అప్పు తో మనశ్శాంతి కి ముప్పు !
అప్పు గొని సేయు విభవము …….. దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ ! అన్నాడు సుమతీ శతక కారుడు !
ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడికీ అప్పు గురించి తెలియదు అంటే నమ్మ లేము ! ఎప్పటికప్పుడు అవకాశం చిక్కినప్పుడల్లా , అప్పు చేసి , కనీస అవసరాలు తీర్చు కునే వారు కొందరైతే , అత్యాశకు పోయి , ఆడంబరాలకు , వ్యసనాలకూ కూడా అప్పులు చేసి బేజారు చెందే వారు కొందరు. తీర్చలేక బజారు న పడే వారు కొందరు ! ఈ అప్పుకు , లింగ భేదం , వయసు , కులం , జాతి , మతం తో సంబంధం లేదు ! ఎవరినైనా ఇట్టే పట్టేస్తుంది , జలగ లాగా ! కొందరు తీసుకున్న అప్పును మర్చిపోతారు ! మరి కొందరు , తీర్చ వలసిన అప్పు గురించి ఆలోచిస్తూ , ఆందోళన పడుతుంటారు ! ఇంకా అమాయకులు , తమ సంతానాన్ని వెట్టి చాకిరికి గురి చేస్తారు ! ఈ అప్పు తీర్చడం కోసం ! , అనేక గ్రామాలలో , ఇంకా ఇట్లా జరుగుతూ ఉండనే విషయం సత్య దూరం కాదు ! అప్పు కూ , ఆమాట కొస్తే , మానవ జీవన శైలికీ , అతడి ఆర్ధిక స్థితి కీ విడదీయ రాని సంబంధం ఉంది.
కొన్ని దశాబ్దాల క్రితం అమెరికా చంద్రుడి మీదకు ” అపోలో ” ను పంపినపుడు , ఒక తెలుగు కార్టూనిస్టు, అమెరికనులు ” అపోలో ” అపోలో ” అంటూ ఉంటే , మన ( భారతీయులు ) అప్పులో , అప్పులో అంటూ ఉన్నట్టు గీశాడు ! ప్రస్తుతం , భారత దేశ ఆర్ధిక స్థితి కొంత మెరుగైనా కూడా , చాలా మంది ప్రజలు ఇంకా దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారని అనేక తాజా పరిశీలనలు తెలుపుతూ ఉన్న్నాయి కూడా !
ఈ అప్పు మానవులకు చేసే కీడు అంతా ,ఇంతా కాదు.! మనం రోజూ చూస్తూ ఉంటాము వివిధ వార్తా పత్రికలలో , అప్పు తీర్చలేక ( ఒక్కో సమయం లో కుటుంబం తో సహా ) ఆత్మహత్య లు చేసుకుంటున్న వారిని. వేలకొద్దీ మరణిస్తున్న రైతులు , పంట చేతికి రాక , చేసిన అప్పులు తీర్చ లేక చేసుకునేవి ఆత్మ హత్యలే ! అంత తీవ్రం గా కాక పోయినా , లక్షలాది ప్రజలకు మనశ్శాంతి దూరం చేస్తుంది , ఈ అప్పు !
మరి ఈ అప్పు గాడి సంగతి మనం శాస్త్రీయ కోణం లో చూడ చూడడానికి ప్రయత్నిద్దాం ! వాడికి దూరం గా ఉండే మార్గాలున్నాయేమో కూడా తెలుసుకుందాం, వచ్చే టపా నుంచి !
ఇతి అప్పోపాఖ్యనః ప్రారంభః 🙂