కలిగించ కూడదు ! కానీ అదే సమయం లో మీరు ఏ రకమైన వ్యాఖ్యానాలూ చేయకూడదు !
మనం చూస్తూ ఉంటాము సామాన్యం గా , కొన్ని సమయాలలో మనం చెప్పే విషయాలు తీవ్రం గా ఉన్నప్పుడూ , ప్రత్యేకించి ఇంకొకరి గురించి నలుగురికి చెబుతున్నప్పుడు , మనం చెప్పే విషయం ఎంత సీరియస్ విషయమైనా , ఇతరుల తప్పు స్పష్టం గా కనబడుతున్నా కూడా , వినే వారిలో కొందరు ఏ విధమైన హావ భావాలూ ప్రదర్శించ కుండా , కేవలం మనం చెప్పేది విని , తప్పుకుంటారు ! మీరు కేవలం వినే వారిగానే ఉంటే మీ కొలీగ్స్ దృష్టిలో ” వారిలో ఒకరిగా ” అనుకుంటారు మిమ్మల్ని ! సారాంశం: మీ ఉద్యోగం లో మీరు ఊకదంపుడు సంభాషణలు చేయకండి ! మీ కొలీగ్స్ చేస్తుంటే కూడా మీరు కేవలం, మీ చెవులకే పని చెప్పండి, నోటికి విరామం ఇవ్వండి ! ముఖ్యం గా, మీరు ఆ ఊకదంపుడు సంభాషణ గురించి ఇతరులకు ఏమాత్రం తెలియ చేయకండి ! మీ తాత్కాలిక , ఇంకా శాశ్వత లక్ష్యాల మార్గం లో, ఊకదంపుడు సంభాషణలు కలుపు మొక్కలు !
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం !
డాక్టర్ గారు మేమంటే కాలక్షేపం కబుర్లలా రాసుకుంటాం, మీరూ ఇలా మాకు పోటీ వచ్చేస్తే ఎలా? 🙂
మంచి విషయం చెప్పేరు
శర్మ గారూ, మీరు సర్వజ్ఞులు , మీ” బ్లాగు ” జాడలలో నడిచే వాడినేనండీ , మీతో పోటీ కి రావడమేమిటండీ ?!!!