దాట వేసే లేదా ఆందోళన మయ వ్యక్తిత్వం . 2. కారణాలు.
క్రితం టపాలో చూశాము , ఈ వ్యక్తిత్వ లక్షణాలు కొన్ని. సాధారణం గా ఈ వ్యక్తిత్వం ఉన్న వారు , వారి ప్రతిభా పాటవాలను , వారే తక్కువగా అంచనా వేసుకుని , తీవ్ర అసంతృప్తి కీ, ఆత్మ న్యూనతకూ లోనవు తుంటారు. తరచూ ఇతరులతో తాము పోల్చుకుని , తామే ఎప్పుడూ , ఇతరుల కన్నా తక్కువగా ,ప్రతి విషయం లోనూ ఉన్నామని, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో ఉంటారు. ఈ విధమైన ఆలోచనలతో వారు ఇతరులను కూడా దూరం గా ఉంచుతూ , తాము ఉంటూ ఉంటారు. వారు వారి భావావేశాలను , ఎమోషన్స్ ను సహజం గా అందరూ చూపే విధం గా వ్యక్తం చేయలేక మధన పడుతూ ఉంటారు, లో లోపల . వారు అనుభవించే ఈ ఆత్మ న్యూనతా భావం కారణం గా ఇతరుల తో భౌతికం గా కూడా దూరం గా ఉంటారు. అంటే చేతులు కలపడమూ , లేదా స్నేహ పూర్వకం గా కౌగిలించడం , ఇట్లాంటి సహజమైన ఎమోషన్స్ ను వ్యక్తం చేసే రీతులకు కూడా వారు దూరం అవుతూ వ్యధ చెందుతూ ఉంటారు. వారికై వారు అప సవ్య మైన ఆలోచనలతో ఏర్పరుచుకున్న ‘ లక్ష్మణ రేఖ ‘ ల వల్ల తమ ఇంటి లో నుంచి బయట కు కాలు పెట్టడానికి కూడా శంకిస్తూ ఉండి, తప్పని సరి పరిస్థితులలో , బయట కు వెళ్ళడం , బహిరంగ ప్రదేశాలలో తిరగడం వంటి పనులు చేయాలంటే విపరీతం గా భయం , ఆందోళనా చెందుతారు. దీనినే ‘అగారో ఫోబియా ( agorophbia ) అంటారు ( అగారో అంటే బహిరంగ ప్రదేశాలు , ఫోబియా అంటే భయం ) ( దీని గురించి ముందు ముందు టపాలలో తెలుసుకుందాము ). అంతే కాక ఎక్కువ కాలం ఇంట్లోనే గడపడం అలవాటు చేసుకోవడం వల్ల , వారిలో వారు , ఫాంటసీ అనుభూతులలో అంటే ఊహా లోకం లో విహరిస్తూ ఉంటారు ఎక్కువ సమయం.
ఈ రకమైన వ్యక్తిత్వానికి కారణాలు ఏమిటి ? : ప్రధానం గా ఈ వ్యక్తిత్వానికి , జన్యువులలో ఉన్న మార్పులు , వారు పెరుగుతున్న వాతావరణం , వారు వారి పైనా , ఇతరుల పైనా ఏర్పరుచు కున్న అభిప్రాయాల వల్ల నూ అధికం గా ప్రభావితం అవుతుందని పరిశోధనల వల్ల విశదం అయింది. అంటే , ఈ రకమైన వ్యక్తిత్వం, మన కు మన తల్లిదండ్రులు ఇచ్చిన జీన్స్ అంటే జన్యువుల వల్ల మనకు సంక్రమించ వచ్చు . కానీ మన జన్యువులలో నిక్షిప్తమై ఉన్న ఆ లక్షణాలు , మనం పెరుగుతూ ఉన్న వాతావరణం , అంటే మన తల్లి తండ్రులు , తోబుట్టువులూ , లేదా మన స్నేహితులూ , స్కూల్ లో మిగతా పిల్లలూ , మనతో ప్రవర్తించే తీరు , ఇంకా మనం మన పరిసరాల వల్ల ప్రభావితం అయి , తదనుగుణం గా మార్చుకున్న లేదా మారుతున్న ఆలోచనా దృక్పధం వల్ల విపరీతం గా ప్రభావితం అవుతాయి. క్రమేణా ఆ రకమైన వ్యక్తిత్వం మనకు అలవడుతుంది.
ఈ రకమైన వ్యక్తిత్వం లక్షణాలు ఎక్కువ కాలం ఉంటే దాని పరిణామాలు ఏమిటి ? : ఈ రకమైన , వ్యవహారాలనూ , పనులనూ దాట వేసే , లేదా ఆందోళన మయ మైన వ్యక్తిత్వ లక్షణాలు దీర్ఘ కాలం ఉండడం వల్ల , పరిస్థితి ఒక తక్కువ పరిధి ఉన్న ముళ్ళ కంచెలో ఇరుక్కున్న విధం గా ఉంటుంది. ఈ పరిణామం డిప్రెషన్, యాంగ్జైటీ, అగారో ఫోబియా, లాంటి రుగ్మతలకు దారి తీయ వచ్చు.
మరి ఈ వ్యక్తిత్వం ఉన్న వారికి ఏ రకమైన చికిత్స అయినా ఉందా ? :
ప్రధానం గా , ఈ వ్యక్తిత్వ లక్షణాలు ఉన్న వారు , సోషల్ స్కిల్స్ లో ప్రావీణ్యత పొందితే ఎక్కువ గా లాభ పడతారు. అంతే కాక కాగ్నిటివ్ థెరపీ అంతే జ్ఞాన చికిత్స తో కూడా అధికం గా ప్రయోజనం పొందుతూ , వారి ఆలోచనా రీతులను మార్చుకోగలరు.
మందులు కూడా కొంత వరకు ఉపయోగ పడతాయి వారికి. కానీ మందుల వాడకం మిగతా పద్ధతులు ఏ ఫలితం చూపక పొతేనే చేయాలి. సోషల్ స్కిల్స్ ట్రైనింగ్ , ఇంకా కాగ్నిటివ్ థెరపీ – ఈ రెండూ వెంటనే ఫలితాలు చూపవు. ఎందుకంటే , ఈ వ్యక్తిత్వ లక్షణాలు కూడా ఒక రోజు లో కాక దీర్ఘ కాలం గా ఏర్పరుచుకున్న అవక తవక ఆలోచనా ధోరణి వల్ల కదా !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !