పని సూత్రాలు . 22. చక్కగా రాయండి !
పని సూత్రాలలో ఇంకో ముఖ్య సూత్రం , చక్కని దస్తూరీ ! అంటే చేతి వ్రాత ! మామూలు గా మనం పని చేసే చోట చాలా ఫైళ్ళ మీదా , లేదా చాలా రికార్డు లలో నూ మన చేతి వ్రాత తో వివరాలు రాయడమూ , నిక్షిప్తం చేయడమూ చేస్తూ ఉంటాము ! చేతి వ్రాతను చాలా మంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు ! దీనికి కారణాలు అనేకం , ఆంగ్ల భాష లో రాయ వలసి వచ్చినపుడు , అది మన భాష కాదు కదా అందువల్ల , మొదటి నుండీ అశ్రద్ధ చేయడం జరుగుతుంది , రాత ఎట్లా ఏమౌతుంది కనుక అనే నిర్లిప్తత ఏర్పడుతుంది ఆది లోనే ! గురువులు చక్కగా నేర్పించక పోయినా కూడా చేతి రాత ను అశ్రద్ధ చేయడం జరుగుతుంది ! తెలుగు వ్రాతను కూడా అనేక కారణాల వల్ల అనేక మంది అశ్రద్ధ చేయడం జరుగుతుంది ! ఈ చేతి వ్రాత తో మీరు మీకోసం రాసుకునేట్టయితే , మీరు ఎట్లా రాసుకున్నా పరవాలేదు ! కానీ మీరు ఇతరుల కోసం కానీ మీ అవసరాలకు కాకుండా కానీ వ్రాయ వలసి వచ్చినపుడు , ప్రత్యేకించి , మీరు చేసే ఉద్యోగం లో , మీ వ్రాత సులభం గా చదివినపుడు అర్ధమయే లా ఉంటే , చాలా ఉత్తమం ! లేకపోతే కేవలం మీ చేతి వ్రాత మీ రాతనే మార్చివేయగల ప్రమాదం ఉంది ! మీ ఉద్యోగం లో మీరు ఎక్కడైనా వ్రాసే సమయం లో గుర్తు ఉంచుకోవలసిన ముఖ్య విషయాలు ఇవి:
1. మీరు ఏమి రాస్తున్నారు ? 2. మీ చేతి వ్రాత ఎట్లా ఉంది? , అనే విషయాల మీదే పని లేదా ఉద్యోగం లో మీ పురోగతి అవకాశాలు ఆధార పడి ఉంటాయి . ఎందుకంటే ,మీరు ఏమి రాస్తున్నారు అనే విషయం మీద మీ ఆలోచనా ధోరణి ఏమిటి , సమస్యా పరిష్కారాలలో మీ పాత్ర ఏమిటి అనేది నిర్ణయించ బడుతుంది ! అట్లాగే మీ వ్రాత ఎట్లా కనిపిస్తుందో కూడా ముఖ్యమే !
మరి మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ?
1. అర్ధమయే చేతి వ్రాత : మీరు ఎవరి దగ్గరికైనా వెళ్లి వారితో మీ మాత్రు భాష లో మాట్లాడండి. ఉదాహరణకు తెలుగు అనుకుంటే , మీ ఎదుటి వ్యక్తి కూడా తెలుగువాడై ఉన్నా , ఆయన మాట్లాడేది తెలుగు భాష అయినా , వారు మాట్లాడేది ఏదీ మీకు అర్ధం కాలేదనుకోండి ! అప్పుడు మీ పరిస్థితి ఎట్లా ఉంటుందో , మీ చేతి వ్రాత కూడా ఇతరులకు అర్ధం కాక పొతే అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది ! అందు వల్ల మీ చేతి వ్రాత ఎప్పుడూ మీకు మాత్రమె కాక , ఎవరికోసం అయితే వ్రాస్తున్నారో వారికి అర్ధం కావాలి , లేక పొతే అది వ్రాత అనిపించుకోదు కదా !
2. శుభ్రమైన వ్రాత : మీరు వ్రాసే రాత ఎక్కడ రాసినా , తప్పులు లేకుండా , కనీసం ఎక్కువ తప్పులు లేకుండా , కొట్టి వేతలూ , అవీ లేకుండా శుభ్రం గా ఉంటే ,చదివే వారికి అనుకూలం గా ఉండడం మాత్రమె కాకుండా , మీ పని శుభ్రత కూడా వారికి కనిపిస్తుంది !
3. మీ ప్రత్యేకమైన దస్తూరీ అయి ఉండాలి : అంటే మీ చేతి వ్రాత మీదైన శైలి తో స్టైలిష్ గా ఉండాలి !
4. పరిణితి చెంది ఉండాలి మీ చేతి వ్రాత ! అంటే మీ రాత చిన్న పిల్లల చేతి వ్రాత లా ఉండ కూడదు అట్లా ఉంటే, మీరు సరిగా రాయడం నేర్చుకోనట్టే కదా !
5. వ్రాత స్థిరత ఉండాలి : అంటే మీరు రాసే రాత పేజీ మొదటి లైను లో ఎట్లా ఉందో , ఆ పేజీ లో ఆఖరి లైను లో కూడా అట్లాగే ఉండాలి, మారి పోతూ ఉండకుండా ! చక్కగా వ్రాయడం నేర్చుకుంటే , మీరు టైపు చేసే సమయం లో కూడా అదే అలవాటు కొనసాగుతుంది !
ఒక సంఘటన : మరణ శిక్ష వేయబడిన ఒక ఖైదీ కి ఆఖరి నిమిషం లో క్షమా భిక్ష ప్రసాదించ బడింది. అప్పుడు మరణ శిక్ష అమలు చేసే పోలీసు కు ఒక టెలిగ్రాం వచ్చింది , ఆ టెలిగ్రామ్ లో ” Hang him,not stop ” అని ఉంటే , ఆ మరణ శిక్ష అమలు చేయ బడింది. కానీ తరువాత తెలిసింది , ఆ టెలిగ్రాం తప్పుగా టైపు చేయబడిందని , అసలు టైపు చేయ వలసినది ” Hang him not. stop ” అని ! కానీ ఆ తప్పు గమనించే లోగా ఒక ప్రాణం అనంత వాయువులలో కలిసిపోయింది !
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం !
డాక్టర్ మాస్టారు బాగా చెప్పేరు. ఎంతమంది వింటారో చూదాం.