‘ పిచ్చి’ సంగతులు, తెలుసుకోవడం మంచిదే ! . 4.
మునుపటి టపాలో పిచ్చి లక్షణాలు ఎట్లా ఉంటాయో తెలుసుకున్నాము కదా ! ఇప్పుడు పిచ్చి అంటే మానియా వచ్చినప్పుడు దానిని ఎట్లా కనుక్కోవచ్చో తెలుసుకుందాము. ఇంతకు ముందు వివరించినట్టు , పిచ్చి ఉన్నప్పుడు , వారు వారి జీవితాలను రిస్కు లో పెట్టడమే కాకుండా , ఇతరులు జీవితాలకు కూడా ముప్పు తేగలరు. అందు వల్ల, మనకు పిచ్చి లేక పోయినా, పిచ్చి సంగతులు తెలుసుకుంటే , తగిన సమయం లో ఆ లక్షణాలు ఎవరిలో నైనా కనిపెట్టి , సరి అయిన వైద్య సహాయం తీసుకునేట్టు చూడ వచ్చు.
ఎట్లా కనుక్కోవచ్చు ? :
ఇది 5 విధాలు గా ఉండవచ్చు.
1. వ్యాధి నిర్ణయం చేయడం. 2.వ్యాధి తీవ్రత ను నిర్ణయించడం. 3. వ్యాధి ఆ సమయం లో కనిపించడానికి గల కారణాలు వెతకడం. 4. వ్యాధి లక్షణాలు కనిపించిన వారికి ఏ సహాయం అందుతుందో అంచనా వేయడం. 5. ఇతరుల మీద వారి ( వ్యాధి లక్షణాల ) ప్రభావం.
1. పిచ్చి మానసిక వ్యాధి: అందువల్ల ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే, వైద్య సహాయం పొందాలి. పిచ్చి లక్షణాలు వచ్చిన వారు ఎట్లాగూ , తాము పిచ్చి గా ఉన్నట్టూ , ప్రవర్తిస్తున్నట్టూ , ఎప్పుడూ ఒప్పుకోరు. అందువల్ల వారి మానసిక లక్షణాలు , ప్రవర్తనా, వారి చుట్టూ ఉండే వారు గమనించాలి. ఈ చుట్టూ ఉన్న వారు , తల్లి దండ్రులు , తోబుట్టువులు, స్నేహితులు , బంధువులు, లేదా వారు చదువుకునే కాలేజీ లో సహా విద్యార్ధులు , లేదా పనిచేసే ఆఫీసులలో, ఫాక్టరీ లలో సహ ఉద్యోగులు – ఇట్లా ఎవరైనా కావచ్చు. అందువల్లనే ఇతరుల ప్రాముఖ్యం ఇంత గా ఉంటుంది. వారే సరిఅయిన వివరాలు ఇవ్వ గలరు.
అతిగా వాగటం , అతిగా ఖర్చు పెట్టడం, గొప్పలు చెప్పుకోవడం, ప్రగల్భాలు పలకడం – ఈ లక్షణాలు అన్నీ మనం సామాన్యం గా మామూలు మనుషులలో కూడా చూస్తాము కదా ! మరి వీరికీ పిచ్చి ఉన్న వారికీ తేడా ఏమిటి ? అని ఆలోచిస్తే ఈ లక్షణాలు వీరిలో ఆకస్మికం గా వస్తాయి. అంటే అప్పటి వరకూ మామూలు గా ఉన్న వారు, ఈ లక్షణాలతో ప్రవర్తిస్తారు. వారి ప్రవర్తన పూర్తిగా అసహజం గా ఉంటుంది వారు తెలిసిన వారికి. ‘ ఇదేంటిరా వీడు సడన్ గా ఇలా ప్రవర్తిస్తున్నాడు ? ‘ అనుకుని ఆశ్చర్య పోయేట్టు గా ఉంటుంది వీరి ప్రవర్తన ! కనీసం ఒక వారం రోజులు , ఆ పిచ్చి లక్షణాలు చూపిస్తూ ఉంటే అప్రమత్తత వహించాలి.
అంతే కాక కొన్ని సమయాలలో , ప్రత్యేకించి విద్యార్ధులు, విద్యార్ధినులు మాదక ద్రవ్యాలు తెలిసో , తెలియకో తీసుకుంటే కూడా వారిలో పిచ్చి లక్షణాలను పోలిన ప్రవర్తన కనిపించ వచ్చు.
2.వ్యాధి తీవ్రత కనుక్కోవడం : ఇందుకు , వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తి తో పాటు , వారికి అతి దగ్గర సంబంధం ఉన్నవారు ఇచ్చే వివరాలు కూడా వ్యాధి తీవ్రతను నిర్ణయించడానికి ఏంటో ఉపయోగ పడుతుంది. ఈ సమయం లో వ్యాధి లక్షణాలు ఉన్న వారి జీవితాలలో వచ్చిన తీవ్రమైన వత్తిడి కలిగించే ఏ సంఘటనలు అయినా ఉన్నాయేమో కూలంక షం గా పరిశీలించాలి. అట్లాగే , వారు నిద్ర లేమి తో బాధ పడుతున్నారేమో కూడా కనుక్కోవాలి. అదే విధం గా వారు ఇటీవల దుబారా గా ఖర్చు పెడుతున్నారో లేదో , లేదా కామ పరంగా విశృంఖలత చూపుతున్నారో కూడా కనుక్కోవడం ఉత్తమం.
3.ఆ వ్యాధి లక్షణాలు ఆ సమయం లో వారిలో కనిపించడానికి ఏమైనా ప్రత్యెక పరిస్థితులు ఉన్నాయేమో కూడా పరిశీలించాలి. మనసును తీవ్రం గా గాయ పరిచే , లేదా కలత చెందించే ఏ సంఘటన అయినా కేవలం డిప్రెషన్ గానే కాక , మానియా లేక పిచ్చి రూపం లో కూడా కనిపించ వచ్చు. ఈ కారాణాలు మనం తెలుసుకోగలిగితే , చికిత్స జరిపే సమయం లో ఈ కారణాల మీద కేంద్రీకరించవచ్చు.
4. ముఖ్యం గా వ్యాధి లక్షణాలు కనిపించిన వారి కి అందుతున్న సహాయం , సంపూర్ణం గా పరిశీలించాలి. మానసిక వ్యాధి అంటే, ‘ మన ‘ భారత దేశం లో ఇంకా ‘ చేత బడి ‘ జరిగిందనో , దయ్యం పట్టిందనో , వివిధ రూపాలలో వారిని తీవ్రం గా , మానసికం గానూ , భౌతికం గానూ , హింసించడం సర్వ సాధారణం. అందు వల్ల ఈ వ్యాధి ‘ లేదా ‘ పిచ్చి ‘ లక్షణాలు ఉన్న వారి చుట్టూ ఉన్న వారి అవగాహన ఏమిటి ? వారి సహాయ సహకారాలు ఏమైనా రోగి కి అందుతాయా లేదా అని నిర్ణయించాలి ముందే !
5. ఆ వ్యాధి ఉన్న వారి తల్లిదండ్రులు , తోబుట్టువులు , లేదా స్నేహితులు , ప్రియులు , సహచరులు వీరు ఏ విధం గా ఆ వ్యాధి వల్ల ప్రభావితం అవుతున్నారో కూడా వివరం గా తెలుసుకుని, వారికి తగు సలహా ఇవ్వాలి.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !
మీరు పిచ్చి గురించి రాయడం. నేను మీ వెనక పిచ్చిగా పడటం పిచ్చిగా ఉంది 🙂
అందుకే ………….మంచిదే కదండీ !