స్వీయ సామర్ధ్యం తో కాన్ఫిడెన్స్ ను ఎట్లా పెంచుకోవచ్చు ?.8.
క్రితం టపాలో చూశాము కదా ! స్వీయ సామర్ధ్యం , ఆప్టిమిజం ల కలయికే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనీ , ఆ రెడూ ఎంత మనలో ఎక్కువ అవుతుంటే అంత ఆత్మ గౌరవం కూడా పెరుగుతూ ఉంటుందని.
ఇప్పుడు మనం స్వీయ సామర్ధ్యం అంటే ఏమిటి ? దానిని మనం ఎట్లా అభివృద్ధి చేసుకోవచ్చో తెలుసుకుందాము.
స్వీయ సామర్ధ్యం : ఆల్బర్ట్ బండూరా అని ఒక అమెరికన్ సైకాలజిస్ట్ , సామాజిక సైకాలజీ లో అనేక పరిశోధనలు చేశాడు. ఆయన మాటలలో స్వీయ సామర్ధ్యం అంటే మనం, మనం చేపట్టే ఏ పనిలోనైనా విజయ వంత మవుతామనే అనుకునే ‘ మన నమ్మకం ‘. మనం ఆనందమయ జీవితం గడుపుతూ, అభివృద్ధి పధం లో పయనించడానికి, ఈ స్వీయ సామర్ధ్యాన్ని బాగా అర్ధం చేసుకొని, దానిని, మనలో పెంపొందించుకోవాలి.
అత్యంత ప్రముఖమైన బండూరా ‘ సాంఘిక జ్ఞాన థియరీ ‘( social cognition theory ) లో స్వీయ సామర్ధ్యం కీలకమైన పాత్ర వహిస్తుంది. మరి ఈ సాంఘిక జ్ఞాన థియరీ ఏమిటి : సంఘం లో, ఏ పరిస్థితి లో నైనా , ప్రతి వ్యక్తి యొక్క ప్రవర్తనా అంటే బిహావియర్ ఇంకా ప్రతి చర్యా , ఆ వ్యక్తి తన చుట్టూ ఉన్న వారిలో పరిశీలించిన ప్రవర్తన తో అత్యంత ప్రభావితం అవుతుంది. అంటే మనం నలుగురి తో ఉన్నప్పుడు మన ప్రవర్తన , ఆ మిగతా నలుగురు ప్రవర్తించే తీరు మీద ఆధార పడి ఉంటుంది. మరి ఇక్కడ స్వీయ సామర్ధ్యం ప్రమేయం ఏమిటి ?అనుకుంటే , స్వీయ సామర్ధ్యం ఎక్కువ గా ఉన్న వారు, సంఘం లేదా సమాజం లో తాము ఎదుర్కుంటున్న జటిల లేదా కష్ట పరిస్థితులను, అధిగమించి తాము విజయవంత మవడానికే ఉత్సాహం చూపిస్తారు.కానీ అదే పరిస్థితిని, స్వీయ సామర్ధ్యం లేని వారు , ఏదో విధం గా దాట వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారు తాము చేపట్టిన కార్యాలు, ఎక్కువ కష్టం గా ఉన్నాయని ( అంటే అవి నిజంగా కష్టం గా లేక పోయినా ! ) కూడా తరచూ అనుకుంటూ ఉంటారు.అట్లాగే స్వీయ సామర్ధ్యం ఎక్కువ గా ఉన్న వారు, వారు చేసే పనుల కోసం, ఎక్కువ గా ఉత్తేజం చెందుతూ ఉంటారు. అంటే వారు ఎక్కువ మోటివేట్ అయి ఉంటారు. అట్లాగే స్వీయ సామర్ధ్యం ఎక్కువ గా ఉన్న వారు, పరిస్థితులు తమ కంట్రోలు లేక స్వాధీనం లో నే ఉన్నాయి అని భావిస్తూ ఉంటారు. కానీ స్వీయ సామర్ధ్యం తక్కువ అయిన వారు, పరిస్థితులు తమ చేయి దాటి పోయినాయనీ , దానికి కారణం ‘ విధి వ్రాత ‘ అనీ అనుకుంటూ ఉంటారు. మిగతా ఆరోగ్య విషయాల మీద స్వీయ సామర్ధ్యం ప్రబావం ఏమిటి ? : స్మోకింగ్ ఆపడం, క్రమం గా వ్యాయామం చేయడం, డైటింగ్ చేయడం, అలాగే స్త్రీలలో రొమ్ము పరీక్ష చేసుకోవడం లాంటి ఆరోగ్య విషయాలు, సఫలం లేదా విఫలం అవడం కూడా ప్రతి వ్యక్తి కీ ఉన్న స్వీయ సామర్ధ్యాల మీద ఆధార పడి ఉంటాయని వివిధ పరిశోధనల వల్ల తెలిసింది.
మరి మన జీవితాలలో ఇంత ప్రాముఖ్యత సంతరించుకున్న స్వీయ సామర్ధ్యాన్ని ఎట్లా పెంచుకోవాలి ?:
1. అనుభవం తో:, అంటే ప్రతికూల పరిస్థితులను ఆశావవహ దృక్పధం తో ఎదుర్కొంటూ ఉండాలి. దాట వేయడానికి ప్రయత్నించ కూడదు. అలా అధిగమించిన ప్రతి సంఘటనా, స్వీయ సామర్ధ్యాన్ని పెంచి , అది భవిష్యత్తు లో మరిన్ని విజయాలకు సోపానం అవుతుంది.
2. ఇతరుల విజయాలతో ప్రేరణ: ముందు చెప్పుకున్నట్టు , మన ప్రతి చర్యా , సమాజం లో ఇతరుల చర్యలూ , ప్రవర్తన పైన ఆధార పడి ఉంటుంది. అంటే ఇతరుల విజయాలను మనం ఎప్పుడూ పోల్చుకుంటూ ఉంటాము. ‘ వాళ్ళు చేయగా లేనిది, నేను ఎందుకు చేయలేను అనే పోటీ స్వభావం నిరంతరం ఉండాలి. ఇలా విజయవంతమైన ఇతర వ్యక్తులతో పోల్చుకోవడాన్ని ‘ మోడలింగ్ ‘ ( modeling ) అంటారు. మోడల్స్ మనం ప్రతి రోజూ, ప్రతి వ్యాపార ప్రకటన లోనూ చూస్తూ ఉంటాము కదా!ఈ మోడలింగ్, వస్తువుల పట్లా , తమ ఆలోచనల పట్లా ఒక స్థిరమైన అభిప్రాయం లేని వారిని మార్చడానికి ఉపయోగ పడే ఒక శక్తి వంతమైన ‘ సాధనం ‘. అందుకే దీనిని వ్యాపార వేత్తలు అంత విరివి గా( తెలివిగా కూడా ), తమ ప్రకటనలలో వాడుతూ ఉంటారు. ఉదాహరణకు : తమ అభిమాన హీరో స్మోకింగ్ చేస్తేనో , లేదా ‘ మందు ‘ తీసుకుంటూ ఉంటేనో ఒక ప్రకటనలో కనిపించినా , వారిని అనుకరించడానికి అత్యుత్సాహం చూపుతారు యువత, ఆ రకమైన మోడలింగ్, తమ ఆరోగ్యాన్నీ , భవిష్యత్తునూ తీవ్రం గా ప్రభావితం చేస్తున్నా లెక్క చేయకుండా ! వ్యాపార ప్రకటనలో మోడలింగ్ , కేవలం, వారు వేసుకునే బట్టలు మనం కూడా అనుకరించాలనీ , లేదా వారు వాడిన వస్తువులను మనం కూడా వాడాలనీ అనుకోవడానికే పరిమితమవుతూ ఉంటుంది. కానీ మనం జీవితం లో అభివృద్ధి పధం లో సాగాలంటే, విజయులైన వ్యక్తుల సాధననూ , దీక్షనూ , అనుకరిస్తూ , స్వీయ సామర్ధ్యాన్ని పెంచుకుంటూ , కృత నిశ్చయం తో పురోగామించాలి.
3. సామాజిక ప్రోద్బలాలు : అంటే మనం చేయబోయే ప్రతి పనినీ ఇతరులు ( అంటే వారు , తల్లిదండ్రులు అయినా , తోబుట్టువులు అయినా , స్నేహితులు అయినా, లేక ఏ ఇతర శ్రేయోభిలాషులు అయినా ) ప్రోత్సహిస్తే ,లేదా ప్రోత్సహిస్తూ ఉంటే కూడా మన స్వీయ సామర్ధ్యం పెరుగుతూ ఉంటుంది. అట్లా మనకు మంచి మాటలు చెప్పి ఎంకరేజ్ చేసిన వారిని గుర్తు పెట్టుకోవడం , మన అనుభవం లోనిదే కదా !
తరువాతి టపా లో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !