ప్ర.జ.లు.11. ప్రెగ్నెన్సీ లో ఆహార నియమాలు.
ప్రశ్న : గర్భధారణ సమయం లో ఏ ఆహారం తీసుకోవాలి ? పత్యం ఏమైనా ఉందా? :
జవాబు: ఇది చాలా మంచి ప్రశ్న , ముఖ్యమైన ప్రశ్న కూడా !
ప్రెగ్నెన్సీ లేదా గర్భ ధారణా సమయం లో సమ తుల్యమైన ఆహారం తీసుకోవడం రెండు విధాలు గా ముఖ్యం, అంటే తల్లి ఆరోగ్యానికీ, గర్భం లో ఉన్న శిశువు ఆరోగ్యం కోసం కూడా !
మరి సమ తుల్యమైన ఆహారం అంటే ఏమిటి ?: అంటే కేవలం త్రాసు తో తూచి సమం గా అంటే రోజూ ఇన్ని గ్రాముల ఆహారం అని కాదు కదా! సమ తుల్యమైన ఆహారం అంటే కార్బోహైడ్రేటు లు , కొవ్వు, మాంస కృత్తులు, విటమిన్లు , ఇంకా ఖనిజాలూ , తల్లికీ , శిశువు పెరుగుదలకూ సరిపోయినంత పరిమాణం లో రోజూ తీసుకోవడం. అంటే అన్ని పోషక పదార్ధాలూ రోజూ ఆహారం లో సమ పాళ్ళలో ఉండేట్టు చూసుకొని తినడం. ఒక ఉదాహరణ: తోలి మాసాలలో, తల్లికి ఇష్టమైన ఆహారం అని మెక్ డొనాల్డ్స్ లోనూ ,లేదా కే ఎఫ్ సి లోనూ రోజూ పిజ్జాలూ , చిప్స్ , బర్గర్ తిన్నారనుకోండి. వాటిలో కేవలం కొవ్వు, ఇంకా కార్బోహైడ్రేటులు మాత్రమె ఉండే ఆహారం అవుతుంది అది. అది సమతుల్యమైన ఆహారం కాదు కదా ! అది జంక్ ఫుడ్ అనబడుతూ ఉంటుంది పాశ్చాత్య దేశాలలో !
మన భారత దేశ ఆచార వ్యావహారాలు గమనించి నట్టయితే , గర్భవతులకు శ్రీమంతం అని చేస్తారు. అంటే మొదటి మూడు మాసాలలో గర్భవతి అని తెలియగానే కుటుంబం లో అందరూ ఆనందం గా చేసుకునే పండగ. అందులో గర్భవతి కోసం మొలకలు వచ్చిన శనగలూ ఇంకా బెల్లం తో చేసిన చలిమిడి ఉండలూ , నువ్వులూ తినమని పెడతారు. శాస్త్రీయం గా చూస్తె మన పెద్దలకు ఎంత దూర దృష్టి ఉందో కదా అనిపిస్తుంది. ఎందుకంటే , మొలకలు వేస్తున్న శనగలు , పెసలలో విటమిన్ లు సంవృద్ది గా ఉంటాయి , ప్రత్యేకించి ఫోలిక్ యాసిడ్ మిగతా బీ కాంప్లెక్స్ విటమిన్లు. చలిమిడి ఉండలు బెల్లం తో చేయబడినవి కాబట్టి వాటిలో ఇనుము అంటే ఐరన్ సరిపడినంత గా ఉంటుంది. ఇక నువ్వులూ , ఇతర విత్తనాలలో మినరల్స్ లేదా ఖనిజాలు పుష్కలం గా ఉంటాయి. ఈ ఖనిజాలూ,విటమిన్లూ పెరుగుతున్న శిశువు కు ఎంతో ముఖ్యం ప్రత్యేకించి మొదటి మూడు మాసాలలో. ఇంకా ఇవన్నీ సహజం గా దొరికేవే కదా ! కాల క్రమేణా ఈ ఆచార వ్యవహారాలు ఎంత మంది పాటిస్తున్నారో మనకు తెలుసు కదా !
సరే మనం ఇప్పుడు ముఖ్యమైన విషయం తెలుసుకుందాము.
ప్రశ్న : నేను ప్రెగ్నెన్సీ సమయం లో ఏ ఆహారం తినాలి ? :
జవాబు: మీరు రోజూ మూడు సార్లు భోజనం చేయాలి అంటే మేజర్ మీల్స్. ఇంకా కనీసం రెండు మూడు సార్లు రోజుకు టిఫిన్లు కానీ స్నాక్స్ ( లేక చిరుతిళ్ళు ) కానీ తినవచ్చు. ముఖ్యం గా భోజనం సమతుల్యం గా ఉండేట్టు చూసుకోవాలి. పళ్ళూ , కాయగూరలూ , ఆకు కూరలూ వీలైనన్ని తింటూ ఉండాలి. విటమిన్లు కాక పీచు పదార్ధం కూడా సరిపడినంత గా ఉంటుంది. హోల్ గ్రేయిన్స్ అంటే పొట్టు తీయని పప్పు ధాన్యాలు విటమిన్లకు నిలయాలు. లో ఫాట్ పాలు , పళ్ళ రసాలూ , సూప్స్ కూడా తీసుకోవచ్చు. సంవృద్ది గా నీరు తాగడం కూడా చేస్తూ ఉండాలి. వంటకాలలో నూనె వీలైనంత వరకు తక్కువగానూ , వెజిటబుల్ నూనె , మొక్కజొన్న అంటే కార్న్ ఆయిల్ , ఆలివ్ ఆయిల్ , ఇంకా సన్ ఫ్లవర్ ఆయిల్ ను వాడడం మంచిది. ఈ నూనెలు మార్చి వాడడం వల్ల కూడా , శరీరానికి అవసరమైన వివిధ ఖనిజాలు లభిస్తాయి. ప్రాసెస్స్ చేసిన ఆహార పదార్ధాలు అంటే డబ్బాలలో అమ్మే ఆహార పదార్ధాలు తినడం మానాలి, వాటిలో ఉప్పు ఎక్కువగా ఉండడమే కాక , విటమిన్లు , ఏవీ ఉండవు. అంతే కాక నిలువ చేయడం వల్ల రుచి కూడా తగ్గుతుంది, తాజా దనం కోల్పోయి. టీలూ కాఫీలూ రోజుకు మూడు నాలుగు సార్ల కన్నా ఎక్కువగా తాగ కూడదు. అవి గుండె ను వేగం గా కొట్టుకునేట్టు చేయడమే కాక , స్వేదం అంటే చెమట పుట్టించడం,యాంగ్జైటీ కలిగించడం, నిద్ర కోల్పోవడం – వీటికి కారణమవుతాయి. చిరుతిళ్ళు తినవలసి వస్తే , చాక్లెట్లూ , బిస్కెట్ లూ, కేకులూ , క్రిస్ప్ లూ చాలా తగ్గించితే మంచిది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ లో మీకు కావలసినది సమతుల్యమైన ఆహారం. కేవలం కాలరీలు మాత్రమె కాదు కదా !
ప్రశ్న: మరి తినగూడనివి ఏమిటి ?
జవాబు: వచ్చే టపాలో తెలుసుకుందాము.
డాక్టర్ గారు,
నా పిచ్చి ప్రశ్నలతో మిమ్మల్ని విసిగిస్తున్నానేమో! అని అనుమానం ఉంది, అయినా స్వతంత్రించి అడిగేస్తున్నా. ఆహారం చెప్పేరు మరి విహారం సంగతిలో అనుమానాలు చెప్పరా?
భార్యా భర్తల కలయిక గురించి ప్రయాణాల గురించి కొన్ని అనుమానాలున్నాయి సామాన్యులలో, అదీ గాక బెడ్ రెస్ట్ అంటే మొత్తం మంచం దిగకుండా తిని పౌకోడమా? వివరించగలరు
నా భార్య ఇప్పుడు గర్భవతి (మూడవ వారం). మొదటి మూడు నెలలు ఎలాంటి ఆహారం తినాలి. ఏ ఏ సమయాల్లో ఎలాంటి ఆహారం తినాలి. కొంచెం ఆహార నియమావళి పంపండి. ధన్యవాదాలు సార్.
నాగరాజు గారూ,
మీ దంపతులకు అభినందనలు.
సమతులాహారం తీసుకోవడం శ్రేష్టం. అంటే , సమ పాళ్ళలో , మాంస కృత్తులు , పిండి పదార్ధాలూ , ఫ్యాట్స్ ( కొవ్వు పదార్ధాలతో ) తో పాటుగా విటమిన్లు ,ఖనిజాలు కూడా క్రమం గా తీసుకుంటూ ఉండాలి.
మొదటి మూడు నెలల గర్భం లో పిండ దశ లో ఉన్న శిశువు కు అవసరమైన నాడీ మండలం అంటే నెర్వస్ సిస్టం , ఇంకా రక్త ప్రసరణ వ్యవస్థ , అభివృద్ధి చెందుతాయి.
అందుకు అవసరమయే విటమిన్లు ముఖ్యం గా ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ ఎక్కువ గా తీసుకోవాలి .
ఈ విటమిన్ తాజా గా ఉన్న ఆకు కూరలలోనూ , పొట్టు తీయని ధాన్యాలలోనూ సమృద్ధి గా ఉంటుంది.
ఈ ఫోలిక్ యాసిడ్ లోపం తల్లి లో ఉంటే , శిశువు సరిగా పెరగక పోవచ్చు !
అందుకే ఈ లోపం ఉంటే , మొదటి మూడు నెలలో సరిదిద్దుకోవాలి !
మీరు శాఖ హారులో , మాంసాహారులో చెప్పలేదు.
మాంసాహారులవుతే , చేపలు తినడం వల్ల , ఆరోగ్య కరమైన కొవ్వు కూడా లభిస్తుంది , అంటే హెల్దీ ఫ్యాట్స్ .
ఒక సారి స్పెషలిస్టు వద్దకు తీసుకు వెళ్లి పరీక్ష చేయించుకుంటే , మీ భార్య బరువు, మిగతా విటమిన్లు ,
హీమోగ్లోబిన్ ( అంటే రక్త హీనత ) ఉందో లేదో కూడా పరీక్షల ద్వారా తెలుసుకుని , అందుకు తగిన మందులు, ఆహారం కూడా మొదటి నుంచీ తీసుకుంటే , తల్లి కీ , శిశువు కూ , మీ కుటుంబానికీ కూడా
మంచిది కదా !
Dr .సుధాకర్.
గర్భవతి సమయంలో సినిమాలు చూడవచ్చా..?
ఒకవేళ చూడోచ్చూ అయితే ఏ ఏ నెలలో చూడొచ్చు.
జాగ్రత్తలు చెప్పండి..?