‘పిచ్చి’ సంగతులు, తెలుసుకోవడం మంచిదే ! 2.
శాస్త్రీయం గా మరి ‘ పిచ్చి ‘ ని ఏమంటారు ?:
పిచ్చిని మానియా అంటారు. ఈ మానియా , డిప్రెషన్ కు ఖచ్చితం గా వ్యతిరేకమైన లక్షణాలు కలిగి ఉంటుంది. మనం డిప్రెషన్ గురించి ‘ బాగు ‘ మొదటి టపాలలో చాలా వివరం గా తెలుసుకోవడం జరిగింది కదా ! డిప్రెషన్ లో ఉండే మానసిక , ఇంకా ప్రవర్తనా లక్షణాలు ఏ విధం గా ఉంటాయో, వాటికి వ్యతిరేకం గా మానియా లో లక్షణాలు ఉంటాయి. అంతే కాక , మానియా ఉండే వారిలో కొన్ని పరిస్థితులలో డిప్రెషన్ కూడా రావచ్చు. అంటే మానియా ఉన్న వారిని శాస్త్రీయం గా బై పోలార్ డిసార్డర్ ఉన్న వారు అంటారు.అంటే రెండు భిన్న ధ్రువాలు గా ఉంటుంది వీరి మానసిక స్థితి. అంటే , డిప్రెషన్ అంటే మానసికం గా క్రుంగి పోవడమూ , లేదా మానసికం గా ఎంతో తీవ్ర స్థితి అంటే ఉచ్చ స్థితిలో ఉండడమూ ! మానవులు సాధారణంగా , అన్ని ఎమోషన్ లూ సమ పాళ్ళలో అనుభవించుతూ, తమ నిత్య జీవితాన్నీ , తమ చుట్టూ ఉండే సమాజం లో సంతృప్తికరం గా సత్సంబంధాలు కలిగి ఉండి, ఒక సమతుల్యమైన ప్రవర్తన కలిగి ఉంటే, దానికి కారణం వారిలో , వారి ఆలోచనలూ , మూడ్లూ అంటే mood , సమ తుల్యం గా ఉండడమే !
పిచ్చి లేదా మానియా మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ఏమిటంటే : మనలో సహజం గా ఉండవలసిన మూడ్ కంటే ఎంతో ఎక్కువ గా ఉండడం దీనినే ఏలే టెడ్ మూడ్ అంటారు ఆంగ్లం లో. తెలుగులో మనం సామాన్యం గా అంటూ ఉంటాము ‘ వాడి పరిస్థితి ,పట్ట పగ్గాలు లేకుండా ఉంది ‘లేదా ‘ పట్ట శక్యం కాకుండా ఉంది ‘ అని. ఈ ప్రయోగం మన తెలుగులో చక్కగా చేశారు. అంటే మన ఆలోచనలు , ప్రవర్తనా , ఏవిధం గా ఒక అశ్వం లేదా గుర్రం పగ్గాలు అంటే రీన్స్ లేకపోతే యధేచ్చ గా అంటే తన ఇష్టం వచ్చిన దిశలో ఎట్లా పరిగెత్తుతుందో , ఆ పరిస్థితి లో ఉంటామన్న మాట ! ఇక్కడ ఆలోచనలు ఒక విధమైన పరుగు లో ఉంటాయి. అంటే అనేక మైన ఆలోచనలు, విపరీతమైన వేగం తో మన మనసులో లేదా మస్తిష్కం లో మెదలడం. అంతే కాక , ఆ ఆలోచనలకు ఏ విధమైన నియంత్రణా , అంటే కంట్రోలు లేక పోవడం ! ఇక ఇట్లాంటి మూడ్ తో పాటు , హైపర్ యాక్టివిటీ అంటే మామూలు కంటే ఎక్కువ గా యాక్టివ్ గా ఉండడం. అంటే తాము, అన్ని పనులూ , ఏమాత్రం అలసట లేకుండా చేసుకుంటూ పోవడం. ఉదాహరణకు , ఆఫీసు లో సాయింత్రం దాకా పని చేసి వచ్చి, మళ్ళీ రాత్రంతా ఇల్లు సర్దడమో, లేదా టీవీ చూస్తూ ఉండడమో , లేదా కంప్యూటర్ లో బ్రౌజ్ చేస్తూ ఉండడమో చేయడం. ఇట్లా పగలూ రాత్రీ పని ఏక బిగిని చేస్తున్నా, అలసట అనుభూతి లేక పోవడం. సహజం గా మనం భౌతికం గా అలసిపోతూ ఉంటాము ఇట్లా పగలూ రాత్రీ పని చేస్తూ ఉంటే ! కానీ మానియా ఉన్న వారు ఈ అనుభూతి చెందరు. అంతే కాక వారు వారికి నిద్ర తక్కువ గా పోయినా , ఏ మాత్రం లెక్క చేయక , పైగా ఇతరులతో ‘ గొప్పలు ‘ కూడా చెపుతూ ఉంటారు, తాము రాత్రులు నిద్ర లేక పోయినా , ఎంతో సమర్ధ వంతం గా పని చేయ గలరని ! వారి మూడ్ లో వచ్చే మార్పుల వల్ల, వారు ప్రగల్భాలు పలుకుతున్నట్టు కూడా గమనించ లేరు ! దీనినే గ్రాండి యొసిటీ అంటారు. పిచ్చి కి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా కొన్ని లక్షణాలు కూడా ఉంటాయని తెలిపింది. వీరి లో నిద్ర పోవాలని అనిపించదు ఇంతకు ముందు వివరించినట్టు గా ! అంతే కాక , వారికి ఎక్కడ లేని ఆత్మ విశ్వాసము వచ్చేస్తుంది ఈ పిచ్చి ఉన్న సమయం లో ! అంటే సాధారణ సమయాలలో స్తబ్దుగానో , లేదా అతి నెమ్మది గా ఉండే వారు , అకస్మాత్తు గా విపరీతమైన ఆత్మ విశ్వాసం ఎవరో వారిలో ఇంజెక్షన్ ద్వారా ఇచ్చినట్టు ప్రవర్తించు తారు. అంతే కాక వీరిలో ఏకాగ్రత తీవ్రం గా లోపిస్తుంది. అంటే, వారు చేస్తున్న పనులన్నీ పూర్తి ఏకాగ్రత తో చేయ లేక పోవడం , లేదా చాలా శులభం గా వారు కేంద్రీకరించిన ఏకాగ్రతను కోల్పోవడమూ జరుగుతుంది. ఉదాహరణకు : ఇంట్లో ,ఒక పని చేస్తున్నప్పుడు , ఫోను రింగవుతూ ఉంటే వెంటనే, ఆ పని మానేసి , ఫోను ఆన్సర్ చేయడం సహజమే కదా ! కానీ వీరు ఫోను లో మాట్లాడుతూ, అవతల వారికి వేచి ఉండమని చెప్పి ఈ లోగా , రేడియో లో పాట వినిపిస్తూ ఉంటే , ఆ పాటకు వారి స్వరం కలిపి పాడుతూ , మమైకం చెంది , నృత్యం కూడా చేయడం మొదలెట్టు తారు. వారు చేస్తున్న పని మాట ఇక దేవుడికే ఎరుక !
మిగతా విషయాలు వచ్చే టపాలో !