పాజిటివ్ సైకాలజీ- విశదమైన ఆప్టిమిజం – 17.
మనం మార్టిన్ సెలిగ్మన్ ప్రతిపాదించిన ఆశావాదం లేక ఆప్టిమిజం గురించి తెలుసుకుంటున్నాము కదా ! ఇప్పుడు మానవులలో ఈ ఆప్టిమిజం ఏ ఏ రకాలు గా కనపడుతుందో చూద్దాము !
ముఖ్యం గా ఈ మనస్తత్వం మూడు రకాలు గా కనిపించ వచ్చు. అంటే ఈ మూడు రకాలూ ఒకే వ్యక్తి లో కాక , ఈ మనస్తత్వాన్ని బట్టి మానవులు మూడు రకాలకు చెందుతారు అంటే సరి గా ఉంటుంది. మొదటి రకం : తాత్కాలికమూ , శాశ్వతమూ : ఈ రకం లో నిరాశా వాద మానవులు , వారి జీవితం లో ఏదైనా అనుకున్నట్టు జరగక పొతే , ఇక వారికి ఎప్పుడూ ఏదీ సక్రమం గా జరగదు అనుకుంటారు.
ఒక ఉదాహరణ : ప్రమోద్ ఒక మల్టీ నేషనల్ కంపెనీ లో ఉద్యోగానికి ఇంటర్వ్యు లో భాగం గా బోర్డ్ రూం లో ఒక టాక్ ఇవ్వ వలసి వచ్చింది. తను అనుకున్నట్టు మాట్లాడ లేక పోయాడు. ఇక అంతర్మధనం మొదలైంది. నేను ఎప్పుడూ ఇంతే ! నాకు మాట్లాడం చేత కాదు ! దానికి తోడు ఆ వెధవ పవర్ పాయింట్ కూడా అప్పుడే ఫ్రీజ్ అయి చావాలీ ! మొత్తం ప్రెజెంటేషన్ ను నాశనం చేశాను! బోర్డ్ రూం లో ఉన్న వారందరూ ఏమనుకుంటారు? నేను ఫస్ట్ క్లాస్ లో పాసయిన ఇంజినీర్ లా ఇంప్రెషన్ ఇవ్వలేదు ! అని తనను విమర్శిచుకుంటూ , విచార పడుతున్నాడు
ఇలాంటి పరిస్థితి నే ఆనంద్ కూడా ఫేస్ చేశాడు. కానీ ఆనంద్ , ప్రమోద్ కాదు , ఆనంద్ ఆనందే ! ఆనంద్ ఆశావాది అంటే ఆప్టిమిస్ట్ . ఇంటర్వ్యు కాగానే ‘ ఆ కొద్ది గా పవర్ పాయింట్ సరిగా పని చేసి ఉంటే , ఇంకా బాగుండేది నా ప్రెజెంటేషన్. అందులో బోర్డ్ రూం లో అందరూ లంచ్ తరువాత భుక్తాయాసం తో మగత నిద్ర లో ఉన్నట్టున్నారు, సరిగా కాన్సంట్రేట్ చేయలేదు నా టాక్ మీద . ఇంకో ఇంటర్వ్యు లో నాకు ముందే అవకాశం వస్తే , ( ఇంటర్వ్యు బోర్డ్ మెంబర్లు ఎలర్ట్ గా ఉన్నప్పుడు ) నేను ఇంకా బాగా నా టాక్ ప్రిపేర్ చేసుకొని , ఇంకా బాగా టాక్ ఇచ్చి సెలెక్ట్ అవుతాను ! అని అనుకున్నాడు
డాక్టర్ కారెన్ రీవిచ్ అనే సైకాలజిస్టు ఇలా తాత్కాలికం గా నూ శాశ్వతం గానూ ఆశావాద , నిరాశా వాద మనస్తత్వాలను ఇంకో విధం గా కూడా వివరించారు. పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్ధి ‘ నేను శుంట ను ‘ అని అనుకున్నా డనుకోండి. ఇందులో నిరాశావాదం శాశ్వతం గా గుప్తమై ఉంది. అంటే ఈ విద్యార్ధి ఆలోచనా ధోరణి ఒక శాశ్వతమైన నిరాశా ధోరణి ని ప్రతి బింబిస్తుంది. అంటే దాని ప్రభావం తను తరువాత మళ్ళీ తీసుకునే పరిక్ష మీద కూడా ఉంటుంది. అలాగే పరీక్ష ఫెయిల్ అయిన ఇంకో విద్యార్ధి ‘ పరీక్షల ముందు నేను సరిగా రివైజ్ చేయను ‘ అని అన్నాడనుకొండి. అప్పుడు ఆ విద్యార్ధి మనస్తత్వం , కేవలం తాత్కాలిక పెసిమిజాన్నే ప్రతిబింబిస్తుంది. అంటే ఈ విద్యార్ధి లో ‘ సరిగా పరీక్ష ముందు కూడా రివైజ్ చేస్తే పాస్ అవగలను అనుకునే ఆశావాదం తొంగి చూస్తుంది.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !