( విటమిన్ B 1 ) థయమిన్ మనలో తక్కువవుతే పరవాలేదా ? !!!
( విటమిన్ B 1 ) విటమిన్ ను ‘ థయమిన్ ‘ అని కూడా అంటారు. ఈ థయమిన్ B విటమిన్ లలో మొదటిది. ‘థయ’ అంటే గంధకం. ఈ గంధకపు అణువు కలిగి ఉన్న విటమిన్ కాబట్టి దీనికి థయమిన్ అని పేరు వచ్చింది. ఈ థయమిన్ లేదా B1 విటమిన్ కేవలం బాక్టీరియా లూ , ఫంగస్ లూ ( శిలీంధ్రాలు అని కూడా అంటారు అంటే పుట్టగొడుగుల జాతి కి చెందినవి ) ఇంకా మొక్కలు మాత్రమే ఈ థయమిన్ విటమిన్ ను తయారు చేయ గలవు. కానీ మానవులకు ( జంతువులకు కూడా ) ఈ B 1 విటమిన్ లేదా థయమిన్ చాలా ముఖ్యం.
ఈ థయమిన్ లోపం మనలో ఎట్లా కనిపించ వచ్చు ?:
మనం తీసుకునే ఆహారం లో థయమిన్ లోపం ఏదో రూపం లో ఉంటే ఆ లోప లక్షణాలు మనలో కనిపిస్తాయి.
మన దేహం లో అనేక అవయవాలు సరిగా పనిచేయడానికి ఈ థయమిన్ చాలా కీలకమైనది. కానీ మన నాడీ వ్యవస్థ లో ఈ విటమిన్ లోపం చాలా త్వరగానూ , ప్రస్ఫుటం గానూ కనిపిస్తుంది. ఎందుచేతనంటే , మన నాడీ మండలం లో అంటే ప్రతి నాడీ కణం లోనూ అనునిత్యం అంటే మన జీవితాంతం నిరంతరం గా జరిగే జీవ రసాయన చర్యలకు , ఈ థయమిన్ అవసరం తప్పని సరిగా ఉంటుంది.మిగతా అన్ని విటమిన్ల లానే కేవలం కొన్ని మిల్లీ గ్రాములలోనే ఈ విటమిన్ కూడా మనకు అవసరం అవుతుంది రోజూ ! కానీ ఆ కొన్ని మిల్లీ గ్రాములు కూడా లోపిస్తే , అదే మన ప్రాణాల మీదకు తెస్తుంది.
మన నాడీ మండలం లో థయమిన్ లోపం ఏ లక్షణాలు చూపిస్తుంది ?:
కళ్ళు: ముఖ్యం గా కళ్ళు బైర్లు కమ్మడం , రంగులు సరిగా గుర్తించ లేక పోవడం , మొదటి దశలలో జరుగుతాయి. తరువాత , తరువాత , థయమిన్ లోపం సరిచేయక పొతే , రెండు కళ్ళ చూపూ మందగించి , విటమిన్ లోపం తీవ్రం గా ఉంటే అంధత్వం కూడా రావచ్చు. ఇట్లా అంధత్వం రావడం ‘ ఆప్టిక్ అట్రోఫీ ‘ అనబడుతుంది. అంటే కంటి లోపలి సున్నితమైన పొరలు పాడవుతాయి.
పెరిఫెరల్ న్యూ రోపతీ అంటే ఏమిటి ?: మన దేహం లో మెదడులో కాక , అవయవాల చివరల గా ఉన్న నాడులలో తిమ్మిరులూ , మంటలూ పుట్టిస్తుంది ఈ విటమిన్ లోపం. ఎందుకంటే ఈ విటమిన్ లోపం వల్ల ఆయా నాడులు సరిగా పని చేయక మంటలు పుట్టడం , తిమ్మిరులు కలగటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యం గా శాక హారులలో , వయో వృద్ధులలో , ఈ లక్షణాలు తరచూ కనిపిస్తూ ఉంటాయి. మీరు గమనించారో లేదో , మన పెద్ద వాళ్ళు , కాళ్ళు మంటలు పుడుతున్నాయని వారికి నచ్చిన నువ్వులనూనో , కొబ్బరి నూనో బాగా కాళ్ళకు పట్టించి మర్దనా అంటే మాసాజ్ చేసుకుంటూ ఉంటారు. అది కేవలం వృధా ప్రయాసే ! ఎందుకంటే వారి లక్షణాలకు కారణం విటమిన్ లోపం కదా !
మన గుండె లో థయమిన్ లోపం ఏ లక్షణాలు చూపుతుంది?:
ఈ విటమిన్ లోపం అధికం గా ఉంటె, వారి గుండె కూడా ” వాచి ” పోతుంది. అంటే గుండె సామాన్యం గా ఉండే సైజు కన్నా పెద్దగా అవుతుంది. కానీ ఇట్లా పెద్దగా అవడం, ఆరోగ్య కరం గా కాక విటమిన్ B 1 లేక థయమిన్ లోపం వల్ల కలిగే ” అనారోగ్య వాపు ‘ దీనినే ” కార్డియో మెగాలీ ” అంటారు. అంతే కాక గుండె నీరసం గా కొట్టుకుని , కాళ్ళ వాపు రావడం జరుగుతుంది. అంటే కాళ్ళలో నీరు చేరుతుంది.
వచ్చే టపాలో మరి మనం రోజూ బాగానే తింటున్నా కూడా కొన్ని పరిస్థితులలో విటమిన్ B 1 లోపం ఎందుకు , ఏ యే పరిస్థితులలో జరుగుతుందో కూడా తెలుసుకుందాం !
Interesting