పని సూత్రాలు. 11. వేష ధారణ ముఖ్యం !
పని సూత్రాలలో రెండవ అధ్యాయం. మిమ్మల్ని మీరు పని చేసున్నంత కాలమూ , అంటే మీరు మీ ఉద్యోగం చేస్తున్నంత కాలమూ , అంచనా వేస్తూ ఉంటారనే విషయం మర్చి పోకూడదు ! యు అర్ బీయింగ్ జడ్జ్ డ్ ఎట్ ఆల్ టైమ్స్ ! మిమ్మల్ని అంచనా వేస్తున్న వారు, తమ తమ అభిప్రాయాలను ఏర్పరుచుకుంటూ ఉంటారు మీ మీద ! ఆ అభిప్రాయాలు సదభిప్రాయాలు గా ఏర్పడడానికి , మీరు మీ వంతు ప్రయత్నం చేయాలి ! ఇతరులు మనలను పరిశీలించడానికీ,మన మీద తమ తమ అభిప్రాయాలను ఏర్పరుచుకోడానికీ , మన అనుమతి ఏమీ అవసరం లేదు కదా ! కానీ మన వేష ధారణా , భాష తీరు , ఇంకా ప్రవర్తనా , ఇట్లాంటి లక్షణాలు మనం అశ్రద్ధ చేయకుండా , మనదైన తీరు ను ఎప్పుడూ ప్రదర్శిస్తూ ఉంటే , మన మీద ఏర్పడే అభిప్రాయం, ఉన్నతం గా ఉంటుంది.
అందుకే ఈ ప్రక్రియ లో మొదటి సూత్రం మీ వేష ధారణ. మీరు మీ ఆఫీసుకు కానీ వర్క్ ప్లేస్ కు గానీ వెళుతున్నప్పుడు మీ వస్త్రాలను అశ్రద్ధ చేయకూడదు. అతిగా డ్రస్ చేసుకోకూడదు. అట్లాగే మరీ కక్కుర్తి గానూ మీ వేష ధారణ ఉండ కూడదు ! మీరు ధరించే బట్టలలో, మీ మీద మీకు ఉన్న శ్రద్ధ కనిపించాలి ! మనం ఇతరులను చూడగానే ప్ర ప్రధమం గా వారి వేష ధారణ పరిశీలిస్తాము ! ఒక పురుషుడు ఆఫీసుకు , మల్లె పూల లాంటి తెల్లటి బట్టలు వేసుకుని వస్తే , ” పూల రంగడు ” లా ఉన్నాడు ! అనుకుంటాము ! అదే ఒక స్త్రీ తెల్లటి సల్వార్ కమీజ్ వేసుకుని , తన పొడవాటి శిరోజాల లో ఉయ్యాల లూగుతూ , ఘుమ ఘుమ లాడుతూ ఉన్న మల్లె చెండు తో ఆఫీసు కు వస్తే ! !! లేదా ఇంకో రోజు తెల్లటి చీర , తెల్లటి రవిక లో ఆఫీసు కు వస్తే ! ? ! ? ఆఫీసులో ఫైళ్ళు అసలు కదలవు ! అందరి కళ్ళూ ( ప్రత్యేకించి పురుషుల కళ్ళు ! ) టెలిస్కోపు లలా ముఖం నుంచి ముందుకు వస్తాయి !
జయదేవ్ కార్టూన్ అనుకుంటా చాలా కాలం క్రితం చూసినా ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టుగా నా కు గుర్తు ఉంది ! ఒక వనిత, ఉల్లి పాయ పొర లాంటి పలుచని చీర, నాభి క్రిందకు కట్టుకుని, తన పాలిండ్లను ఒక పారదర్శకమైన ! పమిట ” చాటున దాచి ” అలవోక గా నడుస్తూ వెళుతూ ఉంటుంది. ఆసమయం లో , అక్కడ ఉన్న ఒక పురుషుడు , ఇంకో పురుషుడి తో అంటూ ఉంటాడు, ” ఈమె మా ఆఫీసు లో పని చేస్తుంది , ఛస్తే ఒళ్ళు దాచుకోదు ” అని !
ఈ వస్త్ర ధారణ ను జెనరలైజ్ చేయడం కష్టం ! ఉష్ణ దేశాలలో , వస్త్ర ధారణ, టై లూ గై లూ లేకుండా ఉంటే హాయిగా ఉంటుంది. అట్లాగే శీతల దేశాలలో టై కట్టు కోకుండా పురుషులు ఆఫీసుకు వెళ్తే , మిగతా వారి దృష్టి లో కొంత తేలిక భావం ఉంటుంది వారి మీద ! ట్రైనర్స్ , జీన్స్ వేసుకుని ఆఫీసు కు వెళ్ళడం, లేదా హవాయి చెప్పులు వేసుకుని ఆఫీసు కు వెళ్ళడం కూడా ఇతరులకు మీ మీద ఉండే అభిప్రాయాన్ని మార్చేస్తుంది,నెగెటివ్ గా ! చాలా మంది తాము పని చేసే స్థలాలలో చక్కటి గాలీ, వెలుతురూ లేక పోయినా , సింథ టిక్ వస్త్రాలను తరచూ ధరిస్తారు ! పైకి మడతలు పడనట్టు కనిపించినా, ఆ రకమైన వస్త్రాలు , విపరీతం గా స్వేదం కలుగచెస్తాయి. చక్కటి నూలు వస్త్రాలలా, స్వేదాన్ని అంటే చెమటను పీల్చలేవు ! దానితో చాలా అనర్ధాలు ఉన్నాయి ! ఎందుకంటే, అవి వేసుకున్న వారికే మగ్గి పోయినట్టు ఉక్క పెట్టడమే కాకుండా , మిగతా వారు కూడా వారి దగ్గరకు రావడానికి జంకుతారు ! ఆ పరిస్థితి లో ఒక సమస్య మీద దృష్టి కేంద్రీకరించి, పరిష్కారం కనుక్కోవడం, సులభమో
కష్టమో , ఆ వస్త్ర ధారణ చేసుకునే వారికే ఎరుక !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !