Vitamin B3 లేదా నియాసిన్ :
నియాసిన్ విటమిన్ కూడా B విటమిన్ లకు చెందిన విటమినే ! దీనిని B 3 విటమిన్ అని కూడా అంటారు.
నియాసిన్ లేకపోతే మనకు అనారోగ్యమా?:
నియాసిన్ కూడా మిగతా విటమిన్లలాగానే మన శరీరం లో లోపిస్తే , అనేక లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు అన్నీ , నియాసిన్ విటమిన్ లోపం ఎక్కువ అవుతున్న కొద్దీ , మనలో కనిపించడం మొదలవుతుంది. గమనించ వలసినదేమిటంటే , ఏ విటమిన్ లోపించినా , ఆ లోప లక్షణాలు వెంటనే కనిపించవు మనకు. దీనికి కారణం ఏమిటంటే , మన దేహం లో లివర్ ( కాలేయం ) , కిడ్నీస్ ( మూత్ర పిండాలు ) వీటిలో మనం పూర్వం తిన్న ఆహారం లో ఎక్కువ గా ఉన్న విటమిన్లు నిలువ అవుతాయి. మన ఆహారం లో తరువాత ఈ విటమిన్లు లోపించినప్పుడు , లివర్ , కిడ్నీస్ లో ఉన్న విటమిన్లు మనకు ఉపయోగ పడతాయి. కానీ కొన్ని రోజుల తర్వువాత , ఈ నిలువ ఉన్న విటమిన్లు కూడా అయి పోయి , మనలో ఆ యా విటమిన్ల లోపం కనిపిస్తుంది , వివిధ ( వ్యాధి ) లక్షణాలు గా !
మరి మన శరీరం లో ఉన్నప్పుడు నియాసిన్ ఏ ఏ పనులు చేస్తుంది? :
NAD + NADH , NADP + NADPH అనే జీవ రసాయనాలు మన దేహం లో నిర్మాణం అవడానికి నియాసిన్ కావాలి. ఈ నిర్మాణాలు , మన శరీరం లో అనేక కణాలలో అను నిత్యం , అనేక జీవ రసాయన క్రియలను నిర్వర్తించుతూ ఉంటాయి. నియాసిన్ లోపం కనుక ఉంటే , ఈ అతి ముఖ్యమైన జీవ రసాయన క్రియలు కుంటు పడడమూ , లేదా ఆగిపోవడమూ జరిగి , మనలో వ్యాధి లక్షణాలు గా కనిపిస్తుంది.జన్యు పదార్ధం అంటే డీ ఎన్ ఏ లో అవసరమయిన రిపేరు అంటే జన్యు నిర్మాణం లో జరిగే అవక తవకలు సరిచేయడం లో కూడా ఈ నియాసిన్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. హార్మోనుల తయారీ: నియాసిన్ మన దేహం లో మూత్రపిండాల మీద ఉండే ఎడ్రినల్ గ్రంధులలో మనకు అవసరమైన స్టీరాయిడ్ హార్మోనులను తయారు చేయడానికి , చాలా ముఖ్యం.
మరి ఈ నియాసిన్ లోప లక్షాలు ఏమిటి ?: మనలో నియాసిన్ లోపం ఎక్కువ గా ఉంటే పెల్లాగ్రా అనే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.
పెలాగ్రా లో ముఖ్యం గా విరేచనాలు తరచుగా అవుతుండ డమూ , చర్మం పగుళ్ళు వచ్చి దురదలు పెట్టడమూ , చర్మం మొద్దు బారడమూ ,మంచి రంగులో మెరిసి పోయేట్టు ఉన్న చర్మం కాస్తా కాంతి విహీనమూ, ముదురు రంగులోకి మారడమూ , మతి మరుపు ఎక్కువ గా అయి డిమెంషియా అనే మతి మరుపు వ్యాధి రావడమూ , ఇంకా అశ్రద్ధ చేస్తే , మరణం కూడా సంభవించడం కూడా జరుగుతుంది.
నియాసిన్ ఏ ఆహార పదార్ధాలలో ఎక్కువ గా ఉంటుంది?: ( పైన ఉన్న చిత్రం చూడండి )
శాక హారులు నియాసిన్ పుష్కలం గా ఉన్న బ్రాకోలీ ( కాలీ ఫ్లవర్ లా గానే ఉంటుంది కానీ ఆకుపచ్చ రంగులో ఉంటుంది ) , కారట్ , ఆకు పచ్చని ఆకు కూరలు , చిలగడ దుంపలు , ఆస్పరాగస్ , టమాటాలు , ఖర్జూరాలు , పప్పు ధాన్యాలు , పుట్ట గొడుగులు తినవచ్చు.
మాంసాహారులు: చికెన్ , చేపలు , మొదలైన మాంస పదార్ధాలలో నియాసిన్ పొందవచ్చు . కోడి గ్రుడ్డు కూడా నియాసిన్ ఉన్న ఆహార పదార్దమే ! మిగతా విటమిన్లలాగానే నియాసిన్ కూడా మనకు చాలా స్వల్ప పరిమాణం లో నే రోజూ అవసరం ఉంటుంది ! అంటే 14 నుంచి 16 మిల్లీ గ్రాములు మాత్రమె మనకు రోజూ అవసరం ! నియాసిన్ ఎక్కువ గా తింటే కూడా ఆరోగ్యానికి మంచిది కాదు ! అంటే ” అతి విటమిన్ అనారోగ్య లక్షణం ” !
వచ్చే టపాలో ఇంకో విటమిన్ గురించి !
Informative