ప్ర.జ.లు. 6.బాల్యం లో కళ్ళ జాగ్రత్తలు.
ప్రశ్న: బాల్యం లో పిల్లల కళ్ళ గురించిన జాగ్రత్తలు, తల్లి దండ్రులు తీసుకోవాలా ?:
జవాబు: ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. తల్లి తండ్రులు సహజం గా తమ పిల్లలను అత్యంత శ్రద్ధ తో చూసుకుంటారు. వారికి ఏ చిన్న అవస్థ, ఏ వయసులో కలిగినా తల్లడిల్లి పోతారు.వారికి ఆ అవస్థ , అనారోగ్యం ఎందుకు కలగాలి ? అనుకుంటూ, బాధ పడతారు. కానీ తమ పిల్లలను చూసుకోవడం లో కేవలం, వారికి కావలసిన , ఆహారం , బట్ట, ఆట పాటలకు సమయం ఇలాంటి విషయాలలో శ్రద్ధ వహిస్తారు. అంతే శ్రద్ధ తో వారు పిల్లల ఇంద్రియాలను కూడా గమనించాలి. పిల్లలు జన్మించి నప్పటి నుంచీ , చురుకు గా తమ పరిసరాలను గమనిస్తూ , ప్రపంచాన్ని చూస్తూ జ్ఞాన సముపార్జన చేస్తూ ఉండాలంటే, వారికి ఇంద్రియ లోపం ఉండ కూడదు. ప్రత్యేకించి కళ్ళు , చెవులు, భాషా జ్ఞానము , చక్క గా ఉంటే వారు ఎంతో చురుకు గా , తెలివి తేటలు అలవరచు కుంటారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అంటే మనకు ఉన్న ఇంద్రియాలన్నింటి కంటే కళ్ళు ప్రధాన మైనవి. ఇంత ముఖ్యమైన కళ్ళు బాల్యం లో తమ తల్లి దండ్రులు గమనించి నంతగా ఎవరూ గమనించరు. కళ్ళలో ఏ మార్పులు ఉన్నా అవి తల్లిదండ్రులు మొదట గమనించాలి. అప్పుడు ఏ మార్పులు ఉన్నా తగిన నిపుణుల సలహా తీసుకుని , ఆ మార్పులను సరి చేయించుకోవచ్చు.
మరి తమ చిన్నారుల కళ్ళ జాగ్రత్త విషయం లో, తల్లి తండ్రులు చేయ వలసిన దేమిటి ? :
జవాబు: ముందు గా సహజం గా చిన్నారుల కళ్ళలో బాల్యం లో వచ్చే సహజమైన మార్పులు తెలుసుకోవడం , మార్పులను తొలిదశల లో కనిపెట్టడానికి ఎంతో ఉపయోగకరం గా ఉంటుంది. మరి ఈ సహజమైన మార్పులు ఏమిటి ? : ఒక నెల వయసు ఉన్న శిశువులు తన చుట్టూ ఉన్న వారిని చూడగలరు. దీనినే పెరిఫెరల్ విజన్ అంటారు. ఈ వయసు లో తమకు మూడు అడుగుల దూరం లో ఉన్న వస్తువులను దృష్టి సారించి కొన్ని క్షణాల పాటు చూడ గలరు. దీనిని ఫోకస్ చేయగలగటం అంటారు.రెండు నెలల వయసులో వారు ట్రాకింగ్ కూడా చేయ గలరు. అంటే ఒక కదులుతున్న వస్తువును కూడా గమనించ గలరు. మూడు నెలల వయసు లో తమ దగ్గరలో ఉన్న వస్తువులను తమ చేతులతో పట్టుకోడానికీ , తోసివేయడానికీ ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉంటుంది. ఇట్లా మూడు నెలల వయసు లో పైన చెప్పిన విధం గా ఫోకసింగ్, ట్రాకింగ్ , ఇంకా హాండ్ కంట్రోల్ శిశువులలో కనిపించక పొతే అంటే వారు చూపక పొతే , వెంటనే వారిని చిన్న పిల్లల స్పెషలిస్టు కు చూపించాలి.అదే విధం గా కాంతిని గమనించ గలగడమూ , రంగులను గమనించ గలగటమూ కూడా మూడు నాలుగు నెలల వయసు వచ్చే సరికి శిశువులు చక్కగా చేయగలరు వారి కళ్ళ తో ! ప్రత్యేకించి వారు ముఖాలను , కళ్ళ నూ కూడా నిశితం గా గమనించ గలరు.నాలుగు అయిదు ఏళ్ల వయసులో పైన ఉదాహరించిన లక్షణాలు ఇంకా వృద్ధి చెందుతాయి. అంతే కాక వారు ఒక వస్తువును రెండు కళ్ళూ కేంద్రీకరించి నిశితం గా పరిశీలించ గలరు కూడా !
రిఫ్రాక్టివ్ ఎర్రర్ లు ఏమిటి ?: రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటే కళ్ళు ఒక ఆబ్జెక్టు లేదా వస్తువు మీద సరిగా కేంద్రీకరించలేక పోవడము లేదా ఫోకస్ చేయలేక పోవడము. ఈ లోపాన్ని తొలిదశల లోనే కనుక్కుంటే దృష్టి లోపాన్ని నివారించ వచ్చు లేదా సాధ్యమైనంత వరకూ తగ్గించ వచ్చు.
ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్ లు ఏ రకం గా ఉంటాయి? : మయోపియా :అంటే కేవలం దగ్గర గా ఉండే వస్తువులనే స్పష్టం గా చూడ గలగటం, ( దూరం గా ఉన్న వస్తువులు మసక గా కనిపిస్తాయి వారికి ). దీనికి వ్యతిరేకం గా హైపర్ మెట్రోపియా : అంటే దూరం గా ఉన్న వస్తువులు మాత్రమె స్పష్టం గా కనిపించడం, దగ్గర వస్తువులు మసక బారటం జరుగుతుంది. ఎస్తిగ్మా టిజం : అంటే దగ్గర వస్తువులు కానీ దూరం వస్తువులు కానీ పెద్దగా ఉన్నవి చిన్నగానూ లేదా కొన్ని భాగాలు మాత్రమె చిన్న గానూ , లేదా చిన్న వస్తువులలో కొన్ని భాగాలు మాత్రమె పెద్దగానూ కనిపిస్తాయి. ఈ లక్షణాలు పిల్లలలో గమనించాలి. ఒక వేళ గమనించితే వెంటనే కంటి నిపుణుడిని సంప్రదించాలి. ప్రత్యేకించి కొందరు పిల్లలు తమ క్లాసులలో కూడా ముందు వరుసలలోనే కూర్చుంటూ ఉంటారు. వారిని వెనుక వరుసలోకి బలవంతాన టీచర్ లు మారిస్తే వారు చదువులో కూడా వెనుక బడుతూ ఉంటారు. సరిగా బోర్డు మీద రాతలు గమనించలేక, ఒక వేళ వారికి మయోపియా ఉంటే ! ఈ విషయాలు టీచర్లూ , తల్లి తండ్రులూ గమనించాలి, తోలి దశలలోనే. త్వరగా వారికి స్పెషలిస్టు సహాయం అందితే , కేవలం చూపు బాగు పడడమే కాకుండా, తల్లి దండ్రుల ముందు చూపు కు కూడా తార్కాణం అవుతుంది ఆ చర్య.పిల్లలు చక్కగా నేర్చుకుంటే వారి భవిష్యత్తు కూడా సవ్యం గా సరిదిద్దినట్టే కదా , తల్లి తండ్రులు, కేవలం వారి దృష్టి మాత్రమె కాక !
వచ్చే టపాలో ఇంకొన్ని ప్ర.జ.లు.
Really informative and useful
Thanks Sharma gaaru.