డిపెండెంట్ పర్సనాలిటీ లేదా ఆధార పడే వ్యక్తిత్వం. 5.
పేరు లోనే ఉంది కదా ! ఈ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు , ఎప్పుడూ ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు. అందులో తప్పు ఏముంది ? మానవుడు సంఘ జీవి కదా ! నలుగురితో సహాయ సహకారాలు తీసుకోవడమే స్థిత ప్రజ్ఞుల లక్షణం కూడా కదా అని మీరు అన వచ్చు.డిపెండెంట్ పర్సనాలిటీ లేదా ఆధార పడే వ్యక్తిత్వం ఉన్న వారు, వారి జీవితం లో ప్రతి విషయానికీ ఇతరుల మీద ఆధార పడుతూ ఉంటారు. అంతే కాక , ఇతరులను , తమ జీవితం లో జరుగుతూన్న సంఘటనలకూ , సమస్యలకూ, కీలకమైన నిర్ణయాలు తీసుకోమని వారికి వదిలేస్తారు. ఒక విధం గా ఈ వ్యక్తిత్వం ఉన్న వారి పరిస్థితి ఎమోషనల్ గా ‘ తెగిన గాలి పటం ‘ మాదిరిగా ‘గాలి దయా దాక్షిణ్యం’ మీద ఉన్నట్టు గా ఉంటుంది, వారు ఇతరులను , తమ జీవిత నౌక కు చుక్కాని అయి, వారిని దరి చేర్చాలని అనుకుంటారు. వారి జీవితం మీద , వారి జీవిత నిర్ణయాల మీద ఏమాత్రం భారమూ , బాధ్యతా వారికి లేనట్టు ప్రవర్తిస్తారు. వీరి దృష్టి లో ఇతరులు తమ అంచనాలకూ , ఊహలకూ అనుగుణం గా ఉండాలని అనుకుంటారు కానీ , ఇతరులు ఒక వ్యక్తిత్వం కలిగి వారికై వారు ప్రత్యేకతలు కలిగి ఉంటారనే విషయాన్ని విస్మరిస్తారు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకో వలసి వచ్చిన ప్రతి పరిస్థితినీ వీరు దాట వేస్తూ ఉంటారు.
ఈ ఆధార పడే వ్యక్తిత్వం ఉన్న వారు వారిమీద ఏ విధమైన సెల్ఫ్ ఇమేజ్ కలిగి ఉంటారో చూద్దాము:
వీరు తాము అసంపూర్ణ వ్యక్తులమనీ , ఈ ‘ మోస పూరిత , ప్రమాద కర బాహ్య ప్రపంచం ‘ లో తాము ఇమడలేమనీ, అసహాయత ఎర్పరుచుకుంటారు. అందువల్ల తమ జీవిత నిర్ణయాలు , ఇతరులకు వదిలేస్తారు. దానితో , వీరికి , పెద్ద కోరికలూ, ఆశయాలూ , ఆకాంక్షలు కూడా తక్కువ గా ఉంటాయి. ఈ విధమైన అభిప్రాయం కలిగి వారు ఇతరుల ‘ రక్షణ ‘ లో ఉండడమే మంచి మార్గం అనుకుంటారు. అందుకోసం వారు, ఇతరులు తీసుకునే నిర్ణయాలు ఎట్లా ఉన్నా , వాటిని ఆమోదిస్తూ ఉంటారు.వారి వ్యక్తిత్వాన్ని ,ఇతరుల ఆమోదం కోసం ‘ తాకట్టు ‘ పెడుతూ ఉంటారు. అట్లాగే అతి విధేయత తో ఇతరుల ‘రక్షణ’ లో ‘ అణిగి మణిగి ఉంటారు. దీనితో అనేక కీలకమైన జీవిత నిర్ణయాల సమయం లో వీరు ఎక్కువ గా ‘ తమ మెదడు కు పని పెట్టరు’ అంటే ఎక్కువ గా ఆలోచించరు.
ఆధార పడే వ్యక్తిత్వం ఉన్న వారు ఇతరులతో ఏ రకమైన సంబంధాలు కలిగి ఉంటారు? : వీరు తాము మనుగడ సాగించాలంటే , తమ కన్నా గొప్ప వారితో సంబంధాలు ఎప్పుడూ అవసరమని భావిస్తారు. వారు ఇన్ఫీరియర్ గా ఫీలవుతూ , సుపీరియర్స్ ను విధేయత, ప్రేమ , వాత్సల్యలతో చూసుకుంటూ ఉంటారు. అంతే కాక , వారికి ఆమోద యోగ్యం కాని పనులు కూడా చేస్తూ , త్యాగ మయ జీవితాలను గడపడానికి కూడా వీరు వెనుకాడరు. ఈ విధమైన సంబంధాలు ఏర్పరుచుకున్నాక , వారికి, లేక వారు ఆధార పడిన వ్యక్తులకూ ఏ రకమైన వైఫల్యాలు ఎదురైనా కూడా , వాటిని సీరియస్ గా తీసుకోకుండా , వాటిని అల్ప విషయాలు గా పరిగణిస్తారు. వారికై వారు కేవలం ఇతరులతో ఎట్టి పరిస్థితులలోనైనా సహకారమూ, తాము ఆమోదించ పడటమూ ఆశిస్తారు.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !