‘ పిచ్చి ‘ సంగతులు, తెలుసుకోవడం మంచిదే ! .3.
క్రితం టపాలో మనం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం లో కొన్ని , మానియా లేదా పిచ్చి లక్షణాలు ఏ విధం గా ఉంటాయో తెలుసుకున్నాము కదా ! ఇప్పుడు ఇంకొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాము.
పిచ్చి ఉన్నప్పుడు మాట అంటే స్పీచ్ లో కూడా మార్పులు గమనించ వచ్చు. సామాన్యం గా ఒక వేగం తో మాట్లాడే వారు , అకస్మాత్తుగా మాట్లాడే వేగం పెంచడం కనిపిస్తుంది. అంటే ‘ గడ గడ గడా ‘ మాట్లాడుతూ నే ఉంటారు పిచ్చిలో. అంటే ఒక మాట పూర్తి అవక ముందే ఇంకో మాట మొదలుపెడతారు.ఇట్లా చేస్తూ మాటల వేగం పెంచుతారు. అంతే కాక, వీరు మాట్లాడే విషయాలు కూడా ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉంటాయి. ముందు చెప్పుకున్నట్టు , ఆలోచనలు పగ్గాలు లేకుండా పరిగెత్తుతాయి అందు వల్ల , ఆలోచనలను ప్రతిబింబించే మాటలు కూడా , పగ్గాలు లేకుండా , పరి పరి విధాల పరిగెత్తుతాయి.
ఉదాహరణకు :’ చంద్రమండలం వెళ్లి రాగలను నేను , ఏమనుకుంటున్నారో , మన్మోహన్ సింగు తో మాట్లాడాను నేను , స్కూటర్ మీద వెళతాను , చాలా పుస్తకాలు రాశాను నేను కవిత్వం మీద , దయ్యాలు కనిపిస్తే వాటిని వెళ్లి పొమ్మని చెప్పాను. నా బొటన వేలు నొప్పి గా ఉంది. లాటరీ లో ఇరవై లక్షలు గెలిచాను. మీరు వాక్సినేషన్ చేయించుకోండి. గ్రహాంతర వాసి నన్ను రమ్మన్నాడు, మార్సు మీదకు’ ఇట్లా ఉంటుంది వారు మాట్లాడడం ! కొన్ని సమయాలలో మనం క్రితం ఎప్పుడూ వినని భాష లేదా మాటలు కూడా మాట్లాడుతారు పిచ్చిలో , అంటే నిజం గా పిచ్చిగా మాట్లాడతారు. ఇంతే కాకుండా , పిచ్చి బాగా ఉన్నప్పుడు , వీరు వీరికి వచ్చే క్రోధం అంటే కోపం నియంత్రించుకొలేరు. అంటే కంట్రోలు చేసుకోలేరు. వారి సమీపం లో ఉన్న వస్తువుల మీద కానీ , మనుషుల మీద కానీ ఆ కోపాన్ని చూపిస్తారు , ఏదో ఒక రూపం లో ! అవి తిట్ల రూపం లో ఉండవచ్చు , లేదా ‘ బాదుడు ‘ రూపం లో ఉండవచ్చు ! అట్లాగే వీరికి ఆకలి అయితే కూడా ,విపరీతం గా ఆవురావురు మని సామాన్యం గా తినే దానికంటే రెండు మూడు రెట్లు ఎక్కువ తింటూ ఉంటారు. ఇంకా కామ వాంచలు కూడా వీరిలో సాధారణం గా ఉండే దానికన్నా ఎక్కువ గా ఉంటుంది. దీనితో వీరు విపరీతమైన , కామ పరమైన విశృంఖలత కూడా చూపుతూ ఉంటారు. సమస్యలలో చిక్కుకుంటారు కూడా ! ఇక వారి అపోహలు లేదా డి ల్యుజన్ ( delusions ) లు కూడా మిగతా వారికి విచిత్రం గా ఉంటాయి.
ఉదాహరణకు : వారు దైవాంశ సంభూతులమని , వారికి రోజూ నో , లేదా వారు కోరుకున్నప్పుడో , దైవం కనిపించి మాట్లాడి, తమకు సలహాలు ఇవ్వడం చేస్తారని చెపుతూ ఉంటారు. అట్లాగే వారు తరచూ , కైలాసానికి వెళ్లి , అక్కడ ఉన్న వారితో కొంత కాలం గడిపి వస్తూ ఉంటామని కూడా చెపుతుంటారు. ఈ విధంగా ప్రగల్భాలు పలకటాన్ని గ్రాండి యోస్ డి ల్యుషన్స్ అంటారు . కొన్ని సమయాలలో వీరు మనుషులను కానీ జంతువులను కానీ చూస్తూ వారి సంభాషణలు కూడా వింటూ ఉంటారు, వారు సమీపం లో లేక పోయినా కూడా. ఈ పరిస్థితిని హాల్లూసి నేషన్స్ అంటారు. ( hallucinations ). వీరు ఏదైనా వాహనం నడిపించే సమయం లో కూడా విపరీతమైన ఆత్మ విశ్వాసం తో నడిపి తమ ప్రాణాల మీదకూ , ఇతరుల ప్రాణాల మీదకూ , అలవోకగా తెచ్చుకుంటారు.వీరికి డబ్బు కానీ , క్రెడిట్ కార్డ్ లు కానీ అందుబాటు లో ఉంటే ‘ అంతే సంగతులు ! విపరీతం గా ఖర్చు చేస్తారు, ఏమాత్రం సంకోచించ కుండా !
ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే ,వారి మటుకు వారికి , వారు చేసే ప్రతి పనీ ఎంతో సమంజసం గా సరి అయినది గా వారికి ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. అంటే వారు యుక్తా యుక్త విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతారు. ముఖ్యం గా పిచ్చి లక్షణాలు పూర్తి గా ఉండి , పిచ్చి గా ప్రవర్తిస్తూ ఉన్న వారు , తమకు ఏ విధమైన మానసిక వ్యాదీ లేదని , వారు సంపూర్ణం గా ఆరోగ్య వంతులు గా ఉన్నామనీ , అనుకుంటారు.
మరి ఈ పిచ్చి లక్షణాలు ఇంకే సందర్భం లో నైనా రావచ్చా ? : కొన్ని రకాలైన మాదక ద్రవ్యాలు అంటే ‘ యాంఫీ టమిన్ లు , లేదా ఇతర స్టిమ్యు లెంట్ మందులు తీసుకున్న వారు కూడా , ఈ పిచ్చి లక్షణాలు చూపించ వచ్చు. ప్రత్యేకించి నైట్ క్లబ్బు లలో ఈ రకమైన మందులు , రహస్యం గా అమ్ముతూ ఉంటారు.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
interesting.