ABCDE లతో ఆప్టిమిజం ఎట్లా నేర్చుకోవచ్చు ?.24.
మనం, క్రితం రెండు టపాలలో వరుస గా A అంటే అడ్వర్సిటీ ( Adversity ) అనీ, B అంటే బిలీఫ్ ( Belief ) అనీ, తెలుసుకున్నాము కదా !
ఇంకా అవి ఏమిటో , మన ఆలోచనలను ఎట్లా ప్రభావితం చేస్తాయో కూడా చూశాము కదా ! . ఇప్పుడు మనం మూడవ అక్షరం సి ‘ C ‘ ( emotional Consequences ) , అంటే కాన్సి క్వేన్సెస్, అంటే మనం చెందే అనుభూతుల పరిణామాలు ఎట్లా ఉంటాయో తెలుసుకుందాము. ముందు చెప్పుకున్నట్టు, ప్రతి సంఘటన తరువాతా, మన నమ్మకాలూ , వాటితో మన అనుభూతుల పరిణామాలు మనం నెమరు వేసుకుంటూ ఉంటాము. అంటే మన మనసులో మెదలుతూ ఉండి, మనం తరువాత చేయబోయే పనులలో, ప్రధాన పాత్ర వహిస్తాయి. మనం చూశాము కదా రేషనల్ ఇంకా ఇర్రేషనల్ బిలీఫ్ లు, అంటే హేతు బద్ధం అయినవీ, హేతుబద్ధం కాని నమ్మకాలు మనకు ఎట్లా ఏర్పడుతాయో ! ఇక్కడ గమనించ వలసినది , మన నమ్మకాలు, ఆధార రహితం గానూ, హేతుబద్ధం కానివి గానూ ఉంటే , తదనుగుణం గా వాటి పరిణామాలు కూడా ఆధార రహితం గా హేతుబద్ధం కానివి గా ఉంటాయి. అదే విధం గా మన నమ్మకాలు , ఆధార సహితం గానూ , హేతు బద్ధం గానూ ఉంటే, పరిణామాలు కూడా అట్లాగే ఉంటాయి.
ఒక ఉదాహరణ: వినయ్ కాలేజీలో చాలా మిత భాషి. మధ్య తరగతి కుటుంబం లో పెరుగుతూండడం తో ఆశలు, ఆశయాలూ, ఆకాశాన్ని అంటుకునేట్టు, ఊహించు కుంటున్నా, ఆ ఆలోచనలతోనే కాలం గడుపుతాడు. కానీ చదువులో చురుకు.
ఈ అన్ని లక్షణాలూ చాలా నచ్చాయి వినయ్ తో చదువుతున్న అందమైన అమ్మాయి హేమ కు. హేమ ఆ విషయాన్ని ఎప్పుడూ వినయ్ కు తన చూపుల తోనే తెలియ చేసేది. వినయ్ వంక స్నేహ పూర్వకం గా , ఆరాధనా భావం తో చూసేది.
ఆమె కళ్ళు కూడా విశాలం గా అందం గా ఉండడం చేత , ఆ కళ్ళు తెలిపే భావాలు మిగతా క్లాస్ మేట్స్ కు చాలా వరకూ అర్ధమవుతున్నా , వినయ్ మాత్రం సందిగ్ధం తో పడ్డాడు. ‘ హేమ కు నేనంటే నిజంగా ఇష్టం ఉందా ? లేక ఇది ఆకర్షణా? ప్రేమా ? అని ఆలోచించ సాగాడు. పరీక్షల ముందు హేమ చాలా సీరియస్ గా చదువుతూ ఉంది. వినయ్ వంక అసలు చూడట్లేదు. పరీక్షల వత్తిడి తో ఉన్నా , వినయ్ , హేమ ప్రవర్తన లో మార్పు సహించ లేక పోయాడు. ‘ ఏమిటి హేమ ఇట్లా ప్రవర్తిస్తూంది ? వేరే ఎవరైనా పరిచయం అయి ఉంటారు. అందులో నేను ధనవంతుడిని కాను కదా ! నాకు హేమ దక్కదేమో ! ‘ ఇట్లాంటి నెగెటివ్ ఆలోచనలూ , ఇర్రేషనల్ బిలీఫ్ లతో , సరిగా చదవలేక పోయాడు.మిత భాషి అవడం వల్ల, తన సందేహాన్ని హేమను అడిగి తీర్చుకో లేక పోయాడు. అట్లాగే పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూశాడు. హేమ కనిపించినా తరచూ మొహం చాటు చేసుకునే వాడు. అసలే మిత భాషి , దానికి తోడు ఇప్పుడు విచార వదనం కూడా ! ‘ హేమ లేని జీవితం ఊహించుకుంటూ , పరీక్షా ఫలితాలు కూడా నెగెటివ్ గా ఊహించుకుంటూ , జీవితం మీద విరక్తి కూడా పెంచుకుంటున్నాడు. ఏకాంతం గా క్యాంపస్ లో ఒక చోట దిగాలు పడి కూర్చున్నాడు, మొహం చాతీ మీద వంచుకుని ! ఒక్క సారిగా ప్రక్క నుంచి వచ్చిన పిలుపు తో ఉలిక్కి పడ్డాడు ‘ వినయ్ కాంగ్రట్యు లేషన్స్, నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాసయ్యావు ! నా నంబర్ క్రింద వరసలో చూశాను ! ఏమీ అనుకోకు , ఎక్జాంస్ టైం లో నీతో మాట్లాడ లేక పోయాను. నాన్న గారు హాస్పిటల్ లో చేరాల్సి వచ్చింది ఆ టైం లో. బాగా టెన్షన్ ఫీల్ అయ్యాను ! లకీలీ ఎవ్రీ థింగ్ ఈజ్ ఫైన్ నౌ ! షల్ వి సెలెబ్రేట్ నౌ ! అంది హేమ, చాలా ఆనందం తో ! విషాదపు అంచులకు తనకు తానుగా తోసుకుంటున్న వినయ్ పరిస్థితి , ఒక్క ‘ కుదుపు ‘ తో అమృత భాండం లో పడేసినట్టు అయింది అప్పుడు. ఒక్క సారిగా లేచి, తప్పు చేసినవాడి లాగా , సిగ్గు తో , హేమ చేతిని తీసుకుని క్యాంటీన్ వైపు నడిచాడు వినయ్ !
ఇప్పుడు వినయ్, హేమ లకు ABCDE లతో పని లేదు, ఒక్క ‘ L ‘ తో తప్ప ! ( కానీ ABC లు, వినయ్ ను ఎట్లా మార్చాయో గమనించారా ?! )
వచ్చే టపాలో ఆప్టిమిజానికి ఇంకో ముఖ్యమైన అక్షరం, అదే నాల్గవ అక్షరం ‘ D ‘ ( D is abreviation for Disputation ) గురించి తెలుసుకుందాము !