ప్ర.జ.లు.4. రొమ్ము క్యాన్సర్ కు, మిగతా స్క్రీనింగ్ పద్ధతులు ఏమిటి ?:
ప్రశ్న : రొమ్ము క్యాన్సర్ కు, మిగతా స్క్రీనింగ్ పద్ధతులు ఏమిటి ?:
జవాబు; క్రితం టపాలో మనం స్తనాల స్వీయ పరీక్ష , రొమ్ము క్యాన్సర్ నివారణ లో ఎట్లా ఉపయోగ పడుతుందో తెలుసుకున్నాము కదా! ఇప్పుడు మిగతా స్క్రీనింగ్ పరీక్షలు ఏమిటో అవి కూడా తెలుసుకుందాము.
1. మామోగ్రాం : స్తనాల ఎక్స్ రే నే మామోగ్రాం అంటారు. అంటే కొద్ది మార్పులతో తీసే చాతీ ఎక్స్ రే నే ! కాక పొతే స్త్రీ స్తనాలను పరిశీలించడానికి ఉపయోగ పడే ఎక్స్ రే. ఈ మామోగ్రాం ఎంత ఉపయోగ పడుతుందో , అది తీసే రేడియాలజిస్ట్ సామర్ధ్యం బట్టీ, అంతే కాక పెరుగుతున్న ట్యూమర్ లేదా కంతి యొక్క పరిమాణం బట్టీ , స్తనాల పరిమాణం స్తనాలలో ఉండే కణ జాలం యొక్క సాంద్రత ను బట్టీ మారుతూ ఉంటుంది. ప్రత్యేకించి స్తనాలలో ఒక వేళ కంతి ఏర్పడితే , అది యాభై సంవత్సరాలకు పైబడ్డ వారిలో నే స్పష్టం గా కనిపిస్తుంది, యాభయి ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న వారి కంటే. ఇట్లా ఎందుకు జరుగుతుందంటే , వయసు తక్కువ ఉన్న వారిలో ఎక్కువ స్తనం పరిమాణం అంటే స్తనాలలో , హార్మోనుల ప్రభావం ఎక్కువ గా ఉండి , కణ జాలం కూడా ఎక్కువ గా ఉంటుంది.ఈ స్తన కణ జాలం ఎక్స్ రే లో కంతి లాగానే తెల్ల గా కనపడుతుంది. దాని వల్ల , క్యాన్సర్ కంతి లేదా ట్యూమర్ కూ , సహజ స్తన కణ జాలానికీ తేడా తెలుసుకోవడం కష్టమవుతుంది. ( ఆ పరిస్థితులలో అవసరాన్ని బట్టి , మిగతా స్క్రీనింగ్ పరీక్షలు కూడా చేయవలసిన అవసరం ఉంటుంది. )
2. MRI scan లేదా ఎమ్మారై స్కాన్ : ఈ పరీక్ష మామోగ్రాం కన్నా సున్నితమైనది. అంటే , ఈ పరీక్షలో క్యాన్సర్ కనుక్కునే అవకాశాలు ఎక్కువ అవుతాయి. కాక పొతే , ఈ పరీక్ష ఎక్కువ ఖర్చు తో కూడినది. MRI కి పూర్తి నామం మ్యాగ్నేటిక్ రిసోనాన్స్ ఇమేజింగ్.అంటే అయస్కాంత ప్రభావం స్తనాల మీద చూపించడం. తరువాత ఆ అయస్కాంత తరంగాలను కంప్యూటర్ ద్వారా విశ్లేషించడం. పెరుగుతున్న కంతులను ఒక నిర్ణీత సమయం లో మళ్ళీ మళ్ళీ పరిశీలించడానికి కూడా ఈ ఎమ్మారై స్కాన్ ఎంతో ఉపయోగకరం.ఎందుకంటే , మామోగ్రాం లాగా స్తనాల మీద ఎక్స్ రే ల ప్రభావం ఈ ఎమ్మారై స్కాన్ వల్ల ఉండదు కదా !
3. FNA, NA and DL : ఎఫ్ ఎన్ ఏ అంటే ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ , ఎన్ ఏ అంటే నీడిల్ యాస్పిరేషన్ : ఈ పద్ధతులలో స్తన కణజాలం లోకి ఒక సున్నితమైన సూది ని పంపి ఆ సూది ద్వారా స్తన కణ జాలాన్ని తీసి దానిని పరీక్ష చేస్తారు. ఆ పరీక్షలో సహజ స్తన కణజాలం లో క్యాన్సర్ ను కలిగించే మాలిగ్నంట్ కణ జాలం ఉంటే తెలుసుకోవచ్చు. ఇక డీ ఎల్ , DL అంటే డక్ టాల్ లావాజ్ అంటే స్తనాలలో ఉన్న పాలు స్రవించే సూక్ష్మ నాళికలు ఈ నాళికలలో ఉన్న కణ జాలాన్ని కూడా పరీక్ష చేసి అసహజ కణాలను అంటే క్యాన్సర్ కణాలను గుర్తించ డమన్న మాట !
మరి ఈ స్క్రీనింగ్ టెస్ట్ ల పరిమితులు ఏమిటి ? : ఏ స్క్రీనింగ్ పరీక్ష అయినా మానవులే కదా చేసేది అందువల్ల , కొన్ని సమయాలలో క్యాన్సర్ కణ జాలం ఉన్నా, పరీక్షలో కనబడక పోవచ్చు. అట్లాగే సహజ కణ జాలం కూడా కొన్ని సమయాలలో క్యాన్సర్ కణ జాలం గా కనిపించ వచ్చు. అంతే కాకుండా, తరచూ మామోగ్రాం లు చేయిస్తూ ఉంటే స్తనాల మీద రేడియేషన్ ప్రభావం ఎక్కువ అయి, అప్పుడు కొత్త సమస్యలు కూడా ఉత్పన్న మవవచ్చు. ఇంకా కేవలం క్యాన్సర్ ను కనుక్కున్నంత మాత్రాన మనం ఆ స్త్రీ యొక్క ఆయుష్షు పెంచలేక పోవచ్చు. ఇట్లా ఎందుకు జరుగుతుంటూ ఉంటుందంటే , అన్ని క్యాన్సర్లూ ఒకే వేగం తో పెరగవు. కొన్ని చాలా నిదానం గా పెరుగుతాయి. అప్పుడు చికిత్స కూడా శులభ మవుతుంది. కొన్ని చాలా వేగం గా పెరుగుతాయి. అప్పుడు చికిత్స జటిలం అవుతుంది.
క్రింద ఉన్న వీడియో లో మామోగ్రఫీ చేసే విధానం చక్కగా వివరింప బడ్డది. చూడండి.
వచ్చే టపాలో ఇంకొన్ని ప్ర.జ.లు.!