ఏస్ ఇన్హిబిటార్ మందులు హై బీ పీ ని ఎట్లా తగ్గిస్తాయి ? .31.
మనం క్రితం టపాలో చూశాము. మొదటి దశలో కొత్తగా అధిక రక్త పీడనం కనుక్కొన్నప్పుడు , A అంటే ఏస్ ఇన్హిబిటార్ వాడమని సలహా ఇస్తారని.
ఈ ఏస్ ఇన్హిబిటార్ 55 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారికి వాడమని సలహా ఇవ్వడం జరుగుతుంది.
ఈ ఏస్ ఇన్హిబిటార్ ఎట్లా పనిచేస్తుందో చూద్దాము.
క్రింద పటం గమనించండి.

మన రక్త నాళాలు నార్మల్ గా అంటే సాధారణం గా వెడల్పు అయినప్పుడు , అంటే వాటి వ్యాసం పెరిగినప్పుడు రక్త పీడనం తగ్గుతుంది. అప్పుడు వాటి గోడలలో ఉన్న కండరాల కణాలకు యాంజియో టేన్సిన్ అనే రసాయనం అతుక్కుంటుంది.
( మనం చూశాము కదా , మునుపటి టపాలో , మన రక్త నాళాలు లోహం తో చేసిన పంపు ల లా కాక , కండరాల పొరతో చేసిన పంపులని. రక్త నాళాలలో ఈ కండరాలు ఉబ్బెత్తుగా మనకు సహజం గా కనిపించే చేతి, కాళ్ళ కండరాలు గా కాక పలుచటి పొరలు లాగా అమరి ఉంటాయి. ఉదాహరణ కు మనం పొడవాంటి బూర అంటే బెలూన్ , ఊదక ముందు అంటే గాలి నింపక ముందు , కుంచించుకు పోయి ఉంటుంది కదా. కానీ అది , దాని లోకి గాలి ఊదినప్పుడు , వ్యాకోచించు తుంది కదా ! అలా వ్యాకోచించడం పలుచటి పొర ద్వారానే అవుతుంది కదా ! అలాగే మన రక్త నాళాలు వ్యాకోచించి ఉన్నప్పుడు , వాటిలో రక్తం ఉన్నా , విశాలం గా ఉండడం తో రక్త పీడనం తగ్గుతుంది )
ఒకసారి యాంజియో టేన్సిన్ అనే జీవ రసాయనం కండరాల కణాలకు అతుక్కొగానే, ఆ కండరాలు సంకోచిస్తాయి అంటే బిగుతు గా అయి తద్వారా, రక్త నాళాల వ్యాసం తగ్గిస్తాయి. ఇలా వాటి వ్యాసం తగ్గటం వల్ల రక్త పీడనం పెరుగుతుంది.
మనం తీసుకునే ఏస్ ఇన్హిబిటార్ మందు యాంజియో టేన్సిన్ అనే రసాయన పదార్ధాన్ని తయారు కాకుండా అడ్డుకుంటుంది.( అందువల్లనే ఈ మందులకు ACE inhibitors అనే పేరు వచ్చింది. ( A C E అంటే Angiotensin Converting Enzyme ) ఆ ఎంజైం ను ఆపి తద్వారా యాంజియో టేన్సిన్ తయారు కావడం తగ్గించడం వల్ల ఈ మందులకు యాంజియోటేన్సిన్ కన్వర్టింగ్ ఎంజైం ఇంహిబిటర్స్ అని పేరు వచ్చింది ). అలా యాంజియో టేన్సిన్ అనే రసాయనం తయారు కాక పోవడం వల్ల లేక దాని తయారీ తగ్గి పోవడం వల్ల , రక్త నాళాలు వ్యాకోచ స్థితి లోనే ఉండి అధిక రక్త పీడనం తగ్గిస్తాయి. పైన ఉన్న పటం లో రెండవ చిత్రం లో ACE inhibitors యాంజియో టేన్సిన్ రక్త నాళాల కండరాలకు అతుక్కోకుండా చేయడం వల్ల , రక్త నాళం వ్యాకోచ స్థితి లోనే ఉండడం గమనించండి.
ఇట్లా అందరిలోనూ రక్తనాళాల వ్యాకోచ సంకోచ క్రియలు జరుగుతూ ఉంటాయి. కానీ అందరిలోనూ అధిక రక్త పీడనం ఉండదు. దానికి కారణం స్పష్టం గా ఇంతవరకూ తెలియదు. కానీ తీవ్రమైన వత్తిడి కూడా ఈ పరిస్థితికి కారణం అవుతుందని కూడా భావించ బడుతున్నది. అంటే మనం నిత్యం వత్తిడి గా ఉంతే అప్పుడు రక్త రక్త నాళాలలో కండరాల పొర ఎక్కువ సంకోచించి , తద్వారా అధిక రక్త పీడనం కలిగించ వచ్చు. అందువల్ల నే వత్తిడి తగ్గించుకునే , రిలాక్సేషన్ , లేక మెడిటేషన్ , లేక యోగా ప్రక్రియలకు ప్రాముఖ్యం చాలా ఉంది, అధిక రక్త పీడనం కంట్రోలు చేయడం లో.
మరి ఏస్ ఇన్హిబిటార్ రోజూ వేసుకోవాలా ?:
రక్త నాళాలు సంకోచం , వ్యాకోచాలు రోజూ జరుపుతుంటాయి కదా ! అందువల్ల రోజూ ఈ మందు తీసుకోవడం మానకూడదు.
ఇంకో గమనిక : ఈ ఏస్ ఇన్హిబిటార్ మందుల పేర్లన్నీ ‘ ప్రిల్ ‘ లేక pril అనే చివరి అక్షరాలతో ఉంటాయి గమనించారా ! అంటే క్యాప్టో ప్రిల్, ఏనాలాప్రిల్, రామిప్రిల్, లిసినోప్రిల్.. ఆలా !
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !