పని సూత్రాలు . 29. అవకాశాలు, బంతులు !

( పై చిత్రం లో చిరునవ్వులు , మెలీనా రమిరెజ్ అనే కొలంబియన్ కోమలి వి ! )
ఉద్యోగాలలో అవకాశాలు అరుదు గా వస్తుంటాయి ! అంటే మీరు చేస్తున్న ఉద్యోగం నుంచి పై ఉద్యోగానికీ లేదా ఇంకో సెక్షన్ లో ప్రమోషన్ కో తరచు గా రావు కదా అవకాశాలు ! మీకు ఉండ వలసిన దీర్ఘ కాలిక , ఇంకా తాత్కాలిక లక్ష్యాల గురించి మనం తెలుసుకున్నాం కదా వివరం గా క్రితం టపాలలో ! ఈ లక్ష్య మార్గాల మధ్య లో మనకు అకస్మాత్తుగా దర్శన మయే మంచి దారులే అవకాశాలు ! అంటే ఈ అవకాశాల రహదారిలో ప్రయాణం వేగం గా ఉండడమే కాకుండా సునాయాసం గా కూడా ఉంటుంది ! కాక పొతే , ఈ అవకాశాలు మనవైపు విసిరి వేయబడే రబ్బరు బంతులు ! ఈ బంతులు లిప్త కాలం లో మన వైపు విసిరి వేయ బడతాయి కనుక వాటిని మనం అతి చాక చక్యం గా పట్టుకోవాలి ! ఆ క్షణాలలో , మనకు ఎక్కువ తాత్సారం చేయడానికీ , మీన మేషాలు లెక్క పెడుతూ , తీసుకో బోయే నిర్ణయం బాగోగులు ఆలోచించ డానికి సమయం కూడా వృధా చేయ లేనంత తక్కువ సమయం ఉంటుంది. ఆ స్వల్ప సమయం లోనే మన వైపు వచ్చిన ఆ అవకాశాన్ని గట్టి గా పట్టుకోవాలి ! లేదా అవకాశాలు మన చేయి జారి పోతాయి !
అవకాశం ఎదురైనప్పుడు మీ కర్తవ్యం :
1. మీరు నేర్పుగా ఆ అవకాశాన్ని గుర్తించ గలగాలి
2. ఆ అవకాశాన్ని ఒడుపు గా పట్టుకోవాలి , అంటే వినియోగించుకోవాలి, మీ ప్రయోజనాల కోసం !
3. కూల్ గా, ఆత్మ విశ్వాసం తో ఉండాలి !
అవకాశం వచ్చినపుడు మీరు ఏమి చేయ కూడదు ? :
1. వచ్చిన అవకాశాన్ని , ఆ క్షణాల లో తీసుకోకుండా జార విడుచు కోవడం
2. విపరీతం గా కంగారు కూ , ఆందోళన కూ లోనవడం !
3. వచ్చిన అవకాశాన్ని ఆత్మ స్థైర్యం కోల్పోయి తీసుకోవడం , ఇట్లా చేయడం వల్ల ఆ అవకాశాన్ని చేతిలో తీసుకున్నాక కూడా , సరిగా పట్టుకో లేక జార విడుచుకోవడం !
పైన చెప్పిన పరిస్థితులను ఒక క్రికెట్ మాచ్ లో బౌండరీ దగ్గర గా ఉన్న ఫీల్డర్ కొన్ని సమయాలలో చేసే ఫీల్డింగ్ లా పోల్చ వచ్చు ! ఆ ఫీల్డర్ బౌండరీ దగ్గర ఎక్కువ శ్రమ పడకుండా , ప్రేక్షకుల తో పరాచకాలు ఆడుతూ , వారికి తన ఆటో గ్రాఫులు ఇస్తూ , ఒక హీరో లా పోజులు పెడుతూ ఉంటాడు సామాన్యం గా ! అతని దగ్గరికి క్రికెట్ బాల్ అప్రయత్నం గానే వస్తుంది ! అప్పుడు ఆ ఫీల్డర్ తన నైపుణ్యం తో పట్టుకోక పొతే , ఆ బాల్ జారిపోతుంది. ఒక వేళ ఆ ఆటగాడు ఏమరు పాటున ఉంటే, అంటే పూర్తి సంసిద్ధత గా ఉండక పొతే , చేతులలోకి వచ్చిన బాల్ కూడా జారిపోయి క్రింద పడి పోతుంది , అపుడు ప్రేక్షకుల తిట్లు భరించాల్సి ఉంటుంది ! వచ్చిన అవకాశాలు సరిగా మ్యానేజ్ చేయక పొతే కూడా అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది ! కాక పొతే ఇక్కడ ప్రేక్షకులకు బదులు మన మనసే మనలను వెక్కిరిస్తూ ఉంటుంది ! అవకాశాలను సద్వినియోగం ఎట్లా చేసుకోవాలో తెలుసుకోవడం ఒక కళ ! నేర్చుకుంటే అబ్బే నైపుణ్యం ! మీరు మీ జీవితాలలో గతం లో వచ్చిన అవకాశాలను ఏ విధం గా కోల్పోయారో , కారణాలు ఏమిటో , ఆత్మావలోకనం చేసుకోండి ! ఆ పరిస్థితులు మళ్ళీ ఎదురవుతే , మీరు ప్రస్తుతం ఏమి చేస్తారో కూడా ఊహించు కొండి ! మీ బంగారు భవితకు సోపానాల వంటి అవకాశాలను కౌగిలించుకోండి , మీ ప్రేయసి లా ! తృప్తీ , ఆనందం కూడా అదే విధం గా ఆస్వాదించండి !
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం !