Our Health

ఆధార పడే వ్యక్తిత్వం. 6.

In మానసికం, Our minds on జూలై 1, 2012 at 10:58 సా.

ఆధార పడే వ్యక్తిత్వం. 6.

క్రితం టపా లో చూశాము కదా ఆధార పడే వ్యక్తిత్వం ఉన్న వారు ఏ లక్షణాలు కలిగి, ఎట్లా వారు ‘ అంధ కార మయ జీవితం ‘ లో  వెలుగునిస్తూ, తాము మైనం లా కరిగి పోతూ ఉంటారో !  ఈ ఆధార పడే మనస్తత్వం , వ్యక్తిత్వం ఉన్న వారు పలు రకాలు గా  కూడా ఉండ వచ్చు.  మిల్లన్ అనే సైకాలజిస్ట్  వారి వారి మనస్తత్వాల, వ్యక్తిత్వ తీరు ల బట్టి మళ్ళీ ఈ ఆధార పడే వ్యక్తిత్వాన్ని కొన్ని రకాలు గా విభజించాడు. ఒక రకానికి చెందిన వారు , ఇతరుల మీద ఆధార పడినా, ఆ విషయం పెద్ద గా వారు సీరియస్ గా తీసుకోరు. అది వారి విజ్ఞానం మీద కూడా ఆధార పడి ఉంటుంది. అంటే వారు  విద్యావంతులు కాక పొతే, వారు వారి జీవితాలను ఇతరుల చేతుల్లో పెట్టామనే విషయం వారికి తట్టదు. ఇంకో రకం వారు ,ఆ విషయ పరిజ్ఞానం ఉన్నా , అసంతృప్తి గానే, ఇతరుల మీద ఆధార పడతారు. ఇంకో రకం వారు ఇమ్మేచూర్ గా అంటే వారు మానసికం గా పరిణితి చెంద కుండా, ఇతరుల మీద ఆధార పడే వ్యక్తిత్వం అలవరచుకుంటారు.  ఇంకో రకం వారు తాము ఎట్లాగూ  తమ జీవితం లో సవాళ్ళను సమర్ధ వంతం గా ఎదుర్కో లేక , ఇతరుల మీద ఎక్కువ గా ఆధార పడతారు. ఇంకో రకం వారు తమ స్వార్ధం చూసు కోకుండా, త్యాగ శీలురై , ఇతరుల మీద ఆధార పడే వ్యక్తిత్వం అలవాటు చేసుకుంటారు. ఈ రకానికి చెందిన వారు మాసోచిజం  అనే ప్రవ్రుత్తి కి కూడా లోనవుతారు. ( మాసోచిజం అంటే , తాము  పొందే బాధ, కష్టాల తో తాము సంతృప్తి , ఆనందం పొందడం ! ఆశ్చర్యం గా ఉంది కదా ! కానీ, భౌతికం గానూ , మానసికం గానూ తాము హింశించ బడితే, సంతృప్తి , సంతోషం పొందే వారు , ఈ ప్రపంచం లో చాలా మంది ఉన్నారు ! ) 
మరి ఇతరుల పైన ఆధార పడే ఈ డిపెండెంట్ వ్యక్తిత్వాన్ని ఎట్లా కనుక్కోవచ్చు ? : ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని లక్షణాలు ఒక వ్యక్తి లో ఎక్కువ కాలం అంటే కనీసం కొన్ని నెలలూ , లేదా సంవత్సరాలూ ఉంటే , వారిలో ఆధార పడే వ్యక్తిత్వం ఉందని తెలిపింది. ఆ లక్షణాలు ఇవే : 
1. తమ జీవితాలలో తమకు చెందిన , ముఖ్య మైన సంఘటనలకు సంబంధించిన నిర్ణయాలను , ఇతరులనే తీసుకోమని, ఇతరులను ప్రోత్సహించడం , లేదా ఇతరులు తీసుకుంటుంటే దానిని ఆమోదించడం. 
2. తాము ఆధార పడిన వారికి విధేయత కలిగి ఉండడం , వారి ఆశయాలకు తాము అంగీకార యోగ్యం గా ప్రవర్తించడం. 
3. తాము ఆధార పడిన వారిమీద , తాము , కనీస ఆంక్షలు కూడా విధించడానికి అయిష్టం గా ఉండడం ,  ఆ కనీస ఆంక్షలు హేతు బద్ధమైనవి అయినా కూడా  !.
