ప్ర.జ.లు. 2 . పక్ష వాతం నివారణ మానవ సాధ్యమేనా ? అంతా దైవాదీనమా ?.
ప్రశ్న : క్రితం టపాలో పక్ష వాతం సూచనలు తెలుసుకున్నాము కదా ! మరి పక్ష వాతం నివారణ కు మానవ ప్రయత్నం ఏమైనా అవసరమా? లేక అంతా దైవాధీనమా ?!
జవాబు: ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. పక్ష వాతానికి కారణాలు చాలా ఉన్నాయి. ఈ కారణాలు మనం తెలుసుకుంటే , వాటిని నివారించు కోవడానికి అవకాశం ఉంటుంది. పూర్వ కాలం లో లాగా కాక , ఆధునిక వైద్య శాస్త్రం లో జరుగుతున్న అనేక పరిశోధనలూ, పరిశీలనల వల్ల పక్ష వాతానికి కారణాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రశ్న: పక్ష వాతం గురించి కేవలం వయసు మీరిన వారు తెలుసుకుంటే సరిపోతుందా ? యువత కు ఎందుకు ఈ వెతలు ? :
జవాబు : అనేక కారణాల వల్ల పక్ష వాతం , వయసు మీరిన వారితో పాటు వయసులో ఉన్న వారి కి కూడా వస్తూ ఉందని , భారత దేశం లో వివిధ పట్టణాలలో చేసిన పరిశీలనల వల్ల తెలిసింది. అంతే కాక , పక్ష వాతం రాకుండా ముందు జాగ్రత్తలు ఏళ్ల తరబడి తీసుకుంటూ ఉంటేనే , ఒక్క సారి గా , ఆకస్మికం గా వచ్చే పక్ష వాతం రాకుండా ఉండడానికి అవకాశం హెచ్చుతుంది. ఇంకో విధం గా చెప్పుకోవాలంటే , బాల్యం లో , యవ్వనం లో యువత తీసుకునే ఆరోగ్య పరమైన జాగ్రత్తలూ , అలవాట్లూ , భవిష్యత్తులో వారికి వయసు మీరుతూ ఉన్నప్పుడు , వారిని ప్రభావితం చేస్తాయి, పాజిటివ్ గా కానీ , నెగెటివ్ గా కానీ , అంటే , వారి ఆరోగ్యాన్ని పెంపొందించేవి గా కానీ , లేదా వారి ఆరోగ్యానికి హాని చేసేవి గా కానీ ! అందువల్ల , వయసు మీరిన వారితో పాటుగా , వయసు లో ఉన్న వారు కూడా అతి జాగ్రత్త గా గ్రహించ వలసిన విషయాలు ఉన్నాయి , వారి ఆరోగ్యం కోసం !
పక్ష వాతానికి కొన్ని రిస్కు ఫ్యాక్టర్ లు ఉన్నాయి. ఆ రిస్కు ఫ్యాక్టర్ లు ఉన్న వారిలో పక్ష వాతం రావడానికి అవకాశాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అంటే వారికి , ఆ రిస్కు ఫ్యాక్టర్ లు లేని వారితో పోలిస్తే , పక్ష వాతం వచ్చే అవకాశాలు ఉంటాయి , అంతే కానీ , వారికి తప్పనిసరిగా వస్తుందని అర్ధం చేసుకో కూడదు.
ఆ రిస్కు ఫ్యాక్టర్ లు ఏమిటో చూద్దాము ఇప్పుడు .
1. వయసు 65 ఏళ్ళు దాటిన వారిలో .
2. కుటుంబం లో , తల్లి దండ్రులు , తాత , సహోదరులు వీరిలో ఎవరికి పక్ష వాతం వచ్చి ఉన్నా , మిగతా కుటుంబ సభ్యులలో ఆ అవకాశం ఉంటుంది.
3. ఆసియా వాసులలోనూ , ఆఫ్రికా , కరీబియన్ వాసులలోనూ పక్ష వాతం వచ్చే అవకాశాలు మెండు. దీనికి కారణం , వారికి ఉండే రక్త పీడనం , ఇంకా మధు మేహం లాంటి జబ్బుల వల్లనే అని భావించ పడుతుంది.
4. అంతకు ముందే , గుండె పోటు కానీ , TIA కానీ వచ్చిన వారికీ , ఇంకా అంతకు ముందు కొద్ది తీవ్రత తో పక్ష వాతం వస్తే కానీ , వారికి మళ్ళీ పక్ష వాతం వచ్చే అవకాశం హెచ్చుతుంది.
పైన ఉదాహరించిన కారణాలను మార్చ లేము కదా అందువల్ల మిగతా కారణాలను మనం వివరం గా తెలుసుకుంటే , వాటిని మార్చుకోవడానికి అవకాశాలు ఎక్కువ. తద్వారా పక్ష వాతాన్ని చాలా వరకూ నివారించు కోవచ్చు.
వచ్చే టపాలో పక్ష వాతం లో రకాలు , వాటి గురించీ తెలుసుకుందాము !