తాత్కాలిక పక్ష వాతం.8. మరి చికిత్స ఏమిటి ? :
ప్రశ్న: తాత్కాలిక పక్ష వాతం లేదా మినీ స్ట్రోక్ ఒక సారి వస్తే , చికిత్స ఏమిటి?:
జవాబు: తాత్కాలిక పక్ష వాతం లక్షణాలు ఒక సారి కనిపించ గానే, ముందుగా చేయవలసినది స్పెషలిస్టు డాక్టర్ ద్వారా అవసరమైన పరీక్షలు అన్నీ , అశ్రద్ధ చేయకుండా చేయించు కోవాలి. ఎందుకంటే , నివారణ చర్యలు తీసుకోక పొతే , మళ్ళీ మినీ స్ట్రోకు రావడానికీ , లేదా శాశ్వత పక్ష వాతం రావడానికి కూడా అవకాశాలు హెచ్చు. మరి చికిత్సా పద్ధతులు ఏమిటో చూద్దాము. ఇక్కడ మనం తెలుసుకోవలసినది మందుల ద్వారా చికిత్స ఏమిటో అంటే టాబ్లెట్స్ ఏ విధం గా పక్ష వాత నివారణకు ఉపయోగ పడతాయో తెలుసు కుంటే క్రమం తప్పకుండా , రోజూ ఆ టాబ్లెట్స్ ఎందుకు వేసుకోవాలో అవగాహన అవుతుంది.
యాంటీ ప్లేట్లెట్స్ మందులు : మన రక్తం లో ఉండే అనేక కణాలు వివిధ పనులు చేస్తూ ఉంటాయి ఉదాహరణకు ఎర్ర రక్త కణాలు మనం పీల్చే గాలిలో ఉన్న ప్రాణ వాయువు ను అంటే ఆక్సిజెన్ ను మోసుకుపోయి మన శరీరం లో ప్రతి భాగానికీ చేరవేస్తాయి.అట్లాగే రక్తం గడ్డ కట్టడానికి ప్లేట్ లెట్స్ అనే కణాలు ఉన్నాయి రక్తం లో. వాటికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే , ఆ కణాలు చిన్న చిన్న ప్లేట్ ల లాగా ఉంటాయి కనుక. సరే ఇప్పుడు ఆ కణాల సంగతి ఇప్పుడు ఎందుకంటే , తాత్కాలిక పక్ష వాతం వచ్చినపుడు కానీ , శాశ్వత పక్ష వాతం వచ్చినప్పుడు కానీ , మెదడు లో రక్త నాళాల లో రక్తం గడ్డ కడుతుంది. మనకు తెలుసుకదా రక్తం గడ్డ కడితే , ఆ ప్రాంతం అంతా పని చేయ కుండా పోతుంది అని. దానికి నివారణ రక్తం గడ్డ కట్టకుండా చూడడమే ! ప్లేట్ లేట్ లను కనుక రక్తం గడ్డ కట్టించే పనిని చేయకుండా నివారించడానికే మనం మందులు తీసుకోవాలి. ఆ మందులే యాస్పిరిన్ ( aspirin ) ఇంకా డై పిరడమాల్ ( dipyridamol ). ఈ రెండూ ( సామాన్యం గా ఏదో ఒకటి వేసుకోవాలి ) చాలా ముఖ్యమైన టాబ్లెట్స్.
( పైన ఉన్న చిత్రం చూడండి ) వీటిని క్రమం తప్పకుండా వేసుకుంటే , తాత్కాలిక పక్ష వాతమే కాకుండా , శాశ్వత పక్ష వాతాన్ని కూడా నివారించు కోవచ్చు.అనేక పరిశోధనల వల్ల ఇరవై అయిదు శాతం వీటిని తగ్గించుకోవచ్చు అని తెలిసింది. అంతే కాక ఈ టాబ్లెట్స్ గుండె పోటును అంటే హార్ట్ ఎటాక్ ను కూడా తగ్గిస్తాయని తెలిసింది. క్లోపి డోగ్రెల్
( clopidogrel )ఇంకా వార్ఫారిన్ ( warfarin ) అనే మందులు కూడా ఇంచు మించు ఇట్లాగే పని చేసి పక్ష వాతాన్ని నివారిస్తాయి. కొన్ని పరిస్థితులలో, మెదడుకు సరఫరా చేసే రక్త ధమనులు రెండు మెడలో ఉంటాయి. వీటిని కేరాటిడ్ ధమనులు అంటారు, వీటిలో పేరుకున్న కొవ్వు ను కూడా ఆపరేషన్ ద్వారా తీసి వేసి పక్ష వాతాన్ని నివారించ వచ్చు.
ఇప్పుడు మనకందరికీ స్పష్టం గా అవగాహన అయింది కదా , పక్ష వాత నివారణకు మందులు క్రమం తప్పకుండా వేసుకుంటే ఎంత గా ఉపయోగ పడతాయో !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !