B12 లోపానికీ అనీమియా ( రక్త హీనత ) కీ సంబంధం ఉందా?
క్రితం టపాలో మనం తెలుసుకున్నాం కదా కడుపులో మంట కు మనం వాడే మందులు దీర్ఘకాలం గా వాడడం జరిగితే , అది B 12 విటమిన్ లోపానికి కారణభూతం ఎట్లా అవుతుందో !
ఇప్పుడు అదే విటమిన్ B 12 విటమిన్ లోపం రక్త హీనత లేదా అనీమియా కు ఎట్లా కారణ భూతం అవుతుందో తెలుసుకుందాం !
రక్త హీనత అంటే రక్తం పలచ బడడం ! అంటే మనకు సామాన్యం గా ఉండే రమారమి అయిదు లీటర్ల రక్తం అట్లాగే ఉంటుంది అంటే పరిమాణం అంతే ఉంటుంది కానీ, చిక్కగా ఉండక , పలచ బడుతుంది. అంటే రక్తం లో ఉండే ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గుతుంది దానితో రక్తం ఎరుపు చిక్కటి ఎరుపు కాక, పాలి పోయిన , పలచని ఎరుపు గా అవుతుంది. రక్తం రంగుతో మనకు సంబంధం ఏమిటి ఎర్రగానే ఉంటుంది కదా , చిక్కగా ఉన్నా , పలుచగా ఉన్నా అని మీరు అనుకోవచ్చు. కానీ పలుచగా ఉన్నప్పుడు , రక్తం లో ఉండే ఎర్ర కణాలు , అవే ఎర్ర రక్త కణాలు ( R B C లేదా రెడ్ బ్లడ్ సెల్స్ అంటారు ) మన దేహం లో ప్రతి కణానికీ ప్రాణ వాయువు సరిపడినంత సరఫరా చేయలేవు. దానితో రక్త హీనత ఉన్న వారు , ఉసూరు మంటూ , బలహీనం గా ఉంటారు , ఏ పనీ చురుకు గా చేయలేరు. కొద్ది సేపటిలోనే అలసట వస్తుంది. ఆయాసం వస్తుంది, అట్లాగే ఎక్కువ సమయం పని చేయడం కానీ , మెట్లు ఎక్కడం గానీ , నడవడం కానీ చేసినప్పుడు !
ఈ కధంతా ఎందుకంటే , రక్త కణాల తయారీ కీ ఇనుము ( ఖనిజం ) తో పాటుగా B 12 విటమిన్ ఇంకా ఫోలిక్ యాసిడ్ విటమిన్ మనకు తప్పని సరిగా కావాలి , వీటి లో ఏవి లోపించినా , మనకు రక్త హీనత లేదా అనీమియా కలుగుతుంది. ఇప్పుడు తెలిసింది కదా B 12 లోపానికీ , రక్త హీనత కూ సంబంధం ఎట్లా ఉందో !
( పైన ఉన్న చిత్రం లో మీకు ఎడమ వైపు ఉన్నది మామూలు రక్త కణాలు ( మైక్రోస్కోప్ లో ఇట్లా కనిపిస్తాయి ) కుడి వైపున B 12 లోపం ఉన్నప్పుడు పెద్దగా పలుచ గా కనిపిస్తాయి.)
కడుపులో మంటకు వేసుకునే మందుల తో పాటుగా ఈ క్రింద చెప్పిన మిగతా మందులు కూడా మన జీర్ణ కోశం లో నుంచి B 12 విటమిన్, మన రక్తం లో కలవకుండా నివారించి , తద్వారా , B 12 విటమిన్ లోపమూ , రక్త హీనతా కలిగిస్తాయి !
1. మద్యం లేదా ఆల్కహాలు : ఎక్కువ మోతాదు లో మద్యం మన జీర్ణ కోశం లో ఎక్కువ సమయం కనక ఉంటే , ఆ పరిస్థితి , ఆహారం ద్వారా మనం తినే B 12 విటమిన్ ను కడుపు లో నుంచి రక్తం లోకి ప్రవేశించడం చాలా వరకు తగ్గి పోయి , B 12 విటమిన్ లోపం కలుగుతుంది.
2. నికోటిన్ : ఈ నికోటిన్ ఏ రూపం లో ఉన్నా అంటే పొగాకు రూపం లో గానీ , పాన్ సుపారీ లరూపం లో ( అంటే జర్దా గా ) కానీ ఉండ వచ్చు. చేసే ” ఘన కార్యం ” మాత్రం ఒకటే ! శరీరాన్ని అనారోగ్యం పాలు చేయడం !
3. మెట్ ఫార్మిన్ : ఈ టాబ్లెట్ ను మధుమేహం ఉన్న వారు చాలా క్రమం గా తీసుకుంటూ ఉంటారు. ఈ టాబ్లెట్ కూడా B 12 లోపం కలిగిస్తుంది.
4. కొన్ని రకాల యాంటీ బయాటిక్స్ కూడా ఈ B 12 విటమిన్ లోపం కలిగిస్తాయి.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !