పాజిటివ్ సైకాలజీ – జీవితార్ధం తెలుసుకోవడం తో అధికానందం .14.
క్రితం టపాలో చూశాము కదా ఫ్లో మన జీవితం లో ఎట్లా ఉపయోగ పడుతుందో. ఇప్పుడు అధికాననందం కోసం మన జీవితార్ధం తెలుసుకుని తదనుగుణం గా మన జీవన శైలి ని మార్చుకునే సంగతులు కూడా తెలుసుకుందాము.
మనం మన జీవితాలలో ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్ర కు ఉపక్రమించే వరకూ , ‘ ఒకటే పరుగు ‘ ! సామాన్యం గా ఈ ‘ పరుగు ‘ ఎంత తీవ్రం గా మన జీవితాలను ఆక్రమించిందంటే , మనం జీవితాన్ని యాంత్రికంగా గడుపుతూ ఉంటాము. అంటే పని తరువాత ఇంకోటి చేస్తూ , ఈ జంజాటం లో జీవితార్ధం పూర్తిగా మన దృష్టి లో ఉండదు.ఈ క్రింది పద్ధతులతో మనం జీవితార్ధం కూడా తెలుసుకుని , వాటిని అమలు పరుస్తూ , తద్వారా అధికానందం పొందవచ్చు. ఇక్కడ కూడా ఈ పద్ధతులకు వయసు తో నిమిత్తం లేదు.ఏ వయసుకు చెందినా వారైనా వీటిని పాటించ వచ్చు.
జీవితం బేరీజు వేసుకోవడం: అంటే మనం మన జీవితం లో ఒక నిర్ణీత సమయాలలో మన, ఆరోగ్యం గురించీ, కుటుంబం గురించీ, ఆర్ధిక సమస్యల గురించీ , మనం మనకు ఉల్లాసం కలిగించే కార్య క్రమాల గురించీ ( అంటే , ఆడే ఆటలు , చేసే విహారాలూ లాంటివి ), కొంత సమయం వెచ్చించి , ఆ యా విషయాలలో తీసుకోవలసిన చర్యలు , జాగ్రత్తలు ,ఏవైనా ఉన్నాయా అని వివరం గా ఆలోచించి , మన జీవన శైలి లో తగు మార్పులు తెచ్చుకుంటూ ఉండాలి. అలాగే దీర్ఘ కాలికం గా మన లక్ష్యాలు ఏమిటి ? , అందుకు మనం ఏ పధకాలు వేసుకోవాలి ? అన్న విషయాలు కూడా మనం కూలంకషం గా ఆలోచించుకుని తగు నిర్ణయాలు తీసుకో గలగాలి.
డైరీ లో క్రమం గా నోట్ చేసుకోవడం : ప్రతి రోజూ , ఆ రోజులో మనకు ఆనందం కలిగించిన సంఘటనలు కొన్ని అంటే కనీసం మూడైనా , క్రమం గా మన దిన చర్య లేక డైరీ లో నోట్ చేసుకుంటే , మనకు ఆనందం కలిగిసుందని వివిధ పరిశీలనల వల్ల తెలిసింది. అలాగే ఆ సంఘటనలు మనకు ఎందుకు ఆనందం కలిగించాయో కూడా వ్రాసుకుంటే , మనం తరువాత ఏ సమయం లో నైనా అది చూసుకుని ఆనందం పొందగలుగు తామన్న మాట.
కృతఙ్ఞతలు తెలుపుకోవడం : మనం మన జీవితాలలో, వివిధ దశలలో , ఎంతో కొంత ఇతరులతో , అంటే మన గురువులతో కానీ , బంధువులతో కానీ , లాభం పొందుతాము. మన మనసులలో కృతజ్ఞతా భావం ఉన్నా , ఆ కృతజ్ఞతను వారికి వ్యక్తం చేయడంలో విపరీతమైన ఆలస్యం , తాత్సారం చేస్తూ ఉంటాము. అలా కాకుండా , మనకు మేలు చేసిన వారికి తగిన సమయం లో ( ఆలస్యం లేకుండా ) మన కృతఙ్ఞతలు తెలియ చేస్తూ ఉంటే కూడా మన ఆనందం అధికమవుతుందని తెలిసింది.
మన కృతజ్ఞతలను , చిన్న బహుమతుల రూపం లో కానీ , గ్రీటింగ్ కార్డు రూపం లో కానీ , లేక వ్యక్తిగతం గా మేలు చేసిన వారిని కలిసి, వారితో కొంత సమయం గడిపి గానీ, ఇలా ఎన్నో విధాలు గా తెలుపు కోవచ్చు.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !