ABCDE లతో ఆప్టిమిజం ఎట్లా నేర్చుకోవచ్చు ? .25.
ఇప్పుడు అక్షరం D అంటే డిస్ ప్యు టేషన్ ( D is abbreviation for Disputation ) ఏ విధం గా మన ఆలోచనా ధోరణిని మార్చి , ఆప్టిమిజం వైపు మళ్లిస్తూ ఉంటుందో తెలుసుకుందాము. ఈ డిస్ ప్యు టేషన్ ను మనం తెలుగులో ‘ వివాదం’ అని అనవచ్చు. మనలో సవ్యం గా జరిగే ఈ వివాదం, మన ఆలోచనా ధోరణినీ , తద్వారా మన భవిష్య కార్యక్రమాలనూ ప్రభావితం చేయ గలదు. అందువల్ల ఈ ‘ వివాదం ‘ మనం ఆప్టిమిజం వైపు మళ్లడం లో అత్యంత కీలకమైనది. మానవులు స్వతహాగా కీడు ఎంచి మేలు ఎంచే మనస్తత్వం కల వారు. అంటే మన మెదడు లో వివిధ నాడీ తంత్రులు , కీడును , లేదా నెగెటివ్ సంఘటనలనే మొదట శంకిస్తూ ఉంటుందని నిరూపణ అయింది. ఇక్కడే మనకు ‘ వివాదం ‘ చాలా అవసరం. ఇలా మనం వివాదం లో దిగడం అతి ముఖ్యమైన అంశం. ప్రత్యేకించి, మనం నిరాధార నమ్మకాలు ఏర్పరుచు కుంటున్నప్పుడు, వాటి పరిణామాలు కూడా ఇర్రేషనల్ గా మారుతాయి. ఇట్లా పరిణామాలు ఇర్రేషనల్ గా అంటే హేతు వాద బద్ధం గా లేనప్పుడే , వివాదం మనలను సక్రమం గా ఆలోచింప చేస్తుంది.
మరి ‘ డిస్ ప్యు టేషన్ ‘ లేదా ‘ వివాదం ‘ ఎవరి తో చేయాలి ? :
మనం హేతు వాద బద్ధం కాని ఇర్రేషనల్ నమ్మకాలు ఏర్పరుచుకున్నప్పుడు , వాటిని మన విజ్ఞత తో, మనమే పరిశీలించాలి. అంటే మనమే మన ‘ చెడు ‘ ఆలోచనలతో, నెగటివ్ థింకింగ్ తో ‘ వివాదానికి దిగాలి ‘ . ఈ విషయం హాస్యాస్పదం గా అనిపించ వచ్చు కానీ నిజం గా ఈ విధానం మనకు ఎంతో ఉపయోగ పడుతుంది. ఈ వివాదం ఎట్లా చేసుకోవాలో చూద్దాము .
మనం ముందు గా మన నిరాధార నమ్మకాలను నమ్మే ముందు
1. ఆ నమ్మకానికి సరి అయిన ఆధారం ఉందా లేదా అని మనలనే ప్రశ్నించుకోవాలి.
2. తరువాత ఆట్లాంటి నమ్మకం మనకు లేక పొతే , ఇతర మార్గాలు ఏమి ఉన్నాయో కూడా ప్రశ్నించుకోవాలి.
3. ఒక వేళ మన నిరాధార నమ్మకమే , లేదా అభిప్రాయమే నిజం గా జరిగితే, దాని పరిణామాలు ఎట్లా ఉంటాయో కూడా ఆలోచించుకోవాలి.
4. చివరగా మన నమ్మకం అది సరి అయిన ఆధారాలతో ఉన్నా, లేకున్నా , అది మన భవిష్య జీవితం లో ఎట్లా ఉపయోగ పడుతుందో కూడా మనమే ఆలోచించుకోవాలి.
వచ్చే టపాలో పైన చెప్పుకున్న నాలుగు అంశాలతో కూడిన ‘ వివాదాన్ని ‘ ఎట్లా ఉపయోగించుకొని , లాభ పడగలమో, ఉదాహరణ తో చూద్దాము !