పాజిటివ్ సైకాలజీ, పాజిటివ్ థింకింగ్ కన్నా ఎందుకు ఉత్తమం ?. 3.
పాజిటివ్ సైకాలజీ మన ప్రస్తుత సమాజం లో అన్ని రంగాలకూ సంబంధించినది గా అభివృద్ధి చెందుతూ ఉంది.
పాజిటివ్ సైకాలజీ కి అత్యంత ప్రతిభావంతులు అయిన సైకాలజిస్టు లతో వేసిన పునాది ఉంది. అంటే వారు చెప్పేది ‘ చెత్త ‘ గా కొట్టి పారేయ లేము. ఎందుకంటే వారు చెప్పేది ,అనేక సంవత్సరాలు , అనేక ప్రత్యక్ష , పరోక్ష పరిశీలనలు చేసిన అనుభవం తో. అంటే వారు కేవలం వివిధ గ్రంధాల ద్వారానే విజ్ఞానం సముపార్జన చేయడమే కాక వారు చూసిన అనేక మైన వ్యక్తుల మనస్తత్వాలు, పరిశీలించి ఆ సారాంశాన్ని అందిస్తున్నారు.
వారు మనకు, మనం ఎట్లా జీవించాలి అనే విషయం గురించి చెప్పడం లేదు. వారు గమనించిన వివిధ పద్ధతులూ కిటుకులూ మనకు ఎంత బాగా లాభ పడతాయో, అనుభవ పూర్వకం గా వివరిస్తున్నారు.
వారు ఏదో విధంగా పాజిటివ్ గా ఉండడం సులభం అనీ చెప్పటం లేదు. ఎందుకంటే మన మెదడులు శాస్త్రీయం గా చేసిన పరిశోధనలలో , నెగెటివ్ గా ఆలోచించడానికే అనుగుణంగా ఉన్నాయి. అంటే మనం నెగెటివ్ గానే ఆలోచిస్తూ ఉండమని దీని అర్ధం కాదు. కానీ మనం వివిధ పద్ధతులను అవగాహన చేసుకొని వాటిని మన నిత్య జీవితం లో ఆచరిస్తే వాటి ఫలితాలను పొంది , ఆనంద జీవితం గడపగలమని వారు తెలియ చేస్తున్నారు.
ఇంకా పాజిటివ్ సైకాలజిస్టులు కేవలం వ్యక్తులనే కాక, తద్వారా , వ్యవస్థనూ , సమాజాన్నీ పురోగమించెట్టు చేసే ప్రయత్నం లో ఉన్నారు.
మరి పాజిటివ్ థింకింగ్ మాట ఏమిటి ?
పాజిటివ్ థింకింగ్ ను ప్రమోట్ చేసే వారు ఆ మాటను ఒక వినిమయ వస్తువు గా భావించి దానిని ఎక్కువగా ‘ అమ్ముదామని ‘ విపరీతం గా ప్రయత్నం చేస్తుంటారు.
వారి దగ్గర కొన్ని కిటుకులు మాత్రమె ఉంటాయి. వారు ఆ కిటుకులతో ‘ మీ జీవితం మారిపోతుంది ‘ ‘ మీరు ఒక నూతన ‘ మీరు ‘ అవుతారు. ‘ మీరు మీ భయాందోళనలు అన్నీ పోగొట్టు కుంటారు ‘ అని అవాస్తవిక ‘ ప్రకటనలు ‘ ‘ భరోసాలు ‘ ఇస్తుంటారు.
పాజిటివ్ థింకింగ్ వాదం అరుదు గా శాస్త్రీయం గా నిరూపించబడుతుంది. ఈ వాదాన్ని ప్రచారం చేసే వారు, కొద్ది మంది వారి జీవితం లో సాధించిన విజయాల గురించి చెబుతూ , వారు చేసిన విజయ పధ ప్రయాణం వివరిస్తారు. మనం ఆ వ్యక్తులను, వారి విజయ రహస్యాలనూ అనుకరిద్దామని చేసే ప్రయత్నం లో , త్వరగా మంచి ఫలితాలను చూడలేము. దానితో మనము ‘ ఇంకా గట్టిగా కృషి చేయలేదేమో ‘ అని క్రుంగి పోయే అవకాశం ఉంది. దానితో నిరాశా నిస్పృహలు కూడా ఎక్కువ ఆవ వచ్చు.
పాజిటివ్ థింకింగ్ ను అమలు చేయమని చెప్పే వాదనలో శాస్త్రీయ మైన పునాదులు లేవు. ‘ మీరు అనుకున్నది ఏదైనా సాధించ గలరు ‘ ఈ కిటుకులు పాటిస్తే ‘ అని చెబుతుంటారు.
కానీ యదార్ధం దీనికి దూరం గా ఉంటుంది. కొందరు ఈ పాజిటివ్ థింకింగ్ బోధించే ‘గురువులు’ ‘ మీరు ఈ కిటుకులు పాటిస్తే , ఎక్కడైనా విజయం సాధించ గలరు, మీరు మీ కారు పార్కింగ్ చేసే సమయం లో కూడా , ( అంటే ఈ కిటుకులతో మీరు కారు పార్క్ చేసే స్థలం పొందటం లో విజయ వంతమవుతారు ) అంటూ ఈ పద్ధతిని హాస్యాస్పదం చేస్తున్నారు.
ఇలాంటి పాజిటివ్ థింకింగ్ ధోరణి ప్రపంచం లో , తినటానికి తిండీ , ఉండడానికి వసతీ లేని కోట్లాది పేద ప్రజలను అవమాన పరిచే విధం గా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి పాజిటివ్ థింకింగ్ , కేవలం పాశ్చాత్య కోరికలకు అద్దం పట్టే రీతిలో కేవలం ఒక సమస్య లేని కారు పార్క్ దొరికితేనో , ఒక మంచి ఇల్లు ఉంటెనో సంతృప్తి పడే మనస్తత్వానికి ప్రతీక.
ఇప్పుడు తెలుసుకున్నాము కదా పాజిటివ్ సైకాలజీ అంటే ఆశావాద మనస్తత్వానికీ , పాజిటివ్ థింకింగ్ , లేక ఆశావాద ఆలోచనలకూ తేడా !
ఇంత ఉపయోగ కరమైన , లాభదాయకమైన , మన జీవితాలను పరిపూర్ణం చేయగలిగే , పాజిటివ్ సైకాలజీ లేక ఆశావాద మనస్తత్వం గురించి వివరం గా వచ్చే టపా నుంచి తెలుసుకుందాం !