డ్యాష్ ( DASH ) డైట్ లో క్యాలరీల కధ.27.
క్రితం టపాలో మనం చూశాము కదా. క్యాలరీలు మనకు నిత్యం ఏ మాత్రం అవసరమో, అవి, కార్బో హైడ్రే టులూ , ప్రోటీనులూ, ఇంకా కొవ్వు పదార్ధాల రూపంలో రమారమి ఏ నిష్పత్తి లో ఉండాలో !
మన తెలుగు ఇళ్ళలో , లేక తెలుగు వారి ఆచార వ్యవహారాల ననుసరించి చూస్తే , మనం సాధారణం గా మొదట , అన్నం లో ఒక పచ్చడి వేసుకుని తింటాము , మళ్ళీ కొద్దిగా అన్నం లో కూర వేసుకుని తింటాము , మూడో సర్వింగ్ గా మళ్ళీ అన్నం లో పప్పు కానీ, చారు కానీ వేసుకుని తింటూ ఉంటాము. మళ్ళీ చెప్పనవసరం లేదు కదా, అన్నీ రుచికరం గానూ ఉంటాయి కూడా కదా ! చివరగా పెరుగు కానీ, మజ్జిగ కానీ వేసుకుని మళ్ళీ కొద్దిగా అన్నం పెట్టుకుని తింటాము.
ఇది సాధారణం గా శాక హారుల ఇళ్ళలో భోజనం చేసే విధానం. ఇక శాక హారులు కాని వారు కూడా , అన్నం లో , పచ్చడి వేసుకునీ, లేక చేపలో , కోడి కూరో వేసుకునీ, పెరుగు వేసుకునీ కనీసం రెండు మూడు పర్యాయాలు అన్నం తో తినటం జరుగుతుంది.
ఇక్కడ నేను ఏ విధంగానూ , ఆ ఆచార వ్యవహారాలకు వ్యతిరేకం గా ఏ విమర్శా చేయడం లేదు. ఎందుకంటే , నేనూ తెలుగు వాడినే, విదేశాలలో ఉంటున్నా కొంత వరకైనా తెలుగు సంప్రదాయాలు తెలిసునని అనుకుంటున్నాను. అంతే కాక నేనూ అలాంటి భోజనం , చేస్తుంటాను , కానీ అప్పుడప్పుడు మాత్రమే ! ( వేరే గా చెప్ప నవసరం లేదనుకుంటాను , ఇష్టం గా తింటానని ! )
పైన నేను చెప్పిన ఆహార నియమాలలో , మన రాష్ట్రం లోనూ, మన దేశం లోనూ, లేక ఈ ప్రపంచంలోనూ , వివిధ ప్రాంతాలలో ఉంటున్న తెలుగు వారి లో కొన్ని కొన్ని మార్పులూ చేర్పులూ కూడా ఉండ వచ్చు . అది సహజమే కదా ! అవి మీకు తెలియ చేయాలని అనిపిస్తే , నిరభ్యంతరం గా మీ అభిప్రాయం లో తెలపండి.
ఇక్కడ ఉదాహరణకు పై విధంగా చెప్పిన ఆహారం లో , అన్నం ప్రతి ముద్దకూ సర్వింగ్స్ చేసుకోవడం వల్ల , కార్బో హైడ్రేటు ల శాతం లేక నిష్పత్తి విపరీతం గా పెరిగి పోతుంది. అలాగే , మనం చేసుకునే, లేక కొన్న ఊరగాయల్లో లేక పచ్చళ్లలో అంటే ( pickles and chutneys ) లో ఉప్పు శాతం ఎక్కువ గా ఉంటుంది. దానికి తోడు, కూరలలోనూ, చారులోనూ, సాంబారు లోనూ , ఇంకా పెరుగు, మజ్జిగ ,లేక చల్ల లోనూ వేసుకునే ఉప్పు అంతా కలిసి మనకు రోజూ అవసరమయే ఆరు గ్రాములు మాత్రమే ఉంటుందో లేదో మీ ఊహ కు వదిలేస్తాను. అందు వల్ల , మనం రెండు విధాలు గానూ మన శరీరానికి రిస్కు ఎక్కువ చేస్తున్నాము .ఒకటి అధిక ఉప్పు వల్ల అధిక రక్త పీడనం ముప్పూ , అలాగే , అధిక కార్బోహైడ్రేటు ల వల్ల మనం మన దేహం లో సహజం గా ప్యాంక్రియాస్ నుంచి ఉత్పత్తి అయే ఇన్సులిన్ కు రెసిస్తేన్స్ ( insulin resistance ) ఎక్కువ అయి మధుమేహం వచ్చే రిస్కు కూడా ఎక్కువ చేసుకుంటున్నాము. ( పైన ఉదాహరించిన ఆహారం లో స్వీట్స్ అంటే చెక్కెర వేసి చేసిన పదార్ధాలను గురించి ప్రత్యేకం గా చెప్పలేదు కానీ మనకు తెలుసు కదా అవి కూడా ‘ మన నోట్లో రోజూ ఎంతో కొంత , ఏదో ఒక సమయంలో పడుతుంటాయని ! ) అందు వల్ల , ప్రతి ( తెలుగు ) వారూ , వారు ఎక్కడ ఉంటున్నా , వారి ఆహార నియమాలను , ఆరోగ్య కరమైన ఆహార నియమాలు గా మలుచుకునే అవసరం ఎంతైనా ఉంది.
క్రింద పటం వివరణ చూడండి.
ఇక్కడ మనం రోజూ తీసుకునే క్యాలరీలను మూడు తరగతుల వారీగా చెప్పారు. అధిక బరువు తగ్గించు కావాలనుకునే వారు, లేక శారీరిక శ్రమ చాలా తక్కువ గా చేసే వారికి రోజు వారి క్యాలరీలు 1600 అంటే పదహారు వందలు ఉండవచ్చు. అలాగే ఒక మాదిరిగా రోజూ శారీరిక శ్రమ చేసి ఇంట్లో ఒక మాదిరిగా పని చేసి, బయటకు వెళ్లి చదువుకోవడమో, లేక ఆఫీసు పనో చేసే వారు , రెండు వేల ఆరు వందల క్యాలరీలు ( అంటే 2,600 calories per day ), తీసుకోవచ్చు . ఇక శారీరిక శ్రమ ఉదయం నుంచి సాయింత్రం వరకూ చేసే వారికి ఎక్కువ శక్తి అంటే ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం అవసరం . అందు వల్ల వారికి మూడు వేలకు పైగా క్యాలరీలు ఉన్న ఆహారం కావలసి ఉంటుంది. ( అంటే రమారమి 3,100 calories per day ).
ఈ మూడు తరగతుల క్యాలరీలకు చెందిన ఆహారం రోజూ ఎన్నెన్ని సర్వింగ్స్ లో తిన వచ్చో , ఈ క్రింద వివరింప బడింది. ఇది కూడా శాస్త్రీయ డ్యాష్ డైట్ లో భాగమే !

వచ్చే టపాలో ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాము !
ఈ టపా నచ్చితే మీ స్నేహితులకు తెలియ చేయండి http://www.baagu.net. గురించి !