ఉత్తేజం ( మోటివేషన్ ) అంటే ఏమిటి ?. 1.
‘ ఉత్తేజం ‘ అంటే మనల్ని కర్తవ్యోన్ముఖులు గా చేసే ఆలోచనలు. మనం ఉదయం నుంచీ , నిద్ర పోయే వరకూ చాలా విషయాలు ఆలోచిస్తూ ఉంటాము. మన మెదడులో అనేక ఆలోచనలు ప్రవాహం లా వస్తూ ఉంటాయి. ఏ ఆలోచనలు అయితే కార్య రూపానికి పురి గోల్పుతాయో దానిని ‘ ఉత్తేజం ‘ అంటారు. ఉత్తేజం మోటివేషన్ అనే ఆంగ్ల పదానికి , తెలుగు అనువాదం. ఆంగ్ల పదం , మోటివేషన్ ( motivation ) కూడా ఒక లాటిన్ పదం ,మూవర్ ( movere ) నుంచి పుట్టిందే ! లాటిన్ భాషలో movere అంటే ‘ కదలడము ‘ లేదా ‘ కదిలించు ‘ అనే అర్ధం వస్తుంది.అంటే మన ఆలోచనలు , మన మెదడు లో నే ఉండక , కార్య రూపం లో ‘ కదిలించే ‘ గుణాన్ని మోటివేషన్ అంటారు. ఉదాహరణ : తల్లి దండ్రులు చాలా సమయాలలో తమ సంతానాన్ని కోప్పడడం అనుభవం లోనిదే ! కొన్ని సమయాలలో పిల్లలు సరిగా చదవక పొతే , వారు విసుగు చెంది ‘ నీకు ఏ ఇబ్బందీ లేకుండా, నీకు కావలసినవన్నీ చూసుకుంటున్నాము, స్కూల్ కు కూడా స్కూటర్ మీద దింపడం జరుగుతున్నది కదా రోజూ ! నీకు లోపించినదల్లా మోటివేషన్ ! చక్కగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని పై చదువులు చదవాలనే ‘తపన ‘ ఉండాలి నీకు, అది లేక పొతే పుస్తకాల ముందు ఎంత సేపు కూర్చున్నా ఉపయోగం ఉండదు ! అని మందలించడం అసాధారణం ఏమీ కాదు కదా ! ఉత్తేజాన్ని , సాధారణం గా మన జీవితాలలో పరీక్షలు, కష్టాలు , లేక చాలెంజేస్ ను మనం ఎదుర్కునే సామర్ధ్యం గా చెప్పుకోవచ్చు. ఉత్తేజాన్ని స్పష్టం గా నిర్వచించడం కూడా అంత శులభం కాదు. కానీ , ఉత్తేజాన్ని , ఉత్సాహం , ఆత్మ విశ్వాసం ( కాన్ఫిడెన్స్ ) , ఇంకా చేపట్టిన పనిని నిర్విరామం గా కొనసాగించే గుణాల కలయిక గా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యం గా ఉత్తేజం మనకు , జీవితం లో ఒక దిశను నిర్దేశిస్తుంది. అలాగే , ఉత్తేజం ఉన్నంత సేపూ మనం చేపట్టిన కార్యాన్ని సఫలం చేయాలి అనే కృత నిశ్చయం తో ఉంటాము కూడా !
జీవితం లో మనం సాధించే అనేక విజయాల వెనుక ఉన్న , లేక ఉండే శక్తి మనం ఆ కార్యాల సాధన కై , పొందే ఉత్తెజమే !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !