పాజిటివ్ సైకాలజీ- సేవరింగ్ తో జీవితం లో అధికానందం పొందటం ఎట్లా ?.5.
క్రితం టపాలో పరిశీలించాము కదా ! మన దైనందిన జీవితం లో వివిధ ‘ రుచులను ‘ మనం కేవలం మన కారణం వల్ల, సంపూర్ణం గా ఆస్వాదించలేక పోతున్నామో !
ఈ విషయం మీద విపరీతం గా పరిశోధన, పరిశీలనలు చేసి ఫ్రెడ్ బ్రయంట్, జోసఫ్ వెరోఫ్ ( లోయోలా విశ్వ విద్యాలయం నుంచి ) ఒక అయిదు కిటుకులు మనకు సూచించారు. అంటే ఈ కిటుకులు అర్ధం చేసుకుని , ఆచరిస్తే , మనం ‘ ఈ రుచులను’ సంపూర్ణం గా లేక చాలా వరకు సంపూర్ణం గా ఆస్వాదించ గలుగు తామన్న మాట !
ఇక్కడ మనం ‘ రుచులు ‘ అంటే కేవలం ఆహార పదార్ధాల రుచులనే అనుకో కూడదు. ‘ టేస్త్స్ అఫ్ లైఫ్ ‘ అంటే ‘ జీవిత రుచులు ‘ అవి ఒక మంచి సినిమా చూడడం కావచ్చు, సంగీతం వినడం అవవచ్చు. ఇతరులతో ఆడే ఆట కావచ్చు, ఇతరులతో గడిపే సమయం కావచ్చు, లేక ఆమె అతడితోనో , అతడు ఆమెతోనో ‘ గడిపే’ సమయం కావచ్చు. లేక ఒక తండ్రి , ఒక తల్లి తమ చిన్నారులతోనో , లేక వారు పెరిగాక వారితో గడిపే సమయం కావచ్చు. ఇలాంటివన్నీ మన జీవితాలలో అత్యంత విలువైన , అమూల్యమైన సమయాలూ , క్షణాలూ !
ఇప్పుడు ఆస్వాదన అంటే సేవరింగ్ లో ఉన్న కిటుకులు ఒకటొకటి గా తెలుసుకుందాము !
1. మన ఇంద్రియ జ్ఞానం చురుకు గా ఉండడం : ( దీనినే షార్పెనింగ్ అవర్ పర్సెప్షన్ అంటారు ):
మనకందరికీ తెలుసు మన ఇంద్రియాలంటే మన కళ్ళూ , చెవులూ, నాలుక అని. వాటితో పాటు స్పర్శ, అంటే మన చేతి స్పర్శ అంటే వేళ్ళతో తాకి స్పృశించడం . అంటే మనం మనం పొందుతున్న రుచులను బట్టి మన ఇంద్రియాలను సంపూర్ణం గా కేంద్రీకరించాలన్న మాట. ఇక్కడ ఈ ఉదాహరణలు చూడండి:
మీరు ప్రయాణం చేస్తున్నారు. చెవులకు హెడ్ ఫోన్స్ లోనుంచి మీకు ఇష్టమైన పాట వింటున్నారు. మిగతా ‘విసిగించే ‘ శబ్దాలు మీకు వినపడవు. మీకు ఇష్టమైన పాట వింటూ , మిగతా శబ్దాలను జాగ్రత్త గా బ్లాక్ చేస్తున్నారు. ( దీనినే సెలెక్టివ్ అటెన్షణ్ అంటారు శాస్త్రీయం గా ). అలాగే మీరు ఒక పార్టీ లో ఉన్నారు , మీ కొలీగ్స్ తో ఒక చిన్న గ్రూప్ లో మాట్లాడుతున్నారు , వారితో కరచాలనం అంటే షేక్ హ్యాండ్స్ చేస్తున్న్నారు. అంటే మీరు మీ స్పర్శ ను కూడా ఉపయోగిస్తున్నారన్న మాట.
అలాగే మీకు నచ్చిన యువకుడి తో నో , యువతి తో నో సమయం గడుపుతున్నారు. అప్పుడు మీ నయనాలూ, చెవులూ , మీ పరిచయాన్ని బట్టి , స్పర్శ , కూడా చాలా చురుకు గా ఉంటుంది కదా ! ( ఈ విషయం లో మనకు మన ఇంద్రియాల ఏకాగ్రత గురించి ఏ సైకాలజిస్టూ సలహా ఇవ్వ నవసరం లేదనుకుంటాను ! )( కామ వాంఛ లో స్పర్శ ప్రాముఖ్యత గురించి మునుపటి టపాలో సవివరం గా తెలపటం జరిగింది కదా వీలయితే ఒకసారి చూడండి ! ) అలాగే మీరు మీ ఇష్టమైన లేక పరిచయమయిన వారితో ఒక చోట మీకు ఇష్టమైన ఆహారం తింటున్నరనుకుంటే , అక్కడ కూడా, మీ ఇంద్రియాలన్నీ చురుకుగా ఉంచుకోవాలి కదా !
2. లీనమై పోవడం: ( దీనినే అబ్సార్ప్షన్ అంటారు అంటే అబ్సార్బ్ అయిపోవడం ): ఇక్కడ మనం చేయవలసినది ఏమిటంటే మనం మన ఇంద్రియాలను చురుకు గా ఉంచుకొని , మనం ఆయా ఇంద్రియాలను ‘ ఉపయోగిస్తున్నప్పుడు ‘ ఆ క్రియ లో సంపూర్ణం గా
లీనమై పోవాలి. క్రితం టపాలో ప్రకాశ రావు ఎలా లీనమై పోయాడో చూశారా బ్రేక్ ఫాస్ట్ చేస్తూ , ఆ రుచులు ఆస్వాదిస్తూ !. ఇక్కడ కేవలం మన ఇంద్రియాలకే పని కల్పించాలన్న మాట, ఇతరం ఏమీ ఆలోచించ కుండా !
పైన మనం తెలుసుకున్న రెండు కిటుకులూ ఉపయోగించి మీ ఆస్వాదన లో తేడా కనిపించిందో లేదో తెలియ చేయండి ! ( మీ జీవిత రుచులలో వేటిలో నైనా ! ) ఎందుకంటే ఈ సూత్రాలు మనం ఆచరించ దానికే కానీ , కేవలం బ్రౌజ్ చేయడానికి కాదు కదా !
పైన ఉన్న ఫోటో చూడండి. ఇనాగురల్ ఐ సి సి ప్రపంచ కప్పు ను భారత క్రికెట్ జట్టు గెలిచిన తరువాత , బొంబాయి వీధులలో యాత్ర చేస్తున్న దృశ్యం. గమనించ వలసినదేమిటంటే ఈ ఫోటోలో ఉన్న వేలాది ప్రజలూ , సమిష్టి గా , ఈ విజయాన్ని, ప్రియం గా , ఆస్వాదిస్తూ ఉండడం ! సేవరింగ్ అంటే ఆస్వాదన లో అధికానందం పొందాలంటే, కంపెనీ అంటే ఇతరులతో ఆస్వాదించడం కూడా చాలా ముఖ్యం. అదే ఈ ఫోటోలో మనం చూస్తున్నది !
వచ్చే టపాలో మిగతా కిటుకులు తెలుసుకుందాము !