మెటా మోటివేషన్ అంటే ఏమిటి ?. 5.
క్రిందటి టపాలో తెలుసుకున్నాము కదా ! మ్యాస్లో , మానవులలో వివిధ దశలలో , వేటి వల్ల ఉత్తేజం చెందుతారో ! ఆయన థియరీ లో మోటివేషన్ పిరమిడ్ కూడా చూశాము కదా ! మీ సౌలభ్యం కోసం ఆ పిరమిడ్ ను ఇక్కడ మళ్ళీ పొందు పరచడం జరిగింది.
ఈ పిరమిడ్ లో మొదటి నాలుగు అంచెలలో ఉన్న ఉత్తేజ కారకాలు, బేసిక్ డ్రైవ్ లు అని కానీ లేక బేసిక్ నీడ్స్ అని కానీ అనబడతాయి. అంటే ఇవి ప్రతి మానవులకూ తప్పని సరి అయే ప్రాధమిక అవసరాలు. వీటినే మ్యాస్లో D- needs , లేక డెఫిసిట్ నీడ్స్ ( deficit needs or deficit cognitions ) అని కూడా అన్నాడు. అంటే మొదటి నాలుగు లెవెల్స్ లో ఉన్నవి లోపించితే, వాటి కోసం, అవి పొందాలనుకొని మనం ఉత్తేజం అంటే మోటివేషన్ తెచ్చుకుంటాము. ఒకసారి వాటిని సాధించిన తరువాత ఆటోమాటిక్ గా మిగతా లెవెల్స్ కు వెళ్ళము. వాటిని సాధించి, సంతృప్తి చెందుతాము. అంటే అందరమూ తరువాతి దశలకు ఉత్తేజం పొందము. అంటే ‘ self actualisation‘ దశకు వెళ్ళము.
peak experiences : అంటే శిఖరానుభూతులు. మ్యాస్లో, మానవులు , ప్రేమలో, ఆనందం లో అత్యున్నత దశకు చేరుకున్న అనుభూతి ని పొంది, తాము ఈ విశాల ప్రపంచం లో ఒకరుగా ఆత్మానందం చెందితే, ఆ పరిస్థితిని పీక్ ఎక్స్ పీరియన్స్ గా మ్యాస్లో పేర్కొన్నాడు. ఇక్కడ గమనించవలసినది , శిఖరానుభూతులు అంటే కామోచ్చ దశ, లేదా క్లైమాక్స్ కాదు. ఇది మానసికం గా అత్యున్నత ఆనంద అనుభూతి పొందడం. మ్యాస్లో పరిశీలనలలో ‘ మొదటి నాలుగు దశలు దాటి అయిదవ దశ అయిన ‘ self actualisation’ స్థితికి ఉత్తేజం పొంది, దానిని సాధించిన వారు , ఈ పీక్ ఎక్స్ పీరియన్స్ ను తరచుగా పొందుతూ ఉంటారని స్పష్టమయింది.
మెటా మోటివేషన్ ( Metamotivation ) : ఇట్లా ప్రాధమిక అవసరాలు అంటే బేసిక్ నీడ్స్ స్థితి, అంటే పిరమిడ్ లో మొదటి నాలుగు దశలూ దాటి ఎవరైతే సెల్ఫ్ యాక్చువ లైజేషన్ స్థితికి చేరుకునే ఉత్తేజం పొందుతారో ఆ ఉత్తేజాన్ని ‘ మెటా మోటివేషన్ ‘ లేదా ‘ meta motivation ‘ అని మ్యాస్లో తెలిపాడు.ఈ మెటా మోటివేషన్ ఉన్నవాళ్ళు, బీ కాగ్నిషన్స్ పొంది ఉంటారు. ( B- cognitions or Being Cognitions ). అట్లాగే వారికి బీ విలువలు ( అంటే B- values or Being values ) పొంది ఉంటారు.వారిలో , ఈ బీయింగ్ విలువలు ఉంటాయి: నిరాడంబరత, స్వతంత్రత, సంపూర్ణత, అందం ( అంటే వారు అందం గా ఉంటారని అర్ధం కాదు. వారు చేసే పని లో అందం ఉంటుంది. ), మంచితనం, ప్రత్యేకత, హాస్యం, స్పోర్టివ్ మనస్తత్వం, సత్యము, జీవం, న్యాయం.ఇలాంటి విలువలు. ఇక్కడ గమనించవలసిన, ఆశ్చర్య కరమైన సంగతి ఏమిటంటే, పైన చెప్పిన మంచి గుణాలను, మ్యాస్లో ‘ బీయింగ్ వాల్యూస్ ‘ అని పేరు పెట్టాడు. అంటే ఆయన దృష్టి లో నిజం గా మానవులు ఈ లక్షణాల కోసం ఉత్తేజం పొందితే, లేదా పొందుతూ ఉంటే , అప్పుడే వారు ‘ ఉంటున్నట్టు ‘ లెక్క ! ( డీ కాగ్ని షన్స్ మాత్రమె ఉన్న వారు లేదా డెఫిసిట్ కాగ్ని షన్స్ కోసం ఉత్తేజం పొందుతున్న వారు , మ్యాస్లో దృష్టి లో ‘ బ్రతుకుతున్నట్టే ‘ లెక్క అయి ఉంటుంది ! ) ఇంకో ఆశ్చర్య కరమైన కో ఇన్సిడెన్స్ ఏమిటంటే, మోక్ష మార్గం పొందడానికి వివిధ మతాలలో ఈ లక్షణాలనే సోపానాలు గా చెబుతూ ఉంటారు.
( మరి మ్యాస్లో మోటివేషన్ పిరమిడ్ థియరీ గురించి తెలుసుకున్నాము కదా ! ఇప్పుడు ‘ మన ‘ ప్రస్తుత రాజకీయ ‘ నాయకుల ‘ మోటివేషన్ పిరమిడ్ క్రింద చూడండి! ).
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !