యాంజియో ప్లాస్టీ లో స్టెంట్ వేయడం అంటే ఏమిటి ?.33.
మనం క్రితం టపాలో చూశాము , గుండెకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనుల పూడికను ఒక క్యాతెటార్ ద్వారా చిన్న బెలూన్ ను ధమని లోకి ప్రవేశ పెట్టి ఆ బెలూన్ ను లాగుతూ ఆ పూడికను లేక ప్లేక్ ను అక్కడనుంచి తీసి వేయడం.
అట్లా ధమనిలో ఏర్పడ్డ పూడికను అంటే పార్షి యల్ బ్లాక్ ను తీసివేసిన తరువాత , ఆ ధమని మళ్ళీ రక్త సరఫరా ను మామూలు గా గుండె కండరాలకు సరఫరా చేస్తుంది. కానీ కొన్ని పరిస్థితులలో ఆ ధమని మళ్ళీ పూడుకు పోవడం కూడా జరుగుతుంటుంది.
ఇలా మళ్ళీ కరోనరీ ధమనులు పూడుకు పోకుండా ఒక స్టెంట్ ను ప్రవేశ పెడతారు. ఈ స్టెంట్ సాధారణం గా ఒక సున్నితమైన లోహం తో చేసిన జాలీ లాగా ఉంటుంది. కానీ ఈ జాలీ లేక వల లాగా ఉన్న స్టెంట్ ఒక గొట్టం ఆకారం లో ఉంటుంది. అతి సున్నితం గా ఈ స్టెంట్ , లోహం పోగులతో చేసిన వల లా ఉన్నప్పటికీ , చాలా గట్టిగా ఉండి అది ఉన్న ప్రదేశం లో ధమని ని కొలాప్స్ అవకుండా అంటే ముడుచుకు పోనీకుండా ఉంచుతుంది. అలా ఉంచడం వల్ల రక్త ప్రసరణ సరిగా అందుతుంది , ఆ ధమని ద్వారా !
పైన ఉన్న మొదటి పటం చూడండి అందులో క్యాతెటార్ ద్వారా ప్రవేశ పెట్టిన బెలూన్ ఇంకా స్టెంట్, మొదట ముడుచుకు పోయి ఉంటాయి. పాక్షికం గా పూడుకుపోయిన కరోనరీ ధమని లో ప్రవేశించిన తరువాత , బెలూన్ ను పెద్దగా చేసి దాని ద్వారా అక్కడ ఉన్న పూడిక అంటే ప్లేక్ ను పెకిలించుతారు. అలా పెకిలించిన తరువాత బెలూన్ తో పాటు ప్రవేశ పెట్ట బడిన స్టెంట్ ( అప్పటి వరకూ ముడుచుకు పోయి ఉంటుంది ) అప్పుడు తెరుచుకుని ఆ ధమని ని మళ్ళీ పూడుకు పోకుండా, ముడుచుకు పోకుండా ఉంచుతుంది.
ఇక రెండో పటం లో ఒక వేలు మీద ఉంచిన రెండు స్టెంట్ లను చూడండి వాటి నిజమైన పరిమాణం ఎంతో అవగాహన ఏర్పడడానికి ( అవి సాధారణం గా కరోనరీ ధమని ఎంత వ్యాసం తో ఉంటాయో తెలియ చేస్తున్నాయి కదా ! )
వచ్చే టపాలో ఇంకొన్ని వివరాలు చూద్దాము !