4. తాము ఒంటరి గా ఉన్నప్పుడు , ఇబ్బంది గా , నిస్సహాయత గా ఉండడం, ( ఎందువల్ల నంటే , వారు తాము స్వతంత్రం గా ఉండలేమేమో అన్న భయం తో ) 
5. తమ జీవిత విషయాల మీద నిర్ణయాలు చేస్తున్న వారు, తమను ఎక్కడ , ఎప్పుడు వదిలేస్తారో అన్న ఆలోచలనలతో దిగులు గా ఉండడం. 
6.ఇతరుల సహాయ సహకారాలు పొందలేక పొతే , తమంత తాము గా పరిమితమైన ప్రతిభా సామర్ధ్యాలు మాత్రమే కలిగి ఉండడం. 
పైన చెప్పిన లక్షణాలలో ఏ మూడు ఉన్నా , వారు , ఆధార పడే వ్యక్తిత్వం ఉన్న వారని నిర్ధారించ బడుతుంది.
ఒక సమస్య : జ్యోతి మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చింది. డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాసయింది. మనసు కూడా వెన్న. తండ్రి రెండు మూడేళ్ళలో రిటైర్ అవుతాడు. తల్లి కి కొన్ని ఆరోగ్య పరమైన సమస్యలు ఉన్నాయి. చెల్లెలు కూడా ఇంజినీరింగ్ పాసయి ఉద్యోగం చేస్తుంది. సంబంధాలు వెతుకుతున్నారు. జ్యోతికి సమర్ధుడైన భర్త దొరికాడు. అంతే కాక , ఒక నిలకడ అయిన ఉద్యోగం కూడా చేస్తున్నాడు.సంపాదనా చెప్పుకో తగ్గదే ! ఇద్దరు పిల్లలు పుట్టడం వల్ల, జ్యోతి కి ఉద్యోగం చేయడానికి అవకాశం చిక్కలేదు, పెళ్లి అయిన పది ఏళ్ల వరకూ . ‘ పిల్లలు పెరుగుతున్నారు కదా ! స్కూల్ కు కూడా వెళుతున్నారు. ‘ నేను ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటాను ‘ అని తన ఆంతర్యం తెలిపింది భర్త తో ఒక సందర్భం లో ! అప్పటి నుంచీ ‘ ఆయన గారి చికాకూ , చిర్రు బుర్రు లాడడం మొదలైంది. మొదటి లో జ్యోతికి, ఈ పరిస్థితి వల్ల ఆందోళన అధికం అయింది. ‘  చక్కని సంసారం లో  అలలు , ఆటు పొట్లూ ఎందుకు ?, పిల్లలు కూడా చక్క గా పెరుగుతున్నారు , చదువు కుంటున్నారు అని’ మధన పడుతూ , ప్రశాంతత వహించింది. కొంత కాలం అయిన తరువాత ఆ ప్రస్తావన మళ్ళీ తెచ్చింది భర్త దగ్గర. ‘ నేను నీకేం తక్కువ చేస్తున్నాను ! అన్నీ నేనే చూసు కుంటున్నా కదా ! నీవు ఉద్యోగం చేస్తేనే జరుగుతుందా ? అన్నాడు ! ‘  నేను ఇప్పటి వరకూ పిల్లల సంరక్షణ చూశాను కదా ఇంటి దగ్గరే ఉండి ! వారు మరీ చిన్న వారు కాదు కదా ఇప్పుడు ! నేను కూడా స్వతంత్రం గా కొంత సంపాదించ గలిగే అవకాశం కూడా ఉంది కదా ! అన్నది జ్యోతి. అప్పటి నుంచీ ఆయన  ముభావం గా ఉంటారు. ఈ మధ్య కొద్ది గా ఆలస్యం గా ఇంటికి రావడం. కొన్ని సార్లు పిల్లలు  నిద్ర పోయిన తరువాత ,   ఇంటి లోనే ‘ మందు ‘ పుచ్చు కోవడం !  ఇప్పుడు  జ్యోతి పరిస్థితి మీరు వ్యాఖ్యానించ గలరా ? జ్యోతి సమస్య కు  ( అసలు జ్యోతి కి సమస్య ఒకటి ఉందని మీకు అనిపిస్తే ) ,  మీ పరిష్కారాలు  ఏమిటో తెలియ చేయండి ! 
వచ్చే టపాలో మిగతా వివరాలు తెలుసుకుందాము ! 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: